త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bangladesh Crisis | అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. హిందూ యువకుడిని కొట్టి చంపి, మృతదేహానికి నిప్పు పెట్టి దారుణం

తన పాలనలో భారత్‌కి విధేయులుగా ఉన్న షేక్ హసీనాని, ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రహ్మాన్‌పై కూడా ఆందోళనకారులు ఆగ్రహంతో ఉన్నారు. షేక్ ముజిబుర్ రహ్మాన్ ఇల్లు అయిన ధన్మందిని నిరసనకారులు కూల్చేశారు.

J

International | Published On Dec 19, 2025, 3.11 pm IST

Bangladesh Crisis | అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. హిందూ యువకుడిని కొట్టి చంపి, మృతదేహానికి నిప్పు పెట్టి దారుణం
Advertisement

Bangladesh Crisis | ఒకప్పుడు భారత్‌ని అమ్మతో పోల్చిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌ని బద్ధ శత్రువుగా మార్చుకుంది. బంగ్లాదేశ్ మొత్తం గత కొన్ని రోజులుగా అలజడి చెలరేగుతున్న విషయం తెలిసిందే. భారత్‌పై వ్యతిరేక నిరసనలు మిన్నంటుతున్న వేళ మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మైమెన్‌సింగ్ జిల్లాలో ఉన్న బాలుకాలో దీపు చంద్ర దాస్ అనే 30 ఏళ్ల హిందూ యువకుడిని అల్లరి మూకలు అత్యంత క్రూరంగా కొట్టి చంపారు. అనంతరం ఆ యువకుడి మృతదేహాన్ని ఊరేగింపుగా వీధుల్లో తీసుకెళ్లి ఓ చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టారు. ఈ ఘటన ఒక్కసారిగా ప్రపంచాన్ని కలిచివేసింది.

అసలేం జరిగింది?

బంగ్లా మీడియాల కథనం ప్రకారం.. ఆ యువకుడు ఓ ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడని, అక్కడ జరిగిన ఓ వేడుకలో ఇస్లాం మతాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడన్న ఆరోపణలతో ఆ యువకుడిపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అలా ఆ విషయం స్థానికులకు తెలియడంతో అల్లరి మూకలంతా ఏకమై గురువారం రాత్రి అతడిని పట్టుకొని తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ప్రాణాలు వదిలాడు. ఆ తర్వాత ఆ యువకుడి మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పు పెట్టి కాల్చి దారుణంగా ప్రవర్తించారు.

hindu man lynched and set on fire in bangladesh

విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణంతో ఆందోళనలు తీవ్రం

ఎప్పుడైతే బంగ్లాదేశ్‌లో విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ మరణించాడో అప్పటి నుంచి దేశవ్యాప్తంగా భారత్‌కి వ్యతిరేకంగా నిరసనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలోనే బంగ్లాలో ఉన్న పలు మీడియా ఆఫీసులు, అవామీ లీగ్ నేతల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. భారత్‌తో లింక్ ఉందని భావించిన అన్ని మీడియా ఆఫీసులను ఆందోళనకారులు నాశనం చేశారు. భారత్‌కి వత్తాసు పలుకుతున్నారని పలు మీడియా ఆఫీసుల ముందు ఆందోళనకారులు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కొన్ని మీడియా ఆఫీసులను ధ్వంసం చేసి తమ నిరసనను ఉద్ధృతం చేశారు.

తన పాలనలో భారత్‌కి విధేయులుగా ఉన్న షేక్ హసీనాని, ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రహ్మాన్‌పై కూడా ఆందోళనకారులు ఆగ్రహంతో ఉన్నారు. షేక్ ముజిబుర్ రహ్మాన్ ఇల్లు అయిన ధన్మందిని నిరసనకారులు కూల్చేశారు. 15 ఏళ్ల పాటు బంగ్లాదేశ్‌ని పాలించి గత సంవత్సరం తన ప్రభుత్వాన్ని కాపాడుకోలేకపోవడంతో షేక్ హసీనా బంగ్లాదేశ్ వదిలి భారత్‌కి వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. తన పాలనలో షేక్ హసీనా పలు అక్రమాలకు పాల్పడ్డారని అక్కడి కోర్టు ఆమెకు ఉరి శిక్ష విధించిన విషయం తెలిసిందే. హసీనా ప్రభుత్వం కూలిపోయాగానే, అక్కడి ముస్లింలు కొందరు ఇంకిలాబ్ మోంచో గ్రూప్‌ను ఏర్పాటు చేసి హసీనా, భారత్‌కి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్నారు. అప్పటి నుంచి భారత్ మీద బంగ్లా ప్రజల్లో విధ్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రస్తుతం బంగ్లాదేశ్‌ని ఈ పరిస్థితికి తీసుకొచ్చారు.

తీవ్రంగా ఖండించిన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం

బంగ్లాదేశ్‌లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోవడం, హిందూ యువకుడిని అత్యంత క్రూరంగా చంపడంపై తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. బంగ్లాదేశ్‌లో ఇలాంటి హింసకు తావు లేదు. ఈ దారుణాలకు పాల్పడిన వాళ్లను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వం తెలిపింది.

Advertisement
Advertisement