త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు

లేఅవుట్లలోని పార్కులు, స్థలాలు కబ్జాకు గురవుతున్నాయంటూ హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు అందాయి. వీటిపై కమిషనర్ ఏవీ రంగనాథ్ వెంటనే కీలక ఆదేశాలు జారీ చేశారు.

J

Hyderabad | Published On Aug 17, 2026, 10.00 pm IST

HYDRA Prajavani Complaints | హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు.. పార్కులనూ వదలట్లేదు
Advertisement
  • పార్కులు, పబ్లిక్ స్థలాలు, చెరువుల కబ్జాలపై 'హైడ్రా ప్రజావాణి'కి భారీగా (52) చేరిన ఫిర్యాదులు
  • పెద్ద అంబర్‌పేట, మదీనాగూడ, వనస్థలిపురంలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై బాధితుల వినతులు
  • గాజులరామారంలో గతంలో హైడ్రా కూల్చిన చోటే మళ్లీ నిర్మాణాలు చేపడుతున్నారని అసోసియేషన్ మెంబర్స్ ఫిర్యాదు
  • బాధితుల వినతులను స్వయంగా పరిశీలించి, అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపించాలని అధికారులను ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

HYDRA Prajavani Complaints | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాలు, లేఅవుట్లలోని పబ్లిక్ పార్కులు, రోడ్లను కబ్జా చేస్తున్న ఆక్రమణదారులపై స్థానిక ప్రజలు కొరడా ఝుళిపిస్తున్నారు. తాజాగా హైడ్రా (HYDRA) నిర్వహించిన 'ప్రజావాణి' కార్యక్రమానికి పౌరుల నుంచి విశేష స్పందన లభించింది. ఏకంగా 52 ఫిర్యాదులు హైడ్రా అధికారుల టేబుల్ వద్దకు చేరాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను స్వయంగా పరిశీలించిన ఆయన, వెంటనే వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు.

పాత లేఅవుట్లకు ప్రాణం పోయండి సార్

పెద్ద అంబర్‌పేట: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం పెద్ద అంబర్‌పేట గ్రామంలోని (సర్వే నంబర్లు 668-674) 28 ఎకరాల గ్రీన్‌ఫీల్డ్ కాలనీలో లేఅవుట్‌ను 1991లో వేశారు. ఇందులో కొన్ని ప్లాట్లు (Plots) ఎల్ఆర్ఎస్ (LRS) కూడా అయ్యాయి. కానీ, ఇప్పుడు ఆ లేఅవుట్ భూమిని మాయం చేస్తూ, వేరే వాళ్లకు అమ్ముతూ పార్కులు, రోడ్లను కబ్జా చేస్తున్నారని బాధితులు ఫిర్యాదు చేశారు. పాత లేఅవుట్‌ను కాపాడాలని కోరారు.

మదీనాగూడ: ఆర్టీసీ (RTC) కాలనీ లేఅవుట్‌లో ఆసుపత్రి, పబ్లిక్ అవసరాల కోసం వదిలిన 402 చదరపు గజాల స్థలాన్ని కొందరు ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేశారని, ఆ స్థలాన్ని రక్షించాలని ఆర్టీసీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విన్నవించారు.

కూల్చిన చోటే మళ్లీ కడుతున్నారు

గాజులరామారం: దేవేందర్‌నగర్‌లోని చింతల్ చెరువు ప్రాంతంలో (సర్వే నంబర్ 329) ఆక్రమణదారుల ఆగడాలు మితిమీరుతున్నాయని వీనస్ రాక్ హైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. గతంలో హైడ్రా కూల్చివేసిన అక్రమ నిర్మాణాలను మళ్లీ దర్జాగా నిర్మిస్తున్నారని, అనధికారికంగా కరెంటు కనెక్షన్లు కూడా తీసుకున్నారని తెలిపారు. వెంటనే ఫెన్సింగ్ (Fencing) వేసి చెరువును కాపాడాలని కోరారు.

రోడ్లు, టెంపుల్ స్థలం.. ఏదీ వదలట్లేదుగా

వనస్థలిపురం: మారుతీనగర్‌లోని (సర్వే నంబర్లు 158, 159, 179) ప్లాట్ నంబర్ 226, 227 లను కాలనీలో పబ్లిక్ పార్క్, టెంపుల్ కోసం వదిలారు. కానీ అక్కడ ఎలాంటి పర్మిషన్ (Permission) లేకుండా కొందరు మూడు అంతస్తుల భవనం కడుతున్నారని స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేశారు. వెంటనే ఆ నిర్మాణాలను తొలగించాలని కోరారు.

పటేల్‌గూడ: సృజన లక్ష్మీనగర్ ఫేజ్-2 లోని రోడ్ నంబర్ 7 ను నాళా పక్కన పూర్తిగా ఆక్రమించారని, దీంతో కమ్యూనికేషన్, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు ఫిర్యాదు చేశారు.

మేకలమండి బస్తీ: సర్వే నంబర్ 242లోని ప్రభుత్వ భూమిని కొందరు వ్యక్తులు ఆక్రమించి ఏకంగా ప్రహరీ గోడలు కడుతున్నారని, దీంతో కాలనీ రోడ్డు బ్లాక్ అయిపోతోందని స్థానికులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement
Advertisement