త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఉన్నవారికి తెలంగాణ సర్కార్ భారీ ఊరట! నిధుల విడుదలకు రూల్స్ సడలిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కీలక ప్రకటన విడుదల చేశారు.

J

Hyderabad | Published On Sep 21, 2026, 5.21 pm IST

Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

సంక్షిప్త సారాంశం

నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లకు నిధులు త్వరగా అందేలా ప్రభుత్వం కీలక నిబంధనలను సడలించింది. పోర్టల్‌లో మంజూరై బేస్‌మెంట్ స్థాయికి చేరుకున్న ఇళ్లకు L3 నుంచి L1 కేసులకు వన్‌టైమ్ ప్రత్యేక అనుమతిని మంజూరు చేసింది. ఈ సడలింపు ద్వారా పడే పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. మంజూరైనప్పటికీ నిర్మాణం మొదలుపెట్టని ఇళ్లను రద్దు చేసి, వెంటనే ఇతర అర్హులకు కేటాయించాలని ఆదేశించారు.

Advertisement

Ponguleti Srinivas Reddy | త్రినేత్ర.న్యూస్ : సొంతింటి కలను నెరవేర్చుకునే క్రమంలో నిర్మాణ పనులు ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరిస్తూ, నిధులు సకాలంలో విడుదలయ్యేలా ప్రభుత్వం కీలక నిబంధనలను సడలించినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన జారీ చేశారు.

నిధుల విడుదలకు లైన్ క్లియర్..

ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన పలు విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లబ్ధిదారులకు మేలు జరిగేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్‌లో ఇప్పటికే మంజూరై, కనీసం బేస్‌మెంట్ (Basement) లేదా అంతకంటే పై స్థాయికి చేరిన నిర్మాణాలకు ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది.

L3 నుంచి L1 కేటగిరీ కేసులకు ఒకేసారి ప్రత్యేక అనుమతి (One-time special approval) ఇస్తూ నిధుల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి తెలిపారు.

ప్రభుత్వమే భరించే ఆర్థిక భారం..

ఈ ప్రత్యేక సడలింపు కేవలం ఒక్కసారి మాత్రమే వర్తిస్తుందని, భవిష్యత్తులో జరిగే L3 మంజూరులకు దీన్ని ప్రాతిపదికగా తీసుకోబోమని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ఈ సడలింపు కారణంగా ప్రభుత్వంపై పడే పూర్తి అదనపు ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, లబ్ధిదారులపై ఎలాంటి ఒత్తిడి ఉండదని భరోసా ఇచ్చారు.

నిర్మాణం మొదలుపెట్టకుంటే రద్దు తప్పదు

ఇదే క్రమంలో ప్రభుత్వం మరో కీలక హెచ్చరిక కూడా జారీ చేసింది. ప్రభుత్వం నుంచి ఇల్లు మంజూరైనప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారుల అనుమతులను రద్దు చేయాలని నిర్ణయించారు. అలా రద్దు చేసిన ఇళ్లను వెంటనే గ్రామాలు, పట్టణాల్లోని ఇతర అర్హులైన పేదలకు రీ-అలాట్ (Re-allot) చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నిర్మాణాలు సాగుతున్న లబ్ధిదారులకు తాజా నిర్ణయం కొండంత ఊరటనిచ్చింది.

Advertisement
Advertisement