MP Eatala Rajender | ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా ఉంటా.. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల ఫైర్
MP Eatala Rajender | హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థను ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
MP Eatala Rajender | త్రినేత్ర న్యూస్ : హైడ్రా (HYDRAA) కమిషనర్ రంగనాథ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చట్టాలు, కోర్టులు, న్యాయ వ్యవస్థను ఏమాత్రం ఖాతరు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జీడిమెట్ల ఫాక్స్ సాగర్ చెరువు ప్రాంతంలో హైడ్రా బాధితులు, పారిశ్రామికవేత్తలు, కార్మికులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో చెరువులు, నాలాలు బాగుపడతాయని, అక్రమ కట్టడాల తొలగింపు మంచి నిర్ణయమేనని కొందరు సమర్థించారని, అయితే 25-26 ఏళ్ల రాజకీయ అనుభవంతో ఇది చివరకు పేదల ఇళ్లు, పరిశ్రమలను కూల్చే సంస్థగా మిగిలిపోతుందని తాను అప్పుడే హెచ్చరించానని ఈటల గుర్తుచేశారు. తాము పర్యావరణానికి, చట్టాలకు, ప్రభుత్వాలకు వ్యతిరేకం కాదని, అయితే చట్టబద్ధంగా ఏర్పడిన హైడ్రా చట్టానికి లోబడి పనిచేయాలే తప్ప 'తాత జాగీర్' లాగా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. ఈటల రాజేందర్ హైడ్రా వెంబడి పడ్డాడని కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యానిస్తున్నట్లు తెలిసిందని, జీడిమెట్ల, దూలపల్లి, చర్లపల్లి, ఉప్పల్-మల్లాపూర్ సహా ఉత్తర హైదరాబాద్‌లోని పారిశ్రామిక వాడలన్నీ తన మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలోకే వస్తాయని, స్థానిక ఎంపీగా ప్రజలు, పరిశ్రమల రక్షణ తన కర్తవ్యమని పేర్కొన్నారు. పోలీసు, మున్సిపాలిటీ, పరిశ్రమల శాఖ వంటి వ్యవస్థలన్నీ విఫలమై బాధితుల గోడు వినేవారు లేకపోవడంతోనే తాను ప్రత్యక్ష పోరాటానికి దిగానని తెలిపారు.
83 పరిశ్రమల ఆందోళన.. మంత్రి శ్రీధర్ బాబుకు లేఖ
దూలపల్లి, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాల్లో ఒక్కొక్కరు రూ. 4 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టి 83 పరిశ్రమలను నడుపుతున్నారని, వాటిపై వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. పక్కనే ఉన్న వెంకటేశ్వర ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ బాధితులకు ఈ నెల 20వ తేదీన కోర్టు 'స్టేటస్ కో' (Status Quo) ఇచ్చినప్పటికీ అక్కడ కూల్చివేత పనులు ఆగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పరిశ్రమల శాఖ మంత్రి, ఉమ్మడి రంగారెడ్డి-మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీధర్ బాబుతో ఉదయమే మాట్లాడానని, సమస్యను పరిష్కరించాలని కోరుతూ స్వయంగా లేఖ కూడా రాశానని వెల్లడించారు.
నగరీకరణ, గత ప్రభుత్వాల నిర్ణయాలు.. భూసేకరణ చట్టం ఏది?
తాను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు 'మిషన్ కాకతీయ' సమయంలోనే పట్టా భూములు ముంపునకు గురైతే పరిహారం ఇవ్వాలని ప్రతిపాదించానని చెప్పారు. దశాబ్దాల క్రితం నాటి ప్రభుత్వాలు, కలెక్టర్లు, ఇరిగేషన్ అధికారులే ఆయకట్టు మార్పు (ఆయాన్ కన్వర్షన్) చేసి లేఅవుట్లు, పరిశ్రమలకు అనుమతులు ఇచ్చారని గుర్తుచేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్, తన స్వగ్రామంలోని 'ఊరగుంట' స్థలంలో నిర్మించిన ఎంఆర్వో, ఎంపీడీవో కార్యాలయాలు చెరువు స్థలాల్లో కట్టినవేనని, వాటిని కూల్చే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని సవాల్ విసిరారు. అప్పటి ముఖ్యమంత్రులు చేసిన పనులు తప్పని శిక్ష వేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎల్ (FTL) పరిధిలో సెక్రటేరియట్, జలవిహార్, ఎన్టీఆర్ ఘాట్, అంబేద్కర్ విగ్రహం, నెక్లెస్ రోడ్, బస్తీలు, చివరికి హైడ్రా కార్యాలయం కూడా ఉన్నాయనే ప్రచారం ఉందని, వాటిని కూల్చగలరా అని నిలదీశారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ కూడా హుస్సేన్ సాగర్‌ను కొబ్బరి నీళ్లలా మారుస్తానని చెప్పారని, కానీ నేటికీ హుస్సేన్ సాగర్, ఫాక్స్ సాగర్, అల్వాల్, ఉప్పల్ చెరువులన్నీ డ్రైనేజీ నీటితో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయని విమర్శించారు. ముందుగా ఉన్న చెరువులకు కట్టలు వేసి, మురికి నీరు రాకుండా శుద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
ఫాక్స్ సాగర్‌లో ప్రభుత్వ భూమి ఎంత, ప్రైవేట్ పట్టా భూమి ఎంత అనే లెక్కలను బహిర్గతం చేయాలని, పట్టా భూములు అవసరమైతే భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం లేదా భూమికి బదులు భూమి ఇవ్వాలి కానీ, బలవంతంగా లాక్కోవడం సరికాదని అన్నారు.
న్యాయవ్యవస్థ, మీడియాకు విజ్ఞప్తి.. ప్రభుత్వంపై హెచ్చరిక.
హైకోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్లు, స్టేటస్ కో ఉత్తర్వులను కూడా హైడ్రా పట్టించుకోవడం లేదని, హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు జోక్యం చేసుకుని రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడాలని వినమ్రంగా విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల ఆస్తులను కాపాడాలి తప్ప ధ్వంసం చేయకూడదని, 2028 వరకు మాత్రమే ఈ ప్రభుత్వం ఉంటుందని, బాధితుల కన్నీళ్లను వీడియోలుగా రికార్డు చేసి రాబోయే ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో ఉంచుతామని హెచ్చరించారు. హైడ్రాకు అనుకూలంగా వార్తలు రాయాలని, కిరాయి మనుషులతో మాట్లాడించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలుస్తోందని, నాలుగో స్తంభమైన మీడియా ప్రలోభాలకు లొంగకుండా బాధితుల పక్షాన నిలబడి వాస్తవాలను చూపించాలని కోరారు. తెలంగాణ ఉద్యమంలో తనపై 250-300 కేసులు నమోదయ్యాయని, ఇప్పుడు కూడా ప్రజల కోసం ఎన్ని కేసులు పెట్టినా ముందుండి పోరాడుతానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు గిరివర్ధన్ రెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్‌చార్జ్ వడ్డెపల్లి రాజేశ్వర్ రావు, సిద్దిపేట జిల్లా పార్టీ అధ్యక్షుడు శంకర్, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు శేఖర్ యాదవ్, రాజిరెడ్డి, సరిత, సతీష్ సాగర్, అసోసియేషన్ ప్రెసిడెంట్ సామేశ్వర్ రావు, నాయకులు, 83 కంపెనీల యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.
సంబంధిత వార్తలు

Harish Rao | నవంబర్ 29 లేకపోతే తెలంగాణ లేదు.. తెలంగాణే లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం అయ్యేవాడా
నవంబర్ 29, 2026

GCC | సాఫ్ట్వేర్ నుంచి సెమీకండక్టర్ల దాకా.. కొత్త తరం పరిశ్రమల కేంద్రంగా తెలంగాణ
నవంబర్ 29, 2026

Drunk and Drive Cases | వీకెండ్ తనిఖీలు.. పట్టుబడిన మందుబాబులు.. ఎన్ని కేసులు అయ్యాయంటే!
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Sharad Pawar | ముంబైకి ఇండియా కూటమి నేతల పరుగు.. డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?
- ●Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు
- ●Abbas | ఒకేసారి మూడు సినిమాలు - టాలీవుడ్లోకి ప్రేమదేశం అబ్బాస్ రీఎంట్రీ
- ●MK Stalin | కట్టబొమ్మన్, ఎట్టప్పన్, డీలిమిటేషన్: రాహుల్‌కి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. తమిళ చరిత్రలోని ఆ ఇద్దరి కథేంటో తెలుసా?
- ●Sonia Gandhi Movie | సోనియా సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసిన జగ్గారెడ్డి.. ఆయన ఎవరంటే!

Sharad Pawar | ముంబైకి ఇండియా కూటమి నేతల పరుగు.. డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?

Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు

Abbas | ఒకేసారి మూడు సినిమాలు - టాలీవుడ్లోకి ప్రేమదేశం అబ్బాస్ రీఎంట్రీ



