త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Riyadh Airport | రియాద్‌ ఎయిర్‌పోర్టుపై మిస్సైల్ అటాక్‌.. త‌మ‌ప‌నేన‌ని ప్ర‌క‌టించిన హౌతీలు..!

Riyadh Airport | సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రియాద్‌ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించినట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత రాజధానిలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా.. విమానాశ్రయం వద్ద పొగలు క‌నిపించాయి.

P

International | Published On Oct 8, 2026, 8.23 pm IST

Riyadh Airport | రియాద్‌ ఎయిర్‌పోర్టుపై మిస్సైల్ అటాక్‌.. త‌మ‌ప‌నేన‌ని ప్ర‌క‌టించిన హౌతీలు..!
Advertisement

Riyadh Airport | సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్‌ ఖాలిద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు రియాద్‌ ఎయిర్‌పోర్టును లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగించినట్లు ప్రకటించారు. ఈ ఘటన తర్వాత రాజధానిలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించగా.. విమానాశ్రయం వద్ద పొగలు క‌నిపించాయి. దీంతో కొద్దిసేపు విమానాశ్రయ కార్యకలాపాలను నిలిచిపోయాయి. పలు విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మరోవైపు రియాద్‌ వైపు వెళ్తున్న పలు భారత విమానాలపై కూడా ప్రభావం పడింది.

రెండు క్షిపణులను కూల్చివేశామన్న సౌదీ

హౌతీలు రియాద్‌ విమానాశ్రయం వైపు బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు ప్రకటించినప్పటికీ.. సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు మాత్రం రెండు బాలిస్టిక్‌ మిసైళ్లను గాల్లోనే ధ్వంసం చేసినట్లు వెల్లడించాయి. దాడిపై సౌదీ ప్రభుత్వం వెంటనే ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న ఓ విమానం నుంచి పొగలు వెలువడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ సమయంలో విమానంలో ఎవరూ లేరని సమాచారం. ఘటన అనంతరం విమానాశ్రయంలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు.

ఎయిర్‌లైన్స్‌కు హౌతీల హెచ్చరిక

సౌదీ గగనతలాన్ని తమ సైనిక కార్యకలాపాల ప్రాంతంగా పరిగణించాలని హౌతీలు అంతర్జాతీయ విమానయాన సంస్థలను హెచ్చరించారు. సౌదీలోని విమానాశ్రయాలు, సైనిక స్థావరాలు, చమురు మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని ఇటీవలి రోజుల్లో దాడులు పెంచినట్లు వారు ప్రకటించారు. దీంతో గల్ఫ్‌ ప్రాంతంలో విమాన ప్రయాణాల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రయాణికులు తమ విమానాల పరిస్థితిని ఎయిర్‌లైన్స్‌ నుంచి నిర్ధారించుకున్న తర్వాతే విమానాశ్రయానికి రావాలని రియాద్‌ ఎయిర్‌పోర్టు సూచించింది.

భారత విమానాలపై ప్రభావం

రియాద్‌కు రాకపోకలు సాగించే పలు విమానాలు ఆలస్యమయ్యాయి. కొచ్చి నుంచి రియాద్‌కు వెళ్లాల్సిన రెండు విమానాలు రద్దయ్యాయి. భద్రతా పరిస్థితుల దృష్ట్యా ఎయిర్‌ ఇండియా, ఇండిగో, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే విమానాలను అక్టోబర్‌ 10 వరకు రద్దు చేసినట్లు సమాచారం. రద్దైన విమానాల ప్రయాణికులకు ఉచితంగా ప్రయాణ తేదీ మార్చుకునే అవకాశం లేదా పూర్తి రీఫండ్‌ పొందే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎయిర్‌లైన్స్‌ తెలిపాయి.

ఢిల్లీ–రియాద్‌ విమానం వెనక్కి

రియాద్‌ విమానాశ్రయం వద్ద దాడి వార్తల నేపథ్యంలో ఢిల్లీ నుంచి రియాద్‌ వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానం గాల్లో ఉండగానే తిరిగి వెనక్కి మళ్లింది. ప్రాంతీయ భద్రతా పరిస్థితులను ఎయిర్‌లైన్స్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. యెమెన్‌లోని అంతర్యుద్ధానికి తోడు ప్రాంతీయంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హౌతీ దాడులు మళ్లీ పెరిగినట్లు సమాచారం. యెమెన్‌ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న వర్గాలకు సౌదీ అరేబియా మద్దతు ఇస్తుండటంతో హౌతీలు సౌదీ నగరాలు, కీలక మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇటీవల రియాద్‌, అబ్హా విమానాశ్రయాలపై జరిగిన దాడుల్లో ముగ్గురు మరణించినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు. తాజా పరిణామాలతో గల్ఫ్‌ ప్రాంతంలో విమాన ప్రయాణాలపై భద్రతా ఆందోళనలు మరింత పెరిగాయి.

Advertisement
Advertisement