త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!

HMWSSB | హైదరాబాద్‌లో తాగునీటి నాణ్యతపై సోషల్‌ మీడియాలో ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, సర్వేలపై జలమండలి స్పష్టత ఇచ్చింది. వాటిలో పరీక్షించినవి భూగర్భజల నమూనాలేనని, జలమండలి శుద్ధి చేసి నల్లాల ద్వారా సరఫరా చేసే తాగునీటి నమూనాలు కావని పేర్కొంది.

P

Hyderabad | Published On Oct 6, 2026, 2.42 pm IST

HMWSSB | బోరు నీరు.. నల్లా నీరు ఒక్కటి కాదు!
Advertisement
  • పరీక్షించింది భూగర్భజలాలనే..
  • జలమండలి సరఫరా చేసేది శుద్ధి చేసిన నీరే
  • బోరు నీటిని తాగేముందు నాణ్యత పరీక్షించుకోవాలి
  • సోషల్‌ మీడియాలో వైరల్‌ వీడియోలపై జలమండలి స్పష్టత

HMWSSB | హైదరాబాద్‌లో తాగునీటి నాణ్యతపై సోషల్‌ మీడియాలో ఇటీవల ప్రచారంలోకి వచ్చిన వీడియోలు, సర్వేలపై జలమండలి స్పష్టత ఇచ్చింది. వాటిలో పరీక్షించినవి భూగర్భజల నమూనాలేనని, జలమండలి శుద్ధి చేసి నల్లాల ద్వారా సరఫరా చేసే తాగునీటి నమూనాలు కావని పేర్కొంది. భూగర్భజల పరీక్షల ఫలితాలను జలమండలి సరఫరా చేసే నీటికి అన్వయించడం సరికాదని తెలిపింది. భూగర్భజల నాణ్యత ప్రాంతాన్నిబట్టి మారుతుందని జలమండలి వెల్లడించింది. సహజ భౌగోళిక, స్థానిక పరిస్థితుల కారణంగా కొన్ని ప్రాంతాల్లో టిడీఎస్, హార్డ్‌నెస్, ఫ్లోరైడ్, నైట్రేట్‌ తదితరాలు నిర్దేశిత ప్రమాణాలకు భిన్నంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో బోరు లేదా ఇతర భూగర్భజలాలను తాగేముందు తప్పనిసరిగా నాణ్యత పరీక్ష చేయించుకోవాలని సూచించింది.

రోజుకు 5,500 నమూనాల పరీక్షలు

వివిధ జలవనరుల నుంచి సేకరించే రోజుకు సుమారు 560 ఎంజీడీ నీటిని నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన తర్వాతే జలమండలి సరఫరా చేస్తోంది. జలవనరు నుంచి వినియోగదారుడి నల్లా వరకు వివిధ దశల్లో రోజుకు సుమారు 5,500 నీటి నమూనాలను పరీక్షిస్తోంది. క్యూ‌ఏటీ, ఓఅండ్‌ఎం సిబ్బంది, లైన్‌మెన్లు, థర్డ్‌పార్టీ సంస్థల ద్వారా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైనా నమూనాలో ప్రతికూల ఫలితం నమోదైతే కారణాన్ని గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అనంతరం మరోసారి నమూనాలను పరీక్షించి నాణ్యతను నిర్ధారిస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌లోని ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన కేంద్ర ప్రయోగశాలతోపాటు ఇతర ప్రయోగశాలల్లో ఐఎస్‌ 10500:2012 ప్రమాణాలకు అనుగుణంగా భౌతిక, రసాయన, బ్యాక్టీరియాలజికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మూడు దశల్లో క్లోరినేషన్‌

తాగునీటి భద్రత కోసం ప్రీ, పోస్ట్, బూస్టర్‌ దశల్లో క్లోరినేషన్‌ చేపడుతున్నారు. టెయిల్‌ ఎండ్‌ వరకు అవసరమైన అవశేష క్లోరిన్‌ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం సుమారు 330 క్లోరినేషన్‌ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో నిర్వహించే నీటి నాణ్యత పరీక్షలను ‘నాణ్యత’ మొబైల్‌ యాప్‌ ద్వారా రియల్‌టైమ్‌లో పర్యవేక్షిస్తున్నారు. పైప్‌లైన్‌ లీకేజీలు, స్థానికంగా ఏర్పడే కలుషిత సమస్యలను వేగంగా గుర్తించి పరిష్కరించేందుకు అన్ని జోన్లలో జీఐఎస్‌ సాంకేతికత ఆధారంగా 10 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

శుద్ధి చేసిన నీటికే ప్రాధాన్యం ఇవ్వాలి

భూగర్భజల నాణ్యత ప్రాంతాన్నిబట్టి మారుతుందని, బోరు నీటిని తాగేముందు నాణ్యత పరీక్ష చేయించుకోవాలని జలమండలి ఎండీ కే అశోక్‌రెడ్డి సూచించారు. ప్రజలకు సురక్షితమైన, నాణ్యమైన తాగునీటిని అందించడమే జలమండలి ప్రథమ ప్రాధాన్యమని, తాగునీటి నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సుదూర జలవనరుల నుంచి తీసుకొచ్చి శుద్ధి చేస్తున్న విలువైన నీటిని వృథా చేయకుండా ప్రధానంగా తాగునీటి అవసరాలకే వినియోగించాలని ఆయన కోరారు. ప్రతి నీటి బొట్టును బాధ్యతగా వినియోగిస్తూ.. అందరికీ సమానంగా నీరు అందేలా జలమండలికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement
Advertisement