త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tummala Nageshwar Rao | తెలంగాణ‌లో 315 మండ‌లాల్లో క‌రువు

Tummala Nageshwar Rao | వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు తెలిపారు.

S

Telangana | Published On Oct 17, 2026, 8.02 pm IST

Tummala Nageshwar Rao | తెలంగాణ‌లో 315 మండ‌లాల్లో క‌రువు
Advertisement

క‌రువును ఎదుర్కోనేందుకు కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలి
పంట‌ల‌కు సాగునీరు, విద్యుత్ స‌ర‌ఫ‌రా అందేలా చ‌ర్య‌లు
ఖేతో బచావో అభియాన్ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి తుమ్మ‌ల‌

Tummala Nageshwar Rao | త్రినేత్ర న్యూస్ : వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలోని 315 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొంటున్నాయని రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు తెలిపారు. పంటల పరిస్థితిని అంచనా వేయడం, అందుబాటులో ఉన్న నీటిని సంరక్షించడం, పంటలు కోతకు వచ్చే వరకు వాటిని కాపాడేందుకు అవసరమైన సాగునీరు, విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.

కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి అధ్యక్షతన ఈరోజు నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్‌లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో కూడా ఈ 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమాన్ని 22 అక్టోబర్ నుండి 30 నవంబర్ వరకు నిర్వహిస్తామని, దీనికి గాను అఖిల భారత వ్యవసాయ సంస్థలు మరియు విశ్వ విద్యాలయాల సిబ్బంది సహకారంతో వీటిని గ్రామాలలో నిర్వహిస్తామని తెలిపారు.

క‌రువు పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని మంత్రి కోరారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సూక్ష్మ సేద్యానికి, మధ్యంతర కాలంలో సాగు చేసే పంటలకు అవసరమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వాతావరణ పరిస్థితుల వల్ల రైతులకు ఎదురయ్యే నష్టాలను తగ్గించేందుకు తగిన ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు.

ఎరువుల ధరలు, సబ్సిడీల అంశాన్ని ప్రస్తావిస్తూ యూరియాపై అధిక సబ్సిడీ కారణంగా ఇతర ఎరువులతో పోలిస్తే దాని ధర తక్కువగా ఉందని, దీనివల్ల యూరియా అధిక వినియోగం పెరిగి నేల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతులపై అదనపు ఆర్థిక భారం పడకుండా ఎరువుల ధరలు, సబ్సిడీలను హేతుబద్ధీకరించి, ఎరువుల సమతుల్య వినియోగాన్ని ప్రోత్సహించాలని ఆయన కోరారు.

Advertisement
Advertisement