పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదులకు పుట్టినిల్లు. పాక్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ భారత్‌పై దాడి చేయించడమే వాళ్ల టార్గెట్. పాకిస్థాన్ కేంద్రంగా కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థలు రెండు ఉన్నాయి. అవే లష్కర్ ఏ తోయిబా, జైష్ ఏ మహమ్మద్. ఈ రెండు ఉగ్రవాద సంస్థలు కలిసి పాకిస్థాన్‌లోని బహవల్పూర్‌లో సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలను ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఎన్డీటీవీ సంపాదించింది. ఈ రెండు సంస్థలు గతంలో భారత్‌లో పలు ఘోరమైన దాడులకు పాల్పడింది. గత ఏప్రిల్‌లో జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ దాడికి లష్కర్ ఏ తోయిబా కారణమనే ఆరోపణలు ఉన్నాయి. గత నెల నవంబర్‌లో ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడులో 15 మంది మరణించిన విషయం తెలిసిందే. ఆ దాడిని జైష్ ఏ మహమ్మద్ సంస్థ చేయించినట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ సంవత్సరం జరిగిన ఈ రెండు దాడుల ప్రధాన సూత్రధారులైన ఈ రెండు సంస్థల ఉగ్రవాదులు తాజాగా బహవల్పూర్‌లో సమావేశం కావడంతో భారత భద్రతా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి మరోసారి భారత్‌పై ఎలాంటి దాడులకు పాల్పడతారో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉగ్రవాద సంస్థలు అయి ఉండి పాకిస్థాన్ గడ్డపై ఎలాంటి బెణుకు లేకుండా స్వేచ్ఛగా సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, అక్కడి ప్రభుత్వ వైఖరి ఎలా ఉందో ప్రపంచమంతా చూస్తోంది. ఉగ్రవాదులే పాకిస్థాన్‌ను పాలిస్తున్నారా అన్న అనుమానం ప్రపంచ దేశాలకు కలుగుతోంది.