త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chinese Structures near Pangong Lake | పాంగోంగ్ సరస్సు వద్ద చైనా బరితెగింపు.. శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ డ్రాగన్ కుట్రలు

గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ SCO సమ్మిట్ కోసం ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరణ వంటి అంశాలపై చైనా ప్రభుత్వంతో చర్చించారు.

J

International | Published On Jan 6, 2026, 9.24 pm IST

Chinese Structures near Pangong Lake | పాంగోంగ్ సరస్సు వద్ద చైనా బరితెగింపు.. శాటిలైట్ చిత్రాల్లో బయటపడ్డ డ్రాగన్ కుట్రలు
Advertisement

Chinese Structures near Pangong Lake | పాంగోంగ్ లేక్ (Pangong Tso) తెలుసు కదా. ప్రపంచంలోనే అత్యంత అందమైన, ఎత్తైన్ ప్రదేశాల్లో ఒకటి. లడఖ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో దాదాపు 14,270 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు ప్రపంచంలోనే అతి ఎత్తైన ఉప్పు నీటి సరస్సుగా పేరుగాంచింది. శీతాకాలంలో పూర్తిగా గడ్డకట్టుకుపోయే తత్వంగల సరస్సు ఇది. ఈ సరస్సు 134 కిమీల విస్తీర్ణం కలిగి ఉంటుంది. అందులో 40 శాతం మాత్రమే భారత్‌లో ఉండగా, మిగితా 60 శాతం చైనా ప్రాంతం టిబెట్‌లో ఉంటుంది.

అలాంటి పాంగోంగ్ సరస్సుకి సమీపంలో లఢఖ్‌లో చైనా తన సైనిక ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. అత్యంత రహస్యంగా సరస్సుకు సమీపంలో శాశ్వత సైనిక నిర్మాణాలు చేపడుతున్నట్లు శాటిలైట్ చిత్రాల ద్వారా తెలిసిపోయింది. ఓవైపు ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు మెరుగుపడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో చైనా తన కుట్రను మరోసారి బయటపెట్టినట్లయింది. తాజాగా ఇండియా టుడే ఈ శాటిలైట్ చిత్రాలను బయటపెట్టింది. సరిహద్దులో చైనా అరాచకాలను ప్రపంచానికి తెలిసేలా చేసింది.

china builds structures near pangong lake

సిరిజాప్ పోస్ట్ వద్ద కొత్త కాంప్లెక్స్

1962 యుద్ధం సమయంలో భారత్ నుంచి చైనా వశం చేసుకున్న 'సిరిజాప్' (Sirijap) పోస్ట్ సమీపంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి. పాంగోంగ్ సరస్సు నీటికి కేవలం కొన్ని మీటర్ల దూరంలోనే శాశ్వత భవనాలతో ఒక భారీ కాంప్లెక్స్‌ను నిర్మిస్తున్నారు. 2020 గల్వాన్ ఘర్షణల తర్వాత అదే ప్రాంతంలో చైనా తాత్కాలిక షెడ్లను ఏర్పాటు చేసింది. ఇప్పుడు వాటి స్థానంలో పక్కా భవనాలను నిర్మిస్తున్నట్టు శాటిలైట్ ఇమేజ్‌ల ద్వారా తెలుస్తోంది.

china builds structures near pangong lake

2025 జులై వరకు ఎలాంటి నిర్మాణాలు లేవు

స్పేస్ ఇంటెలిజెన్స్ సంస్థ 'వాంటర్' (Vantor) అందించిన డిసెంబర్ 28,2025 నాటి చిత్రాల ప్రకారం.. 2025 జులై తర్వాత ఈ నిర్మాణాల వేగం పెరిగింది. మంచు కురిసే శీతాకాలంలో కూడా సైనికులు అక్కడ నివసించేలా, యుద్ధ సామాగ్రిని భద్రపరిచేలా ఈ భవనాలను రూపొందించినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం జూన్ లో సరస్సులో కనిపించిన బోట్లు, ఇప్పుడు సురక్షితంగా కప్పి ఉంచడం కూడా చిత్రాల్లో స్పష్టంగా చూడవచ్చు.

china builds structures near pangong lake

క్షిపణి కేంద్రాలు, ఎయిర్ డిఫెన్స్

కేవలం నివాసాలే కాకుండా, అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సైట్లను కూడా చైనా ఇక్కడ ఏర్పాటు చేస్తోంది. క్షిపణులను ప్రయోగించే వాహనాల కోసం తెరిచేందుకు సులభంగా ఉండే పైకప్పులతో కూడిన ప్రత్యేక షెడ్లను నిర్మించినట్లు తెలుస్తోంది. భారత సరిహద్దు వెంబడి చైనా తన గగనతల రక్షణ వ్యవస్థను పటిష్టం చేసుకుంటోందనడానికి ఇది నిదర్శనం.

china builds structures near pangong lake

ముప్పు ఏమిటి?

తన ఉనికిని నియంత్రణగా మార్చుకోవడానికి శాశ్వత మౌలిక సదుపాయాలను చైనా కల్పించుకుంటోంది. వివాదస్పద ప్రాంతాల్లో తన శక్తిని ప్రదర్శించే ప్రయత్నంలా ఉంది.. బఫర్ జోన్‌కి సమీపంలో చైనా సైన్యాన్ని ఎక్కువగా మోహరించే అవకాశం ఉందని జియో స్పేసియల్ రీసెర్చర్ డామియన్ సైమన్ అభిప్రాయపడ్డారు.

ఓవైపు శాంతి మంత్రం.. మరోవైప సరిహద్దు బలోపేతం

గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ SCO సమ్మిట్ కోసం ఏడేళ్ల తర్వాత చైనాలో పర్యటించారు. ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరణ వంటి అంశాలపై చైనా ప్రభుత్వంతో చర్చించారు.

గతంలోనూ భారత్, చైనాల మధ్య సరిహద్దు సమస్య పరిష్కారం కోసం నిరంతరం చర్చలు జరిగాయి. 2024 లో బలగాల ఉపసంహరణ తర్వాత ఇరు దేశాలు ద్వైపాక్షిక సంబంధాల కోసం ప్రాధాన్యత ఇచ్చాయి. కైలాస మానస సరోవర యాత్రను పున:ప్రారంభించడం, ఇరు దేశాల మధ్య ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరచడం కోసం డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ, సరిహద్దు నుంచి ప్రవహించే నదుల గురించి, భారత్, చైనా మధ్య దౌత్య సంబంధాలు ప్రారంభమై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఓవైపు చర్యలు కొనసాగుతుంటే.. మరోవైపు సరిహద్దులో చైనా మాత్రం శాశ్వత నిర్మాణాలు చేపడుతుండటంతో భారత్ కూడా తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేసింది. డ్రాగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు మధ్య ఎంత వ్యత్యాసం ఉందో భారత్ గమనిస్తోంది. ఒకవైపు చైనా శాంతి మంత్రం జపిస్తూనే, మరోవైపు సరిహద్దును బలపరుచుకోవడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement