త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుద‌ల చేశాం

Ponnam Prabhakar | హైద‌రాబాద్ నగ‌రంలోని 3427 దేవాల‌యాల‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో రూ.15,05,41,150 కోట్లు విడుద‌ల చేశామ‌ని హైద‌రాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు.

S

Hyderabad | Published On Jul 13, 2026, 4.41 pm IST

Ponnam Prabhakar | 3427 దేవాలయాలకు రూ.15.05 కోట్లు విడుద‌ల చేశాం
Advertisement
  • భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారుల సమన్వయం
  • గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు బోనాల జాతరకు ప్రత్యేక ఏర్పాట్లు
  • హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్: హైద‌రాబాద్ నగ‌రంలోని 3427 దేవాల‌యాల‌కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో రూ.15.05 కోట్లు విడుద‌ల చేశామ‌ని హైద‌రాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. జూలై 16 నుంచి ఆగస్టు 13 వరకు హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో బోనాల ఉత్సవాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలతో సమన్వయం చేస్తూ విస్తృత ఏర్పాట్లు చేపట్టిందని సోమ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. అన్ని శాఖలు అప్రమత్తంగా పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

జూలై 16న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాల ఉత్సవాలతో ప్రారంభమ‌వుతాయ‌న్నారు. జూలై 20, 21, 22 తేదీల్లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ‌ ఉత్సవాల్లో భాగంగా 20న‌ బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఎదుర్కోలు ఉత్సవం, 21న‌ అమ్మవారి కళ్యాణం, 22న‌ రథోత్సవం అత్యంత వైభవంగా జరగనుందని వివ‌రించారు. ఆగస్టు 2న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 3న రంగం కార్యక్రమం ఉంటుంద‌ని చెప్పారు. ఆగస్టు 9న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలతో పాటు, నగరంలోని ప్రధాన దేవాలయాల్లో జరిగే బోనాల ఉత్సవాలకు అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఉత్సవాల కోసం దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, రోడ్లు-భవనాల శాఖ, ట్రాన్స్‌కో, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు, పౌర సరఫరాల శాఖ, టీజీఎస్‌ఆర్టీసీ, రైల్వే, సమాచార అండ్‌ పౌర సంబంధాల శాఖ, పురావస్తు శాఖతో పాటు ఇతర అన్ని ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. దేవాలయాల వద్ద క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారుల మరమ్మతులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, భద్రత, ప్రత్యేక బస్సుల నిర్వహణ, పూల అలంకరణలు, విద్యుద్దీపాలంకరణలు వంటి అన్ని ఏర్పాట్లు త్వరైతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.

గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, చిలకలగూడ కట్ట మైసమ్మ - పోచమ్మ, హరిబౌలిలోని అక్కన్న- మాదన్న దేవాలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ, లాల్‌దర్వాజా సింహవాహిని మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం, మీరాలం మండి మహంకాళి ఆలయాలతో పాటు నగరంలోని దాదాపు 30 ప్రధాన ఆలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, ఇతర ముఖ్య నేతలు అధికారులు, సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలు సమర్పించే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల అనంతరం ఫలహారం బండ్ల ఊరేగింపు జరగనున్న‌ట్లు వివ‌రించారు.

ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు భక్తులు పోలీసు, ప్రభుత్వ శాఖల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి భక్తుడికి దర్శనం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. బోనాల ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి భక్తులు భారీగా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల‌ని కోరారు.

Advertisement
Advertisement