త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. డ్రగ్స్, పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం

CP Sajjanar | విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసుల‌లు శనివారం నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరిత భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు. విద్యాసంస్థల పరిసరాలను వ్యసనరహిత వాతావరణంగా తీర్చిదిద్దడం, చిన్నారులు తప్పుదారి పట్టకుండా కాపాడడం ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రధాన ఉద్దేశ‌మ‌ని పోలీసులు తెలిపారు.

P

Hyderabad | Published On Apr 18, 2026, 6.53 pm IST

CP Sajjanar | ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరుతో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. డ్రగ్స్, పొగాకు విక్రయాలపై ఉక్కుపాదం
Advertisement

CP Sajjanar | విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దెబ్బతీస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టే లక్ష్యంతో హైదరాబాద్ సిటీ పోలీసుల‌లు శనివారం నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ పేరిత భారీ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హించారు. విద్యాసంస్థల పరిసరాలను వ్యసనరహిత వాతావరణంగా తీర్చిదిద్దడం, చిన్నారులు తప్పుదారి పట్టకుండా కాపాడడం ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రధాన ఉద్దేశ‌మ‌ని పోలీసులు తెలిపారు. పొగాకులోని నికోటిన్‌కు అలవాటు పడటం, మాదకద్రవ్యాల వినియోగానికి తొలి మెట్టుగా మారుతోందని తెలిపారు. విద్యాసంస్థల సమీపంలో సులభంగా లభించే పొగాకు ఉత్పత్తులు విద్యార్థులను క్రమంగా మద్యం, డ్రగ్స్ వంటి వ్యసనాల వైపు నెట్టే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ అలవాట్లు చివరకు చిన్న నేరాల నుంచి తీవ్రమైన నేరాల వరకు దారితీసి వారి భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. ఈ ప్రమాదకర పరిస్థితిని ప్రాథమిక దశలోనే అడ్డుకునేందుకు ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) 2003 సెక్షన్ 6(b) ప్రకారం విద్యాసంస్థల 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయం పూర్తిగా నిషేధించారు. అలాగే, మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం జువెనైల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హమైన నేర‌మ‌ని తెలిపారు. ఈ నిబంధనల అమలును పకడ్బందీగా పర్యవేక్షిస్తూ, ఉల్లంఘనలకు పాల్ప‌డిన దుకాణ‌దారుల‌పై పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు. హైద‌రాబాద్ సీపీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ నేతృత్వంలో సుమారు 5 వేల మంది సిబ్బంది నగరవ్యాప్తంగా ఈ డ్రైవ్‌లో పాల్గొన్నారు. విద్యాసంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న 558 దుకాణాలపై ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, రిజర్వ్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు.

సీపీ సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించి ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లెపల్లి ప్రియా టాకీస్ జంక్షన్, గోషామహల్ వంటి రద్దీ ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమీప దుకాణాలను ఆయన తనిఖీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గోషామహల్‌లోని ఎంజే బ్రిడ్జి వద్ద మీడియాతో మాట్లాడిన సీపీ సజ్జనర్, మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో ఆడుకునే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుల నేపథ్యంలో చేపట్టిన డెకాయ్ ఆపరేషన్‌లో పలువురు దుకాణదారులు నిబంధనలు ఉల్లంఘించి చిన్నారులకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు ఆధారాలతో నిర్ధారణ అయినట్లు తెలిపారు.

పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఇలాంటి అక్రమ విక్రయాలను ఏ పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఈ తరహా నేరాలు పునరావృతం కాకుండా నిరంతర నిఘా కోసం హెచ్-న్యూ విభాగంలో ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమస్యను అరికట్టడం కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు సైతం సమాన బాధ్యతతో వ్యవహరించాలని సీపీ సూచించారు. విద్యాసంస్థల పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ చేయాలని సూచించారు. పిల్లల ప్రవర్తన, స్నేహితుల వర్గం, పాఠశాల అనంతర కదలికలపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు. విద్యాసంస్థల సమీపంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100, హెచ్‌న్యూ ఫోన్ నంబర్ 8712661601కు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు. ఆపరేషన్‌లో అదనపు సీపీలు శ్రీనివాసులు, తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సీపీలు జోయల్ డేవిస్, శ్వేత, టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్, అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement