త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana ESI Hospitals | రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాదే షురూ.. కేంద్ర మంత్రి మాండవీయ గ్రీన్ సిగ్నల్!

తెలంగాణలో కార్మికులకు మెరుగైన వైద్యం అందించే దిశగా కీలక అడుగు. రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయి.

J

Hyderabad | Published On Jul 14, 2026, 9.13 pm IST

Telangana ESI Hospitals | రామగుండం ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారం నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాదే షురూ.. కేంద్ర మంత్రి మాండవీయ గ్రీన్ సిగ్నల్!
Advertisement
  • రామగుండంలో 100 పడకల ఈఎస్ఐ ఆస్పత్రి, నాచారంలో నర్సింగ్ కాలేజీ వచ్చే ఏడాది ప్రారంభం
  • రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తికి కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ గ్రీన్ సిగ్నల్
  • సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో కొత్త ఓపీడీ (OPD) బ్లాక్ ప్రారంభించిన మంత్రులు
  • అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో 20 పడకల డయాలసిస్ (Dialysis) యూనిట్లు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి డిమాండ్

Telangana ESI Hospitals | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణలోని పారిశ్రామిక కార్మికులు, వారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. రామగుండంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న 100 పడకల ఈఎస్ఐ (ESI) ఆస్పత్రి, నాచారంలో ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీని వచ్చే ఏడాదికల్లా ప్రారంభిస్తామని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. మంగళవారం (జూలై 14) హైదరాబాద్ సనత్‌నగర్‌ ఈఎస్ఐసీ ఆస్పత్రిలో నూతన ఓపీడీ (OPD) బ్లాక్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

Ramagundam ESI Hospital and Nacharam Nursing College to Start Next Year

మంత్రి వివేక్ విజ్ఞప్తికి తక్షణ స్పందన

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చేసిన విజ్ఞప్తికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. టెండర్ల దశలో ఆగిపోయిన రామగుండం ఆస్పత్రి పనులను వెంటనే పునరుద్ధరించి, వచ్చే ఏడాదికల్లా సేవలు అందుబాటులోకి తెస్తామని మాండవీయ హామీ ఇచ్చారు. అలాగే విదేశాల్లో నర్సులకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని, నాచారంలో నర్సింగ్ కాలేజీ ఏర్పాటుకు కూడా ఓకే చెప్పారు.

Ramagundam ESI Hospital and Nacharam Nursing College to Start Next Year

సనత్‌నగర్ ఈఎస్ఐలో విప్లవాత్మక మార్పులు

ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. సనత్‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రి సేవలను కొనియాడారు. తన తండ్రి, కేంద్ర మాజీ మంత్రి కాకా వెంకటస్వామి హయాంలో ఈ ఆస్పత్రిని చూశానని, ఇప్పుడు రాష్ట్ర మంత్రి హోదాలో వచ్చినప్పుడు ఇక్కడ కనిపిస్తున్న మార్పులు ఆకట్టుకున్నాయన్నారు. పూర్తిస్థాయి కార్డియాక్ కేర్ (Cardiac Care), బైపాస్ సర్జరీలు, క్యాన్సర్ చికిత్సలు అందించే స్థాయికి ఈ ఆస్పత్రి ఎదగడం ఈఎస్ఐసీ సేవల విస్తరణకు నిదర్శనమన్నారు.

డయాలసిస్ యూనిట్లు తప్పనిసరి

తెలంగాణలో సుమారు 80 లక్షల మంది ఈఎస్ఐ సేవలపై ఆధారపడ్డారని మంత్రి వివేక్ తెలిపారు. సనత్‌నగర్ ఆస్పత్రిపై రద్దీని తగ్గించేందుకు రామచంద్రాపురం (RC Puram), నాచారంలో 20 పడకల చొప్పున డయాలసిస్ (Dialysis) యూనిట్లు ఏర్పాటు చేయాలని కోరారు. కిడ్నీ వ్యాధులు పెరుగుతున్న నేపథ్యంలో, అన్ని ఈఎస్ఐ ఆస్పత్రుల్లో డయాలసిస్ సేవలు అందుబాటులోకి వస్తే కార్మికులకు ఎంతో మేలు జరుగుతుందని నొక్కిచెప్పారు.

Ramagundam ESI Hospital and Nacharam Nursing College to Start Next Year

కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి

శంషాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిలో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, అలాగే మహబూబ్‌నగర్, వరంగల్‌లో కొత్త ఆస్పత్రులకు అనుమతులు ఇవ్వాలని వివేక్ విజ్ఞప్తి చేశారు. భూ సమస్యల వల్ల నిలిచిపోయిన 15 ఈఎస్ఐ డిస్పెన్సరీలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. ఏడాదిలోగా వాటిని రాష్ట్ర ప్రభుత్వం తరపున అందుబాటులోకి తెస్తామని ఆయన స్పష్టం చేశారు. కార్మికుల ఆరోగ్య భద్రత కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

Advertisement
Advertisement