Retro to Metro| రెట్రో టు మెట్రో.. హైదరాబాద్‌లో సైకిళ్ల ప్రస్థానం ఇలా..!
Retro to Metro| రెట్రో టు మెట్రో( Retro to Metro ).. ఏదో ఆసక్తిగా ఉంది కదా..! గత కొద్ది రోజుల నుంచి 80వ దశకం ట్రెండ్ ఇంటర్నెట్‌ను ఊపేస్తుంది. ఓసారి ఆ పాత రోజుల్లోకి వెళ్లి వస్తున్నారు. మరి ఆ మాదిరే.. రెట్రో టు మెట్రో కూడా ఆసక్తికరమైన అంశమే. ఎందుకంటే హైదరాబాద్( Hyderabad )నగరంలో 1900లలో పరుగులు పెట్టిన సైకిళ్లు( Cycles ) ఇప్పుడు అదృశ్యమయ్యాయి. ఇప్పుడు మెట్రో( Metro ) పరుగులు పెడుతోంది. మరి రెట్రో టు మెట్రో కథనం మీ కోసం.
సంక్షిప్త సారాంశం
పెడల్స్ నుండి పెట్రోల్( Pedals to Petrol ).. పెట్రోల్ నుండి విద్యుత్ ఆధారిత మెట్రో రైళ్ల వరకు హైదరాబాద్ ప్రజల ప్రయాణం సాగింది.. సాగుతూ వస్తోంది. హైదరాబాద్( Hyderabad ) భవిష్యత్తు అంటే సైకిళ్లు, కార్ల కింద నలిగిపోయేలా ఉండకూడదు, లేదా కార్లు, మెట్రో పిల్లర్ల కింద కనిపించకుండా పోయేలా ఉండకూడదు. అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఒకదానితో ఒకటి కలిసికట్టుగా సాగాలి.
పెడల్స్ టు పెట్రోల్
పెట్రోల్ టు మెట్రో
నాడు సంపన్నుల దర్పం సైకిల్
నేడు ఖరీదైన, విలావసవంతమైన కార్లు
హైదరాబాద్ రోడ్లపై సైకిళ్ల ప్రస్థానం ఇదీ
Retro to Metro | త్రినేత్ర.న్యూస్ : వందేళ్ల క్రితం.. హైదరాబాద్( Hyderabad )లో రవాణా వ్యవస్థ పెద్దగా అభివృద్ధి చెందలేదు. చాలా వరకు గుర్రాలను తమ రవాణాకు ఉపయోగించేవారు. ఎడ్ల బండ్లను కూడా రవాణాకు వినియోగించేవారు. ఆ తర్వాత సైకిళ్లు( Cycles ) వినియోగంలోకి వచ్చాయి. బ్రిటీషర్లు ఈ సైకిళ్లను పరిచయం చేసిన తర్వాత.. సంపన్నుల నుంచి మొదలుకుంటే సామాన్యుల వరకు సైకిళ్లనే తమ దర్పంగా భావించి రవాణా సాధనంగా వినియోగించేవారు.
హైదరాబాద్ పబ్లిక్ లైఫ్( Hyderabad Public Life )కు సైకిళ్లతో ఉన్న అనుబంధానికి నిజాం కాలం నాటి బైసైకిల్ బాయ్స్( Bicycle Boys ) ఒక అరుదైన నిదర్శనం. సైకిళ్ల తర్వాత స్కూటర్లు, మోటారు సైకిళ్లు అందుబాటులోకి వచ్చాయి. అప్పటి వరకు సైకిల్ పెడల్‌పై కాలు మోపడం అనేది ప్రజల దైనందిన జీవితంలో ఒక భాగమైపోయింది.
బైసైకిల్ బాయ్స్ టు బాంబే సైకిల్ ఏజెన్సీ ( Bicycle Boys to Bombay Cycle Agency )

1877లో నిజాం బైసైకిల్ బాయ్స్( Nizams Bicycle Boys ) ద్వారా సైకిళ్లకు నగరం పరిచయమైంది. ఆ తర్వాత ఏడేళ్లకు అంటే 1904లో సికింద్రాబాద్‌లోని జేమ్స్ స్ట్రీట్‌లో బాంబే సైకిల్ ఏజెన్సీ( Bombay Cycle Agency )అనే షోరూమ్‌ను తొలిసారిగా ఏర్పాటైంది. ఆ మరుసటి ఏడాది 1905లో హైదరాబాద్ పోలీసులు సైకిళ్లపై తిరుగుతూ పెట్రోలింగ్ నిర్వహించేవారు. తమ కార్యకలాపాలకు కూడా వాటిని విరివిగా వినియోగించేవారు. ఆ తర్వాత సైకిళ్ల వాడకం నగరమంతా వ్యాపించింది. ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల మధ్య సైకిళ్ల పెడల్స్ మోత.. ఎంతో లయబద్ధంగా ఉండేది. విద్యార్థుల నుంచి మొదలుకుంటే.. ఉద్యోగులు కార్యాలయాలకు, కార్మికులు ఫ్యాక్టరీలకు, వ్యాపారులు తమ బజార్లకు సైకిళ్లపైనే వెళ్లేవారు.
పర్యావరణంపై ప్రేమతో కాదు..

ఆ కాలంలో సైకిల్‌ను ఒక అలవాటుగానో, శారీరక సామర్థ్యం కోసమో వినియోగించలేదు. అంతకంటే పర్యావరణంపై ప్రేమతో కూడా కాదు. కేవలం హైదరాబాద్ నగర ప్రయాణ జీవన విధానం అది. హైదరాబాద్ రవాణా రంగంలో వచ్చిన అనేక మార్పులను అర్థం చేసుకోవాలంటే.. ఒకప్పుడు నగరం సైకిళ్ల నగరంగా ఉండేదనే విషయం స్పష్టమవుతుంది.
జంట నగరాల మధ్య సైకిళ్లపైనే రాకపోకలు

ఓల్డ్ సిటీ, అబిడ్స్, కోఠి, సుల్తాన్ బజార్, నాంపల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించేందుకు సైకిల్ చాలా సులువుగా ఉండేది. ఎందుకంటే దీనికి ఇంధనం కూడా అవసరం లేదు. అందరికీ సరసమైన ధరలో లభించేది కూడా.
1990లలో ఊహించని మార్పులు

ఇక క్రమక్రమంగా హైదరాబాద్ జనాభా పెరగడం ప్రారంభమైంది. 1990లో ఆర్థిక సరళీకరణ తర్వాత ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని బస్తీలు పుట్టుకొచ్చాయి. జనాభా పెరిగింది. జనాభాకు అనుగుణంగా కొత్త ఉపాధి కేంద్రాలు వెలిశాయి. ఐటీ హైదరాబాద్‌కు పరిచయమైంది. దీంతో పశ్చిమ భాగం ఐటీ కార్యకలాపాలకు నెలవైంది. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలు.. హైదరాబాద్ ఆర్థిక కార్యకలాపాలకు ఆర్థిక చిహ్నాలుగా మారాయి.
సైకిళ్ల స్థానాన్ని ఆక్రమించిన మోటారు సైకిళ్లు
ఈ క్రమంలో 1980లలో ఎంతో ఆదరణ పొందిన సైకిళ్ల వినియోగం క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. గతంలో ఐదారు కిలోమీటర్లు ఉన్న ప్రయాణం.. ఐటీ అభివృద్ధితో కాస్త 15 నుంచి 20 కిలోమీటర్లకు చేరింది. దూరం ఒక్కటే కాదు.. సమయం కూడా విలువైనదిగా మారింది. సమయంతో పోటీ పడాలంటే వేగంగా పరుగెత్తాలి. దీంతో ఎలాంటి ఇంధనం అవసరం లేని సైకిళ్ల స్థానంలో మోటారు సైకిళ్లు, స్కూటర్లు ప్రత్యామ్నాయంగా ఉద్భవించాయి. ఓల్డ్ సిటీ, ఐటీ కారిడార్ మధ్య మోటారు సైకిళ్ల వినియోగం పెరిగింది. మధ్య తరగతి ప్రజలు కూడా మోటారు సైకిళ్లను కొనుగోలు చేయడం మొదలుపెట్టారు. ఇలా సైకిళ్ల స్థానాన్ని మోటారు సైకిళ్లు ఆక్రమించాయి.
సంపన్నులకు చిహ్నంగా మారిన కారు

ఆర్థిక సరళీకరణ నేపథ్యంలో నగరంలో ప్రజల ఆదాయం కూడా పెరిగింది. మోటారు సైకిళ్లు కాకుండా కార్లు తమ ఆదాయానికి, ఉన్నతస్థాయి ఆకాంక్షలకు చిహ్నంగా మారాయి. మారుతున్న జీవనశైలి కారణంగా కార్లు మరింత ఆకర్షణీయంగా మారాయి. సౌకర్యవంతంగా ఉండడం, వాతావరణ మార్పుల నుంచి రక్షణ పొందేందుకు, ఇంటి వద్దకే వచ్చే రవాణా సౌకర్యం వంటి కారణాల వల్ల కారు ఒక విలాసవంతమైన వస్తువుగా తయారైంది. దీంతో మధ్య తరగతి ప్రజలకు తమ ఆదాయ వనరులకు ఒక చిహ్నంగా, చాలా కుటుంబాలకు అవసరంగా మారిపోయింది.
2006 నాటికి 2.3 లక్షలకు పైగా కార్లు
క్రమక్రమంగా సైకిళ్లు, మోటారు సైకిళ్ల స్థానంలో కార్లు ప్రవేశించాయి. ఇందుకు నిదర్శనం ఈ గణాంకాలే అని చెప్పొచ్చు. 1991లో హైదరాబాద్‌లో సుమారు 36,600 రిజిస్టర్డ్ కార్లు, దాదాపు 2.79 లక్షల టూ-వీలర్స్ ఉండేవి. 2006 నాటికి కార్ల సంఖ్య 2.3 లక్షలకు పైగా చేరింది. టూ-వీలర్స్ సంఖ్య 21 లక్షలు దాటింది. ఇది కేవలం వ్యక్తిగత ఇష్టాల్లో వచ్చిన మార్పు మాత్రమే కాదు. ఫోర్ వీలర్స్ పెరగడంతో.. సమస్యలు కూడా వచ్చాయి. ప్రతి అదనపు వాహనం రోడ్డుపై ట్రాఫిక్‌కు కారణమైంది. పార్కింగ్ సమస్యను కూడా తెచ్చింది. ఇంధన డిమాండ్‌ను పెంచింది. ఈ క్రమంలో రోడ్ల విస్తరణ, ప్లై ఓవర్ల ఏర్పాటు అనివార్యంగా మారింది. రోడ్ల విస్తరణ, ఫ్లై ఓవర్లు, కొత్త కారిడార్‌లు వినియోగంలోకి వచ్చినప్పటికీ తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కలిగించాయి. పెరుగుతున్న మహా నగర అవసరాలను అవి శాశ్వతంగా తీర్చలేకపోయాయి. హైదరాబాద్ నగరం పెరిగే కొద్ది.. ప్రయాణాలు కూడా పెరుగుతూ వచ్చాయి.
2017లో అందుబాటులోకి మెట్రో

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎంటీఎస్ వ్యవస్థ కూడా అందుబాటులోకి వచ్చింది. అది కూడా స్వల్ప ఉపశమనాన్ని మాత్రమే కలిగించింది. ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నప్పటికీ.. ప్రజా రవాణా వ్యవస్థను ఇంకా మెరుగుపరిచేందుకు, కాలుష్యం నుంచి నగరాన్ని కాపాడేందుకు మెట్రో రైలును అందుబాటులోకి తెచ్చారు. కానీ ఇప్పటికీ నగరంలోని మెజార్టీ శ్రామిక వర్గానికి ఆర్టీసీ బస్సులే ప్రధాన ఆధారం. 2017 నవంబర్ నెలలో హైదరాబాద్ మెట్రో తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ వ్యవస్థ నగర ప్రజల్లో మార్పును తీసుకొచ్చింది. ఐటీ ఉద్యోగులు, ఇతర ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంత వాహనాలను వదిలేసి.. మెట్రోలో ప్రయాణించడం మొదలుపెట్టారు. ఎందుకంటే గమ్యస్థానం త్వరగా చేరుకునే అవకాశం ఏర్పడింది కాబట్టి. మూడు కారిడార్లలో విస్తరించిన 69 కిలోమీటర్ల ఈ మెట్రో నెట్‌వర్క్, సొంత వాహనాలను రోడ్లపైకి తెచ్చే కంటే, ప్రజలను సామూహికంగా ఒకేచోట తరలించడం ఎంత ముఖ్యమో నిరూపించింది.
పక్కకు నెట్టేయబడ్డ సైకిళ్లు..
ప్రస్తుత హైదరాబాద్‌లో అన్ని రకాల రవాణా వ్యవస్థలు ఒకేసారి కనిపిస్తాయి. సైకిళ్లు ఇప్పటికీ కనిపిస్తున్నప్పటికీ, అవి రోడ్లపై పక్కకు నెట్టేయబడ్డాయి. వ్యక్తిగత ప్రయాణాల్లో టూ-వీలర్స్ రాజ్యమేలుతున్నాయి. కార్లు హోదాకు, సౌకర్యానికి చిహ్నాలుగా మారాయి. ప్రజా రవాణాలో బస్సులు ఇప్పటికీ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లు శివారు ప్రాంతాల ప్రయాణికులకు సేవలు అందిస్తుండగా, మెట్రో రైళ్లు నగరంలోని ప్రధాన మార్గాల్లో ప్రయాణానికి వెన్నెముకగా మారుతున్నాయి.
అదే నిజమైన కొలమానం..
ఒకప్పుడు సైకిళ్లపై నిశ్శబ్దంగా సాగిన ఈ నగరం, నేడు ఎంతో దూరం ప్రయాణించింది. హైదరాబాద్ తదుపరి విజయం అనేది రోడ్లపై మరిన్ని వాహనాలను ఎలా సరిపెట్టామనే దానిపై ఆధారపడి ఉండకూడదు. తక్కువ స్థలంలో, తక్కువ సమయంలో, పర్యావరణానికి తక్కువ నష్టం కలిగిస్తూ ప్రజలను ఎంత సమర్థవంతంగా గమ్యస్థానాలకు చేర్చామనే దానిపైనే ఆధారపడి ఉండాలి. సైకిళ్ల నగరం నుండి నిజమైన ఆధునిక మహానగరంగా హైదరాబాద్ సాగించిన ప్రయాణానికి అదే నిజమైన కొలమానం.
మరిన్ని ఆసక్తికర అంశాలు..
- ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతుడిగా ఖ్యాతి పొందిన అసఫ్‌జాహీలు సైతం సైకిల్‌ను దర్పంగా ప్రదర్శించిన సందర్భాలున్నాయని చరిత్ర చెబుతుంది.
- ఇర్రంమంజిల్ నిర్మాత నవాబ్ ఫక్రూల్ ముల్క్ బహదూర్ మొట్టమొదటిసారిగా సైకిల్ కొనుగోలు చేసినట్లు చరిత్రలో నమోదైంది.
- ఆరో నిజాం నవాబు బామ్మర్ది పైగా రాజవంశానికి చెందిన అమీర్ నవాబ్ జాఫర్ జంగ్ బహదూర్ 1896లో బషీర్‌బాగ్ ప్యాలెస్‌లో సైకిల్ క్లబ్‌ను ఏర్పాటు చేశారు.
- సికింద్రాబాద్ జేమ్స్‌స్ట్రీట్‌లో 1904లో మొట్టమొదటి సైకిల్ షోరూమ్ ‘బొంబాయి సైకిల్ ఏజెన్సీ’ పేరుతో ప్రారంభమైంది.
- నగర పోలీసులు ఫ్రెంచ్‌మేడ్ క్లెమెల్ట్ సైకిల్‌ను వినియోగించేవారు.
- నగరంలో 1960వరకు సైకిల్ వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన కొనసాగింది.
- సైకిల్ ముందు హెడ్‌లైట్ పనిచేయకపోయినా నిజాం సర్కారు జరిమానా విధించేది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు
- ●Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ
- ●DCP shilpavalli | కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదు : డీసీపీ శిల్పవల్లి
- ●Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణనాథుడు.. నేడు భక్తుల సంఖ్య లక్ష దాటేనా..?
- ●KTR | శభాష్ కాంగ్రెస్.. కేటీఆర్ ట్వీట్
- ●Murder | హైదరాబాద్‌లో రౌడీషీటర్ దారుణహత్య

RRB Secunderabad | సికింద్రాబాద్ రైల్వే జోన్లో 71 పారామెడికల్ పోస్టులు.. అక్టోబర్ 14 వరకు దరఖాస్తులు

Heart Attack| పిల్లలతో ఆడుకుంటుండగా గుండెపోటు.. కుర్చీలోనే కుప్పకూలిన టెకీ

DCP shilpavalli | కేటీఆర్ పీఏ, పీఆర్వోపై ఎలాంటి దాడి జరగలేదు : డీసీపీ శిల్పవల్లి

Khairatabad Ganesh | ఖైరతాబాద్ గణనాథుడు.. నేడు భక్తుల సంఖ్య లక్ష దాటేనా..?




