త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | హైద‌రాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ‌ ఇళ్లు చూపెట్టు.. నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా: రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్

KTR | హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు చూపిస్తే తాను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. కూక‌ట్‌ప‌ల్లి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో సోమ‌వారం ఆయ‌న మాట్లాడుతూ స‌ర్ విష‌యంలో బీఎల్ఏలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు.

S

Hyderabad | Published On May 25, 2026, 3.01 pm IST

KTR | హైద‌రాబాద్‌లో ఒక్క ఇందిరమ్మ‌ ఇళ్లు చూపెట్టు.. నేను రాజ‌కీయ స‌న్యాసం తీసుకుంటా: రేవంత్‌కు కేటీఆర్ స‌వాల్
Advertisement
  • కొత్త ఇండ్లు క‌ట్టే తెలివి లేదుగ‌ని ఉన్న కొంప‌లు కూలుస్తుండు
  • గుంపు మేస్త్రీ అంటే ఇండ్లు క‌ట్టాలే.. కానీ కూల‌గొట్టుడేంది
  • వ‌చ్చేది బీఆర్ఎస్సే.. ముఖ్య‌మంత్రి అయ్యేది కేసీఆరే
  • అధికారంలోకి వ‌చ్చాక ఆడ‌బిడ్డ‌ల క‌ష్టాలు తీరుస్తాం
  • కూక‌ట్‌ప‌ల్లి కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో కేటీఆర్‌

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: హైదరాబాద్ నగరంలో రేవంత్ రెడ్డి ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కట్టినట్లు చూపిస్తే తాను శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటా అని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స‌వాల్ విసిరారు. ఇందిర‌మ్మ ఇండ్లు ఎక్క‌డున్నా ద‌మ్ముంటే చూపించాల‌న్నారు. కూకట్ పల్లిలో సోమ‌వారం జరిగిన బీఆర్ఎస్ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఓట్ల సవరణ కార్యక్రమంలో ఆయ‌న మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీల‌కు ఆరు ల‌క్ష‌లు ఇస్తా అన్న‌వ్.. మిగ‌తా వారికి ఐదు ల‌క్ష‌లు ఇస్తా అన్న‌వ్‌. ఉన్న ఇండ్లు కూల‌గొట్టుడు త‌ప్పా కొత్త ఇండ్లు కట్టే తెలివి లేదు. ఇంకా నేను గుంపు మేస్త్రీ అని చెప్పుకుంట‌డు. గుంపు మేస్త్రీ అంటే ఇండ్లు కట్టాలే. వీడెక్క‌డి గుంపు మేస్త్రీ ఉన్న ఇండ్లు కూల‌గొడుతుండు. ఉన్న కొంప‌లు ముంచెటోడు గుంపు మేస్త్రీ ఎట్లా అయిత‌డు అని ఎద్దేవా చేశారు.

ఆడ‌బిడ్డ‌ల‌కు మాటిస్తున్నా.. 24 గంట‌లు తాగునీరు ఇస్తాం..

65 ఏండ్లు కాంగ్రెస్ వాళ్లు క‌రెంటు ఇవ్వ‌లేదు. శివారు ప్రాంతాల్లో ఉండే ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డే ప‌రిస్థితి ఉండే. హైదరాబాద్‌లో 24 గంటల తాగునీటి సరఫరా చేస్తాం. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే. అధికారంలోకి రాగానే 24 గంటలు విద్యుత్ ఇచ్చినట్టే.. 24 గంటలు తాగునీటి సరఫరా చేస్తామని మాటిస్తున్నాను. హైదరాబాద్ నగరంలో రెండున్నర లక్షల మంది పేదలకు ఇండ్ల పట్టాలిచ్చిన మనసున్న నాయకుడు కేసీఆర్. ఆడ‌బిడ్డ‌ల‌కు వాగ్దానం చేస్తున్నా. త‌ప్ప‌కుండా నీరిచ్చి మీ మ‌న‌సులు గెలుసుకుంటం.

ఇందిరమ్మ రాజ్యమంటూ గద్దెనెక్కి పేదల ఇండ్లను కూలుస్తూ వారి బతుకులను రేవంత్‌ రోడ్డున పడేస్తున్నారు. కాంగ్రెస్ దద్దమ్మల పాలనలో హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ పూర్తిగా కుప్పకూలిపోయింది. లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి పోయింది. మీరు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. 2028లో మళ్లీ రాబోయేది కేసీఆర్.. గులాబీ జెండానే. మీకు బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తాం. మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. మీకు అండగా నిలుస్తాం అని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు.

ఆదివార‌మొస్తే హైడ్రా అరాచ‌కం..

ఆదివారం అచ్చిందంటే హైడ్రాతో అరాచ‌కం చేస్తున్నారు. ఇండ్లు కూల‌గొట్టుడే ఇందిర‌మ్మ రాజ్యం ప‌ని. కూక‌ట్‌ప‌ల్లిలో బుచ్చ‌మ్మ అని ఒక మ‌హిళ ఇంటి మీద హైడ్రావాళ్లు నోటీసు పెట్టారు. ఇల్లు కూలిపోత‌ద‌నే బాధ‌తోటి బాలాన‌గ‌ర్‌లో ఉన్న‌ వాళ్ల బిడ్డ ఇంటికి పోయి ఉరిబోసుకున్న‌ది. భ‌యంతోనే చ‌చ్చిపోయింది. ఇట్లా వేల‌ది ఇండ్ల‌ను కూల‌గొట్టారు. ఖ‌మ్మం వెలుగుమ‌ట్ల కావొచ్చు.. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో దివ్యాంగుల కాల‌నీ కావ‌చ్చు, హైద‌రాబాద్‌లో ఇండ్లు కావొచ్చు.. ఇలా దుర్మార్గంగా కూల‌గొడుతున్న ప్ర‌భుత్వం, చెత్త ప్ర‌భుత్వం ఈ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అని కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు.

రాష్ట్రంలో 3.39 కోట్ల ఓట్లున్నాయి..

కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్ల పైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీంతోపాటు ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీని కోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలి. రాష్ట్రంలో 3.39 కోట్ల ఓట్లు ఉన్న‌ట్లు ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ చెబుతోంది. మొత్తం పోలింగ్ బూత్‌లు 35,985 ఉన్నాయి. స‌ర్ అనేది దేశంలో 13 సార్లు జ‌రిగింది. ఇప్పుడు జ‌రిగేది 14వ‌ది. చివ‌రిసారి ఉమ్మ‌డి రాష్ట్రంలో 2002లో ఈ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. 2002 ఓట‌ర్ లిస్టు, 2025 ఓట‌ర్ లిస్టు ప‌క్క‌ప‌క్కనే పెట్టుకొని అధికారులు పోల్చి చూస్తారు. ఫ్యామిలీ మ్యాపింగ్ ద్వారా న‌మోదు చేస్తారు. కొత్త కోడండ్లు వ‌చ్చినా పేర్లు న‌మోదు చేస్తారు. చ‌నిపోయిన‌వాళ్ల ఓట్లు తీసేస్తారు. 18 ఏండ్లు నిండిన వారి పేర్లు కొత్త‌గా న‌మోదు చేస్తారు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్లిన వారికి ఓటు అక్క‌డ తొల‌గించి ఇక్క‌డ రాయించాలి.

బెంగాల్‌లో 95 ల‌క్ష‌ల ఓట్లు తొల‌గించారు..

జూన్ 25 నుంచి జూలై 24 దాకా ఇంటింటికి వ‌చ్చే కార్య‌క్ర‌మం మొద‌లైత‌ది. ఆగ‌స్టు 30 దాకా అభ్యంత‌రాలు తెల‌పొచ్చు. మ‌నం కూడా బూత్ లెవ‌ల్ ఏజెంట్ల‌ను పెట్టుకున్నాం. ఓటు పోకుండా కాపాడుకోవాలి. బీఎల్ఏల‌ మీద బాధ్య‌త ఎక్కువ ఉంట‌ది. అర్హుల ఓట్లు పోకుండా చూసే బాధ్య‌త బూత్ లెవ‌ల్ ఏజెంట్ల‌దే. బెంగాల్ 95 ల‌క్ష‌ల ఓట్లు పోయిన‌య్‌. అందులో 27 ల‌క్ష‌ల మంది కోర్టుల్లో కొట్లాడుతున్నారు. బిహార్‌లో 65 ల‌క్ష‌ల ఓట్లు పోయిన‌య్‌. అందులో దాదాపు 10 ల‌క్ష‌ల కోర్టుల్లో కొట్లాడుతున్నారు. మ‌నం అప్ర‌మంతా ఉంటే ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకోవ‌చ్చు అని కేటీఆర్ సూచించారు.

మీ బూత్‌కు మీరు ఎమ్మెల్యే లెక్క‌..

బీఎల్ఏలు బీఎల్‌వోల‌తో క‌లిసి ప‌ని చేయాలి. మీ బూత్‌కు మీరు ఎమ్మెల్యే లెక్క‌. త‌ప్ప‌కుండా ఎన్యుమ‌రేష‌న్ ఫామ్ నింపేలా చూసుకోవాలి. 18 ఏండ్లు నిండిన వారిని కొత్త‌గా న‌మోదు చేయాలి. న‌కిలీ ఓట్లు, చ‌నిపోయిన వాళ్ల ఓట్లు తొల‌గించేలా చూసుకోవాలి. అధికారుల‌తో క‌లిసి త‌ప్ప‌కుండా క్షేత్ర‌స్థాయికి వెళ్లాలి. త‌ప్పు జ‌రిగితే వెంట‌నే అడ‌గాలి. ఈ విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలి అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

జూబ్లీహిల్స్‌లో డూబ్లీకేట్ ఓట్ల‌తోనే కాంగ్రెస్ గెలిచింది..

మొన్న జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ డూబ్లీకేట్ ఓట్ల‌తోనే గెలిచింది. వాళ్లు ముందుజాగ్ర‌త్త ప‌డ్డారు. ఒక‌టే ఓట‌ర్‌కు రెండు ఓట్లు ఉండొచ్చు. నాలుగు ర‌కాల డూబ్లీకేట్ ఓట్లు ఉంటాయి. వాటిని గ‌మ‌నించాలి. ఒక యువ‌తికి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ ప‌రిధిలో ఐదు ఓట్లు ఉన్నాయి. క‌చ్చితంగా దొంగ ఓట్లు అని నేను అన‌ట్లేదు. ఇంటిపేర్లు వేరు ఉండొచ్చు. నేన్ కాద‌నా. ఆ వెరిఫికేష‌న్ బాధ్య‌త మ‌న‌దే. ఏదో ఒక‌చోట‌నే ఓటు ఉండాలి అని చెప్పాలి. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో 30 వేల నుంచి 40 వేల న‌కిలీ ఓట్లు ఉన్నాయి. వీటిని తీసేస్తేనే కాంగ్రెస్‌, బీజేపీల డ్రామాలు సాగ‌వు. అప్పుడు బీఆర్ఎస్ సునాయ‌సంగా గెలుస్త‌ది. ప్ర‌తి ఒక్క‌రికి హ్యాండ్ బుక్‌, వ‌ర్క్ బుక్ ల‌ను అందిస్తాం. డివిజ‌న్ నాయ‌కులు, కార్పొరేట‌ర్‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాలి అని కేటీఆర్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement