త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Middle East Crisis 2026 | ఈరోజు ఇరాన్‌కు కాళరాత్రే.. భారీ విధ్వంసం సృష్టిస్తాం.. ట్రంప్ హెచ్చరిక

అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ధాటికి ఇరాన్ తలవంచిందని, పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పిందని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ ఇకపై బెదిరింపులకు పాల్పడే "బుల్లీ" కాదని, ఒక "ఓటమి పాలైన దేశం" అని ఎద్దేవా చేశారు. టెహ్రాన్ తన తప్పులను ఒప్పుకోకపోతే సంపూర్ణ వినాశనం తప్పదని, ఈ రోజే అత్యంత శక్తివంతమైన దాడులు ఎదుర్కోవాల్సి ఉంటుందని ట్రంప్ హెచ్చరించారు.

J

International | Published On Mar 7, 2026, 7.23 pm IST

Middle East Crisis 2026 | ఈరోజు ఇరాన్‌కు కాళరాత్రే.. భారీ విధ్వంసం సృష్టిస్తాం.. ట్రంప్ హెచ్చరిక
Advertisement

ఓటమి అంగీకరించినా వదిలేదు లేదు

వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ ఇలా ఓడిపోవడం ఇదే తొలిసారి

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Middle East Crisis 2026 | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రాచ్యంలో యుద్ధం మునుపెన్నడూ లేనంత తీవ్ర స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇరాన్‌ను "మిడిల్ ఈస్ట్ లూజర్" (Loser of the Middle East) అని సంబోధించిన ట్రంప్, ఆ దేశంపై నేడు భారీ ఎత్తున దాడులు జరిగే అవకాశం ఉందని బాంబు పేల్చారు.

Middle East Crisis 2026 | "క్షమాపణలు కోరిన ఇరాన్.. అది మా విజయం!"

ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన పొరుగు దేశాలపై జరిగిన దాడులకు క్షమాపణలు చెప్పడంపై ట్రంప్ స్పందించారు. తన 'ట్రూత్ సోషల్' వేదికగా స్పందిస్తూ.. "అమెరికా, ఇజ్రాయెల్ శక్తులు ఇరాన్‌ను నరకం చూపిస్తున్నాయి. అందుకే అది పొరుగు దేశాలకు క్షమాపణలు చెప్పి లొంగిపోయింది. వేల ఏళ్ల చరిత్రలో ఇరాన్ ఇలా ఓడిపోవడం ఇదే మొదటిసారి" అని ట్రంప్ ఎద్దేవా చేశారు.

నేడే 'అతిపెద్ద' దాడి?

ఈ రోజు ఇరాన్‌పై అత్యంత కఠినమైన దాడులు జరుగుతాయని ట్రంప్ హెచ్చరించారు. "ఇరాన్ తన చెడు ప్రవర్తన కారణంగా భారీ మూల్యం చెల్లించబోతోంది. ఇప్పటివరకు టార్గెట్ చేయని ప్రాంతాలు, సమూహాలను కూడా ఇప్పుడు తుడిచిపెట్టే ఆలోచనలో ఉన్నాం. సంపూర్ణ వినాశనం, చావు తప్పవు" అంటూ ట్రంప్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ కూడా ఈ యుద్ధంలో "అతిపెద్ద బాంబింగ్ క్యాంపెయిన్" ఇంకా ముందుందని వ్యాఖ్యానించడం గమనార్హం.

దుబాయ్‌లో పేలుళ్ల కలకలం

శనివారం ఉదయం దుబాయ్‌లో పలు చోట్ల భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దుబాయ్ ప్రభుత్వం వెంటనే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను యాక్టివేట్ చేసింది. ప్రపంచంలోనే బిజీగా ఉండే దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికులను భద్రతా కారణాల దృష్ట్యా రైలు టన్నెల్స్‌లోకి తరలించారు.

యుద్ధం ముదిరింది ఇలా..

మార్చి 4న భారత్‌లో మిలిటరీ డ్రిల్ ముగించుకుని తిరిగి వస్తున్న ఇరాన్ యుద్ధనౌక 'IRIS డేనా'ను అమెరికా సబ్‌మెరైన్ టోర్పెడోతో ముంచేసింది. ఇందులో 87 మంది మరణించారు. దీనికి ప్రతీకారంగా పర్షియన్ గల్ఫ్‌లో అమెరికా ట్యాంకర్‌పై ఇరాన్ దాడి చేసింది. మరోవైపు ఇరాన్ వద్ద ఉన్న బాలిస్టిక్ క్షిపణులు 90 శాతం, డ్రోన్లు 83 శాతం మేర తగ్గిపోయాయని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఇరాన్ అధ్యక్షుడు ఏమన్నారంటే?

ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతూనే.. తాము లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. "మా ప్రజలు లొంగిపోవాలనే శత్రువుల కోరిక వారి సమాధి వరకు వెళ్లాల్సిందే" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, పొరుగు దేశాల నుంచి తమపై దాడి జరగనంత వరకు తాము వారిపై క్షిపణులు ప్రయోగించబోమని హామీ ఇచ్చారు.

ప్రస్తుతం ప్రపంచం చూపు అంతా ట్రంప్ చేసిన హెచ్చరికల మీదే ఉంది. నేడు ఇరాన్‌పై అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామాలు చూస్తుంటే మధ్యప్రాచ్యం మరో పెను విధ్వంసానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

 

Advertisement
Advertisement