త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

తనపై నమోదైన 63 కోర్టు ధిక్కరణ కేసుల వెనుక అసలు నిజాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ బయటపెట్టారు. బడా బిల్డర్ల పేర్లతో ఆయన చేసిన సంచలన ప్రకటన ఏంటంటే?

J

Hyderabad | Published On Jul 27, 2026, 9.49 pm IST

AV Ranganath | బడా మాఫియాను అడ్డుకున్నందుకే నాపై ఆ 63 కేసులు.. బిల్డర్ల పేర్లతో ఏవీ రంగనాథ్ సంచలన ప్రకటన!

సంక్షిప్త సారాంశం

గడిచిన రెండేళ్లలో రూ.1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. లోతుకుంటలో రూ. 10 వేల కోట్ల భూమిని కొట్టేయాలని చూసిన శాంతా శ్రీరామ్ సంస్థనే తనపై కోర్టు ధిక్కరణ కేసు వేసిందని వెల్లడించారు. సంధ్యా శ్రీధర్ రావు, నల్ల మల్లారెడ్డి వంటి బడా కబ్జాదారులను అడ్డుకున్నందుకే తనపై 63 కేసులు నమోదయ్యాయన్నారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే తాను పనిచేస్తున్నానని, కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్న ఆ మాఫియాను చట్టపరంగానే ఎదుర్కొంటానని ఆయన ఉద్ఘాటించారు.

Advertisement

AV Ranganath | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న హైడ్రా (HYDRAA) కమిషనర్ ఏవీ రంగనాథ్ (AV Ranganath) సంచలన ప్రకటన చేశారు. తనపై నమోదైన 63 కోర్టు ధిక్కరణ (Contempt of court) కేసుల వెనుక ఉన్న బడా ల్యాండ్ మాఫియా, రియల్ ఎస్టేట్ సంస్థల పేర్లను ఆయన బహిర్గతం చేశారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే తాను విధులు నిర్వర్తిస్తున్నానని, ఆ కబ్జాదారులకు అడ్డుపడినందుకే తనపై తప్పుడు కేసులు బనాయించారని స్పష్టం చేస్తూ ఆయన విడుదల చేసిన లేఖ రాజకీయ, రియల్ ఎస్టేట్ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

రూ.1.5 లక్షల కోట్ల ఆస్తుల రక్షణ

గత రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A ప్రకారం వేలాది ఎకరాల ప్రభుత్వ భూములను (Government lands), పార్కులను రక్షించినట్లు రంగనాథ్ తెలిపారు. వాటి మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు) ఉంటుందన్నారు. బడా బాబులు ఆక్రమించిన వందలాది చెరువులను వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించామని, ఆరు చెరువులను పూర్తిగా పునరుద్ధరించగా (Restoration), మరో 20 చెరువుల పనులు వేగంగా జరుగుతున్నాయని వివరించారు.

లోతుకుంటలో ఆ సంస్థ కుట్ర.. విచ్చలవిడిగా బ్లాస్టింగ్‌లు

లోతుకుంట భూమి వివాదంపై రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "అక్కడ సుమారు రూ. 10 వేల కోట్ల విలువైన 120 ఎకరాల ప్రభుత్వ భూమిని 'శాంతా శ్రీరామ్' (Shanta Sriram) అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. ఎలాంటి పర్మిషన్స్ (Permissions) లేకుండా 2500 కోట్ల సంవత్సరాల నాటి హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేయడమే కాకుండా, వందలాది చెట్లను నరికేసి పర్యావరణాన్ని ధ్వంసం చేసింది. పర్యావరణవేత్తలు, సేవ్ ది రాక్స్ సొసైటీ (Save the Rocks Society) సహా స్థానికుల ఫిర్యాదుతోనే హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న లేని భూమిని చూపిస్తూ, ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించిన ఆ బిల్డర్ (Builder) నాపై కంటెంప్ట్ కేసు వేశాడు" అని రంగనాథ్ కుండబద్దలు కొట్టారు.

ఆ 63 కేసులు వేసింది వీళ్లే!

తనపై ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులన్నీ ఆ బడా భూకబ్జాదారులే వేశారని రంగనాథ్ స్పష్టం చేశారు. బతుకమ్మ కుంటను మింగేయాలని చూసిన వ్యక్తి, లోతుకుంటలో వేల కోట్లు కొట్టేయాలని చూసిన సంస్థ, సామాన్యుల ప్లాట్లు లాక్కొని బడా కాంప్లెక్స్‌లు కడుతున్న సంధ్యా శ్రీధర్ రావు, వేలాది మంది సింగరేణి కార్మికుల ప్లాట్లకు ఎసరు పెట్టిన నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చెలామణి అవుతూ రూ. వేల కోట్ల ఆస్తులు ఆక్రమించిన ముఖీం వంటి వారిని అడ్డుకోవడమే తాను చేసిన తప్పా అని ప్రశ్నించారు.

న్యాయవ్యవస్థపై అపార నమ్మకం ఉంది

ల్యాండ్ మాఫియా (Land mafia), కబ్జాదారులు కావాలనే తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారని రంగనాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఆ కేసులన్నింటినీ తాను చట్టపరంగానే ఎదుర్కొంటానని, న్యాయస్థానాలపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. నిబద్ధతతో, నిర్భయంగా పనిచేస్తాం కాబట్టే హైడ్రాకు ఆ ధైర్యం ఉందని, ప్రభుత్వం తనకు ఎప్పుడు ఎలాంటి బాధ్యతలు అప్పగించినా 100 శాతం ఫలితాలు ఇచ్చేలా పనిచేస్తానని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement