త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?

పేద ఎస్సీ బిడ్డల కోసం కేటాయించిన రూ.1000 కోట్ల భూమిని కాంగ్రెస్ ఎంపీ కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. పూర్తి వివరాలు ఇవే.

J

Hyderabad | Published On Nov 4, 2026, 6.52 pm IST

Serilingampally Gurukulam Land Row | శేరిలింగంపల్లిలో రూ.1000 కోట్ల గురుకుల భూమి కబ్జా.. చేసిందెవరు?

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ శేరిలింగంపల్లిలో ఎస్సీ గురుకుల విద్యార్థుల కోసం కేటాయించిన 4.13 ఎకరాల (సుమారు రూ.1,000 కోట్ల విలువైన) స్థలాన్ని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ నేత డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ అక్రమ ఆక్రమణకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. 15 రోజుల్లోగా ఆక్రమణలను తొలగించి భూమిని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించకుంటే సంక్షేమ భవన్ ముట్టడిస్తామని అల్టిమేటం జారీ చేశారు. మీర్‌పేట్ పరిధిలోని అల్మాస్‌గూడలో దళిత క్రైస్తవులపై జరిగిన దాడి, పోలీసుల లాఠీచార్జ్‌ ఘటనలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement
  • కాంగ్రెస్ ఎంపీ, మంత్రిపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు

Serilingampally Gurukulam Land Row | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న వేల కోట్ల విలువైన ఎస్సీ గురుకులాల భూములను కాంగ్రెస్ నాయకులు యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వ ఆస్తులకే రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. పేద ఎస్సీ బిడ్డల ఉన్నత భవిష్యత్ కోసం కేటాయించిన భూమిపై అధికార పార్టీ నేతలు కన్నేశారని ఆరోపించారు.

గజం రూ.5 లక్షలు.. 1000 కోట్ల స్థలంలో గుడిసెలు

శేరిలింగంపల్లి పరిధిలో ప్రస్తుతం గజం ధర దాదాపు రూ.5 లక్షలు పలుకుతున్న 4.13 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ఎంపీ పోరిక బలరాం నాయక్ తన కుమారుడితో కలిసి కబ్జా చేస్తున్నారని ఆర్ఎస్పీ ఆరోపించారు. స్థానికంగా డబ్బులు ఆశజూపి పేదలతో అక్రమంగా గుడిసెలు వేయిస్తూ, నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఈ దందాకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అండదండలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

RS Praveen Kumar Alleges 1000 Cr Gurukulam Land Scam by Congress MP

డప్పులు కొట్టే కుటుంబాల పిల్లలు డాలర్లు సంపాదించాలనే లక్ష్యంతో

తాను గురుకులాల సెక్రటరీగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకుంటూ.. "2013-14లో ఎస్సీ సబ్ ప్లాన్ కింద రూ.31 కోట్లు మంజూరు చేసి, టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ సెంటర్ (TCBC), గురుకుల పాఠశాల నిర్మాణానికి అప్పటి రంగారెడ్డి కలెక్టర్ ఈ భూమిని కేటాయించారు. డప్పులు కొట్టే కుటుంబాల బిడ్డలు గ్లోబల్ లెవెల్‌లో డాలర్లు సంపాదించేలా తీర్చిదిద్దేందుకు, కేసీఆర్ ఆదేశాలతో 15 అంతస్తుల ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ భవన నిర్మాణ ప్రతిపాదనలు సిద్ధం చేశాం. అప్పట్లోనే బలరాం నాయక్ డాక్యుమెంట్లు పట్టుకుని నా దగ్గరకు వస్తే నిర్మొహమాటంగా తిరస్కరించాను. కానీ నేడు అధికార బలంతో ఆ భూమిని మింగేసే ప్రయత్నం చేస్తున్నారు" అని మండిపడ్డారు.

హైడ్రా, రెవెన్యూ అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు?

పేదల ఇళ్లను కూల్చడంలో చూపే ఉత్సాహాన్ని హైడ్రా (HYDRAA) అధికారులు వేల కోట్ల విలువైన ఈ గురుకుల భూమిని కాపాడటంలో ఎందుకు చూపడం లేదని ఆర్ఎస్పీ నిలదీశారు. విజిలెన్స్, రెవెన్యూ, సాంఘిక సంక్షేమ శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. కబ్జాలు చేయాలనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తదితర నేతల వందల ఎకరాల భూములకు వెళ్లాలని, పేద ఎస్సీల భూములే దొరికాయా అని ప్రశ్నించారు.

RS Praveen Kumar Alleges 1000 Cr Gurukulam Land Scam by Congress MP

15 రోజుల గడువు.. లేదంటే సంక్షేమ భవన్ ముట్టడి

మరో 15 రోజుల్లోగా శేరిలింగంపల్లిలోని 4.13 ఎకరాల భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించి, సాంఘిక సంక్షేమ శాఖ ఆధీనంలోకి తీసుకురావాలని ప్రవీణ్ కుమార్ అల్టిమేటం జారీ చేశారు. లేనిపక్షంలో వేలాది మందితో కలిసి భూమిని కాపాడుకోవడంతో పాటు, సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

అల్మాస్‌గూడ దాడి ఘటనపై ఆగ్రహం

మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో దళిత క్రైస్తవులపై జరిగిన దాడిని, న్యాయం కోసం వెళ్లిన బీఆర్ఎస్ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని ఆర్ఎస్పీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఏ పౌరుడికైనా మత స్వేచ్ఛ ఉంటుందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయనడానికి ఈ ఘటనలే నిదర్శనమని విమర్శించారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు రమేష్ నాయక్, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement