త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | మీకు ప‌ట్టాలిచ్చే బాధ్య‌త మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భ‌రోసా

KTR | రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హ‌నుమాన్ న‌గ‌ర్ బ‌స్తీవాసులంద‌రికీ ప‌ట్టాలిచ్చే బాధ్య‌త మాదేన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నిర్వ‌హించిన‌ "బస్తీ బాట" కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

S

Hyderabad | Published On Jun 21, 2026, 7.46 pm IST

KTR | మీకు ప‌ట్టాలిచ్చే బాధ్య‌త మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భ‌రోసా
Advertisement

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: రాజేంద్ర‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని హ‌నుమాన్ న‌గ‌ర్ బ‌స్తీవాసులంద‌రికీ ప‌ట్టాలిచ్చే బాధ్య‌త మాదేన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఆదివారం సాయంత్రం నిర్వ‌హించిన‌ "బస్తీ బాట" కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడారు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయ‌ని ఆరోపించారు.

స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవు. ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి.. మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. మీ అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి. కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దు అని కేటీఆర్ సూచించారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదు. అలవి కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను "గుంపు మేస్త్రి" అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. పెద్దలకు ఒక నీతి... పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. మేమంతా మీకు అండగా ఉంటాం.. ఎవ్వరూ భయపడకండి అని కేటీఆర్ వారికి భ‌రోసా ఇచ్చారు.

అంత‌కుముందు దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న తమను బలవంతంగా తరలించి, ఆ భూములను ప్రభుత్వం అమ్మేసుకోవాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని బ‌స్తీవాసులు కేటీఆర్‌ దృష్టికి తీసుకొచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన పట్టాలను కూడా రద్దు చేసి, తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే స‌బితా ఇంద్రారెడ్డి, కార్తీక్, స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

 

 

Advertisement
Advertisement