త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Moinabad Farmhouse Drugs Case | తీగ లాగితే డొంక కదుల్తున్నది.. రోజు రోజుకూ విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్ వర్క్

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉన్న ఈ కేసులో తీగ లాగితే ఏకంగా ఎంపీలు, కార్పొరేట్ డాక్టర్లు, వీఐపీల డొంక కదులుతోంది!

J

Hyderabad | Published On Mar 25, 2026, 8.25 pm IST

Moinabad Farmhouse Drugs Case | తీగ లాగితే డొంక కదుల్తున్నది.. రోజు రోజుకూ విస్తరిస్తున్న డ్రగ్స్ నెట్ వర్క్

సంక్షిప్త సారాంశం

మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో 'ఈగల్' (EAGLE), 'సిట్' (SIT) బృందాలు లోతైన దర్యాప్తు చేస్తున్నాయి. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫాంహౌస్‌లో మార్చి 14న జరిగిన రేవ్ పార్టీపై పోలీసుల దాడి జరిగింది. ఈ పార్టీకి హాజరైన ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌తో పాటు మరికొందరిని అరెస్టు చేశారు. తృటిలో అధికార పార్టీకి చెందిన ఓ కీలక ఎంపీ తప్పించుకున్నారు. డ్రగ్స్ పెడ్లర్ అభిషేక్ సింగ్ విచారణలో కార్పొరేట్ డాక్టర్లు, వీఐపీల పేర్లు బయటపడ్డాయి. డ్రగ్స్ కేసుల విచారణలో అధికార పార్టీ నేతలను సీఎం రేవంత్ రెడ్డి వెనకేసుకొస్తున్నారని విపక్షాల ఆరోపిస్తున్నాయి.

Advertisement
  • రోహిత్ రెడ్డి గుప్పిట్లో సంపన్నుల చిట్టా
  • మొయినాబాద్ డ్రగ్స్ పార్టీకి
  • జస్ట్ మిస్సయిన ఓ ఎంపీ
  • డ్రగ్స్ కేసులో అనుయాయులపై ఈగ వాలనివ్వని సీఎం రేవంత్ రెడ్డి
  • విపక్షాలతో లింకులుంటే మాత్రం
  • బలమైన కేసులకు ఆదేశం

Moinabad Farmhouse Drugs Case | త్రినేత్ర.న్యూస్: రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో తవ్వినకొద్దీ ఇటు ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) బృందానికి, అటు ప్రత్యేక దర్యాప్తు బృందానికి (సిట్) కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తీగ లాగితే డొంకంతా కదిలి డ్రగ్ నెట్వర్క్ మూలాలన్నీ బయటపడుతున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పైలెట్ రోహిత్ రెడ్డి గుప్పిట్లో సంపన్నులందరి జాబితా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.

ఆ ఎంపీ జస్ట్ మిస్

తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మొయినాబాద్‌లోని తన ఫాం హౌస్‌లో గత మార్చి 14 రాత్రి
టీడీపీ ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్, మరికొందరు మిత్రులతో కలిసి పార్టీ నిర్వహించుకున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు సదరు ఫాం హౌస్ కు వెళ్లారు. ఈ నేపథ్యంలో రోహిత్ రెడ్డి మనుషులు పోలీసులపైనే కాల్పులు జరిపారు. పోలీసులు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు రితేశ్ రెడ్డి, ఎంపీ పుట్టా మహేశ్ సహా నిందితులందరినీ అరెస్టు చేశారు. కాగా, ఈ పార్టీకి అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నాయకుడి కుమారుడు, ప్రస్తుత ఎంపీ ఒకరు కూడా హాజరు కావాల్సి ఉన్నది. కాగా, సదరు ఎంపీ మార్గమధ్యలో ఉండగానే పార్టీపై పోలీసులు దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

కార్పొరేట్ డాక్టర్లు కూడా

ఈ డ్రగ్ పార్టీ తర్వాత లోతైన విచారణ చేపట్టిన ఈగల్ టీంకు మరిన్ని వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. రోహిత్ రెడ్డి డ్రైవర్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన పెడ్లర్, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అభిషేక్ సింగ్‌ను సిట్ బృందం గత శనివారం అదుపులోకి తీసుకున్నది. రోహిత్ రెడ్డి బృందం ఇప్పటికే 24 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు అభిషేక్ పోలీసులకు వెల్లడించాడు. అంతేకాదు హైదరాబాద్‌లో అనేకమంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిపాడు. ఇలా డ్రగ్స్ అందుకుంటున్న వారిలో రాజకీయ నేతలు, కార్పొరేట్ వైద్యులు కూడా ఉన్నట్టు సమాచారం. బేగంపేట, జూబ్లీహిల్స్‌లో ఉన్న ప్రముఖ హాస్పిటళ్ల లో కొందరు వైద్యులు కూడా తరచుగా డ్రగ్స్ తీసుకుంటున్నట్టు తెలిసింది.

అల్లుడు కూడా.. వ్యసనపరుడేనా?

డ్రగ్స్ వ్యసనం బారిన పడిన ఓ ప్రముఖ వైద్యుడి కుమార్తె ఆరు నెలల క్రితం ఈగల్ బృందానికి పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెకు డీ అడిక్షన్ కౌన్సెలింగ్ ఇచ్చినా లాభం లేకుండా పోయింది. ఫాం హౌస్ కేసులో మళ్లీ ఆమె పట్టుబడడం గమనార్హం. రాష్ట్ర రాజకీయాల్లో పేరు గడించిన ఓ ప్రముఖ నేత అల్లుడు కూడా పూర్తిగా డ్రగ్స్ కు వ్యసనపరుడైనట్టు పోలీసు వర్గాలు ఆఫ్ ది రికార్డ్ చర్చించుకుంటున్నాయి.

అనుయాయులపై ఈగ వాలనివ్వకుండా

డ్రగ్స్ మూలాలను పెకిలించి వేసి రాష్ట్రాన్ని విముక్తం చేస్తామంటూ పదే పదే ప్రకటనలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మాట‌ల‌కే ప‌రిమిత‌మ‌య్యార‌ని విప‌క్ష పార్టీల నాయ‌కులు మండిప‌డుతున్నారు. డ్ర‌గ్ కేసుల‌లో పాత్ర ఉన్నప్ప‌టికీ త‌న‌ అనుయాయులపై ప్రత్యేక ప్రేమ వ్యక్తం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అనేక మంది డ్రగ్స్ మూలాలకు సంబంధించి కేసుల్లో ఉన్నా.. వారి పేర్లు బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడుతున్నారంటూ మండిపడుతున్నారు. నిష్పక్షపాత విచారణ జరపాలనుకుంటే.. ముందు డ్రగ్స్ కు బానిసగా మారిన అధికార పార్టీ ఎంపీతో పాటు కీల‌క నేత 'అల్లుడు'కి ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, వారిపై కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును నేరుగా ముఖ్య‌మంత్రి కార్యాల‌యం నుంచే ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. త‌మ అనుకూల మీడియాకు లీకులిస్తూ.. విచార‌ణ‌ను కూడా స్వీయ‌ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు వినియోగిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement