త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Data Centers Water Crisis | లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలాది మంది దాహం

5,000 మెగావాట్ల డేటా సెంటర్లతో హైదరాబాద్‌లో తాగునీరు, విద్యుత్‌కు తీవ్ర కొరత తప్పదా? సీఎం రేవంత్‌కు మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ రాసిన సంచలన లేఖలోని వాస్తవాలివే.

J

Hyderabad | Published On Nov 5, 2026, 7.29 pm IST

Telangana Data Centers Water Crisis | లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షలాది మంది దాహం

సంక్షిప్త సారాంశం

5,000 MW డేటా సెంటర్ల శీతలీకరణ కోసం రోజుకు ఏకంగా 216 మిలియన్ లీటర్ల (43 MGD) నీరు అవసరం. ఇది సుమారు 11 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటి అవసరాలకు సమానం. వర్షాభావం, ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా రంగారెడ్డి జిల్లాలో అనుమతించిన 5,000 మెగావాట్ల డేటా సెంటర్ల నిర్మాణాలను తక్షణమే నిలిపివేయాలని మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్ శర్మ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. డేటా సెంటర్ల నిరంతర నిర్వహణ కోసం హైదరాబాద్ నగరం మొత్తం వాడే కరెంట్‌తో సమానంగా (5,000 MW) అదనపు విద్యుత్ అవసరం. దీనివల్ల గృహ, వ్యవసాయ విద్యుత్ సరఫరాకు తీవ్ర విఘాతం ఏర్పడే ప్రమాదం ఉంది. లక్షల కోట్ల లాభాలు పొందే బహుళజాతి సంస్థలకు ప్రభుత్వాలు భారీ రాయితీలు ఇస్తున్నప్పటికీ, ఆటోమేషన్ కారణంగా స్థానికులకు దక్కే ఉద్యోగావకాశాలు చాలా పరిమితం.

Advertisement
  • 5,000 మెగావాట్ల డేటా సెంటర్లతో గ్రేటర్‌కు నీటి కరవు, కరెంట్ కోతలు తప్పవా?
  • రోజుకు 21.6 కోట్ల లీటర్ల నీటి వినియోగం
  • 11 లక్షల మంది ప్రజల గొంతు ఎండిపోయే ముప్పు
  • సర్వర్ల కూలింగ్ కోసం మరో కొత్త హైదరాబాద్ నగరానికి సరిపడా 5,000 MW విద్యుత్ అవసరం
  • వ్యవసాయం, గృహ వినియోగంపై పడనున్న తీవ్ర ప్రభావం
  • పీక్ సమ్మర్‌లో పవర్ కట్స్ ముప్పు
  • వెంటనే అనుమతులు రద్దు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ కేంద్ర కార్యదర్శి ఈఏఎస్ శర్మ సంచలన లేఖ

Telangana Data Centers Water Crisis | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ల రాజధానిగా నిలపాలన్న ప్రభుత్వ ప్రయత్నాలు క్షేత్రస్థాయిలో పెను ముప్పును మోసుకొస్తున్నాయి. రాబోయే 5,000 మెగావాట్ల (5 GW) భారీ డేటా సెంటర్ల ప్రాజెక్టుల వల్ల గ్రేటర్ హైదరాబాద్, పరిసర రంగారెడ్డి జిల్లాల్లో తీవ్ర నీటి సంక్షోభం, పెను విద్యుత్ విలయం ముంచుకొస్తోందని పర్యావరణవేత్తలు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నగరంలో 150 MGD తాగునీటి కొరత నెలకొనగా, సర్వర్ల దాహం తీర్చేందుకు ప్రజల తాగునీటిని మళ్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలను పణంగా పెట్టి బహుళజాతి కంపెనీల డేటా సెంటర్లకు ఇచ్చిన అనుమతులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ పూర్వ కార్యదర్శి డాక్టర్ ఈఏఎస్ శర్మ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డికి రాసిన లేఖ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

11 లక్షల మంది దాహం వర్సెస్ సర్వర్ల కూలింగ్

హైదరాబాద్ మెట్రో ప్రాంతంలో ప్రస్తుతం రోజుకు 750 MGD నీటి డిమాండ్ ఉండగా, అందుబాటులో ఉన్నది కేవలం 600 MGD మాత్రమే. రాబోయే ఐదేళ్లలో జనాభా పెరుగుదల, ఎల్ నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ లోటు 230 MGDకి పెరిగే ప్రమాదం ఉందని ఈఏఎస్ శర్మ తన లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో షాబాద్ మండలం చందన్‌వెల్లి, కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట్, మహేశ్వరం రావిర్యాల పరిసరాల్లో ఏర్పాటవుతున్న అమెజాన్, మైక్రోసాఫ్ట్, టీసీఎస్ వంటి 5,000 MW డేటా సెంటర్ల కూలింగ్ కోసం రోజుకు ఏకంగా 216 మిలియన్ లీటర్ల (43 MGD) నీరు అవసరమవుతుంది. ఇది దాదాపు 11 లక్షల మంది ప్రజల రోజువారీ తాగునీటికి సమానం. నగరంలో చెరువులు ఆక్రమణలకు గురై భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్న వేళ, విలువైన జలవనరులను పరిశ్రమల శీతలీకరణకు మళ్లించడం క్షమించరాని తప్పిదమని శర్మ స్పష్టం చేశారు.

మరో నగరానికి సరిపడా కరెంట్.. గృహ, వ్యవసాయ విద్యుత్‌కు ఎసరు

నీటి సమస్యను మించి విద్యుత్ రంగంపై పడే భారం మరింత వినాశకరంగా మారనుంది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం మొత్తం వినియోగించే గరిష్ట విద్యుత్ డిమాండే దాదాపు 4,000 నుండి 5,000 మెగావాట్లు. అంటే, రాబోయే డేటా సెంటర్ల కోసమే మరో కొత్త హైదరాబాద్ నగరానికి సరిపడా 5,000 MW అదనపు విద్యుత్ అవసరమవుతుంది. పైగా వీటి సర్వర్లకు ఒక్క సెకను కూడా అంతరాయం లేకుండా 24 గంటలూ కరెంట్ సరఫరా చేయాలి. ఈ స్థాయి విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్‌మిషన్ లైన్ల విస్తరణకు దాదాపు రూ.85,000 కోట్ల పెట్టుబడితో పాటు 5-6 ఏళ్ల సమయం పడుతుంది. వేసవిలో డిమాండ్ పెరిగినప్పుడు లేదా గ్రిడ్‌పై స్వల్ప ఒత్తిడి వచ్చినా బ్లాక్‌అవుట్‌లు సంభవిస్తాయి. ఫలితంగా, డేటా సెంటర్లను కాపాడేందుకు పల్లెల్లో వ్యవసాయానికి, నగర శివార్లలో గృహ అవసరాలకు బలవంతపు పవర్ కట్స్ విధించాల్సిన విపత్కర పరిస్థితులు తలెత్తుతాయి.

లక్షల కోట్ల రాయితీలు.. స్థానికులకు మిగిలేది ఉక్కపోత, జీరో ఉద్యోగాలు

రాష్ట్ర డేటా సెంటర్ల పాలసీ ప్రకారం లక్షల కోట్ల లాభాలు గడించే ప్రైవేట్ సంస్థలకు రూ.50,000 కోట్లకు పైగా రాయితీలతో పాటు చౌక విద్యుత్‌ను కల్పిస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2047 వరకు వీటికి ప్రకటించిన "టాక్స్ హాలిడే" వల్ల కంపెనీలకు మరో రూ.4,75,000 కోట్ల భారీ ప్రయోజనం చేకూరనుంది. ఇంత పెద్దమొత్తంలో ప్రజాధనాన్ని రాయితీలుగా దోచిపెడుతున్నా, అత్యంత ఆటోమేటెడ్ వ్యవస్థలైన డేటా సెంటర్ల వల్ల స్థానిక యువతకు దక్కే ఉద్యోగాలు చాలా పరిమితం. ఉద్యోగాల కల్పనపై ఎలాంటి రాతపూర్వక నిబంధనలు పెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా, నిరంతరం వేడిని వెదజల్లే కూలింగ్ టవర్ల వల్ల పరిసర ప్రాంతాల్లో 'హీట్ ఐలాండ్ ఎఫెక్ట్' ఏర్పడి ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. డేటా సెంటర్ల భారీ విద్యుత్ అవసరాల కోసం బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లను నడపడం వల్ల కాలుష్యమూ తీవ్రమవుతుంది. లాభాలు కార్పొరేట్ల జేబుల్లోకి.. కరెంట్ కోతలు, తాగునీటి ఎద్దడి ప్రజల నెత్తిపైకి నెట్టే ఈ విధానాలను తక్షణమే పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది.

Advertisement
Advertisement