త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

White House | వైట్‌హౌస్‌లో దీపావ‌ళి వేడుక‌లు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హ‌నుమాన్ చాలీసా

White House | అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో (White House) దీపావళి (Diwali) వేడుకలు ఘ‌నంగా జరిగాయి. భార‌తీయుల‌తో క‌లిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు.

G

International | Published On Nov 7, 2026, 10.46 am IST

White House | వైట్‌హౌస్‌లో దీపావ‌ళి వేడుక‌లు.. ట్రంప్‌కు గిఫ్ట్‌గా హ‌నుమాన్ చాలీసా
Advertisement

White House | త్రినేత్ర న్యూస్‌: అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో (White House) దీపావళి (Diwali) వేడుకలు ఘ‌నంగా జరిగాయి. భార‌తీయుల‌తో క‌లిసి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) దీపాలు వెలిగించి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా భారతీయ టెక్ ప్రెన్య‌ర్‌, ప్ర‌ముఖ హెల్త్‌టెక్ సంస్థ GOQii వ్య‌వ‌స్థాప‌కుడు విశాల్ గోండల్ అధ్యక్షుడు ట్రంప్‌కు హనుమాన్ చాలీసా ప్రతిని బహూకరించారు. ఓవల్ ఆఫీస్‌లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలిసి దీపావళి జరుపుకోవడం అరుదైన గౌరవంగా భావిస్తున్నట్లు విశాల్ గోండల్ వెల్ల‌డించారు. ధైర్యానికి, అచంచలమైన భక్తికి ప్రతీకగా కోట్ల మంది భారతీయులు పఠించే హనుమాన్ చాలీసాను (Hanuman Chalisa) అధ్యక్షుడికి కానుకగా ఇవ్వడం తన మర్చిపోలేని ఘట్టంగా పేర్కొన్నారు. దీపాలు వెలిగించే సమయంలో భారత్, అమెరికా మధ్య స్నేహబంధం మరింత బలపడాలని తాను ప్రార్థించినట్లు తెలిపారు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించే విజయానికి దీపావళి ప్రతీక అని ఎక్స్ వేదిక‌గా తెలిపారు.

ఈ వేడుకల్లో అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఐబీఎం (IBM) సీఈఓ అరవింద్ కృష్ణ, ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్ కాష్ పటేల్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ జయ్ భట్టాచార్య, సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, చెఫ్ వికాస్ ఖన్నా, కెనడా మాజీ ఎంపీ రూబీ ధల్లా తదితరులు పాల్గొన్నారు.

2003 నుంచి వైట్‌హౌస్‌లో..

వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకలు నిర్వహించే సంప్రదాయాన్ని 2003లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ. బుష్ ప్రారంభించారు. తొలినాళ్లలో ఈ వేడుకలు వైట్‌హౌస్ సముదాయంలోని ఐసెన్‌హోవర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ బిల్డింగ్‌లో జరిగేవి. ఇక 2009లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్‌హౌస్‌లోని ఈస్ట్ రూమ్‌లో స్వయంగా దీపం వెలిగించి ఈ వేడుకలకు మరింత ప్రాధాన్యత కల్పించారు. నాటి నుండి ఓవల్ ఆఫీస్, రూజ్‌వెల్ట్ రూమ్‌లలో దీపావళి వేడుకలు జరపడం ఆనవాయితీగా కొనసాగుతున్న‌ది.

Advertisement
Advertisement