త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Iran-US War | త‌క్ష‌ణం సైనిక చ‌ర్య‌ల‌ను నిలిపేయండి..! యూఎస్‌కు చైనా పిలుపు..!

Iran-US War | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా స్పందించింది. అన్ని దేశాలు వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని చైనా పిలుపునిచ్చింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌక మార్గాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు చైనా సహా పలుదేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని కోరారు.

P

International | Published On Mar 16, 2026, 5.55 pm IST

Iran-US War | త‌క్ష‌ణం సైనిక చ‌ర్య‌ల‌ను నిలిపేయండి..! యూఎస్‌కు చైనా పిలుపు..!
Advertisement

Iran-US War | పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో చైనా స్పందించింది. అన్ని దేశాలు వెంటనే సైనిక చర్యలను నిలిపివేయాలని చైనా పిలుపునిచ్చింది. ఇదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హార్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ నౌక మార్గాన్ని సుర‌క్షితంగా ఉంచేందుకు చైనా సహా పలుదేశాలు తమ యుద్ధ నౌకలను పంపాలని కోరారు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన సరఫరా, ప్ర‌పంచ వాణిజ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియన్ మీడియాతో మాట్లాడారు. హార్ముజ్ జలసంధిలో పెరుగుతున్న సైనిక ఉద్రిక్తతలు అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా, ప్రాంతీయ శాంతికి పెద్ద ముప్పుగా మారాయని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పరిస్థితి మరింత విషమించకుండా ఉండాలంటే అన్ని పక్షాలు వెంటనే సైనిక చర్యలను ఆపాలని ఆయన సూచించారు. ఉద్రిక్తతలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రాంతీయ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం పడవచ్చని హెచ్చరించారు.

హార్ముజ్ జలసంధి ఎందుకు కీలకం?

హార్ముజ్ జలసంధి ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటి. ఈ మార్గం ద్వారా ప్రపంచంలోని అనేక దేశాలకు భారీగా చమురు, గ్యాస్ సరఫరా జ‌రుగుతూ వ‌స్తోంది. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల తర్వాత ప్రతీకార చర్యగా ఇరాన్ ఈ జలమార్గాన్ని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరాలో తీవ్ర అంత‌రాయం నెల‌కొంది. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ప్రపంచ ఇంధన సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోష‌ల్ మీడియా వేదిక‌గా చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, జపాన్ త‌దిత‌ర దేశాల‌ను హార్ముజ్ జ‌ల‌సంధిలో నౌక‌ల రాక‌పోక‌లు సుర‌క్షితంగా ఉండాలంటే ఆయా దేశాలు త‌మ యుద్ధ‌నౌక‌ల‌ను పంపాల‌ని క‌రారు. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ మార్గం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అవసరమైతే ఈ అంశంపై కొత్త అంతర్జాతీయ కూటమిని ఏర్పాటు చేసి చమురు ట్యాంకర్ల రాకపోకలు సజావుగా కొనసాగేందుకు చర్యలు తీసుకుంటామ‌ని తెలిపారు.

ట్రంప్ చైనా పర్యటనపై చర్చలు

ఈ నెలాఖరులో ట్రంప్ చైనా పర్యటనపై రెండు దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని చైనా తెలిపింది. హార్ముజ్ జలసంధి సమస్య పరిష్కారంలో చైనా సహకరించకపోతే బీజింగ్ పర్యటనను వాయిదా వేయవచ్చని ట్రంప్ సూచించారు. రెండు దేశాల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయని, ద్వైపాక్షిక సంబంధాల్లో ఉన్నత స్థాయి నేత‌ల మధ్య సంభాషణలు కీలకమని చైనా విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, చైనా-ఇరాన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ నుంచి చైనా భారీగా చమురు కొనుగోలు చేస్తుంది. అంతేకాకుండా తక్కువ ధరకు ఇరాన్ చమురును తీసుకుంటుంది. ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ దాడులను చైనా తీవ్రంగా విమర్శించింది. అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా ఖ‌మేనీని హ‌త‌మార్చ‌డంపై డ్రాగ‌న్ దేశం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ నేప‌థ్యంలో హార్ముజ్ సంక్షోభంలో చైనా పాత్ర ప్రపంచ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఇరాన్‌కు వ్య‌తిరేకంగా చైనా ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం లేద‌ని విశ్లేష‌కులు పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement