త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP VC Sajjanar | సైబర్‌ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ కీల‌క సూచ‌న‌లు

CP VC Sajjanar | సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి క్షణిక భయానికి, అత్యాశకు లోనై కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. తాజాగా ఒక్కరోజే వెలుగుచూసిన మూడు సైబర్‌ మోసాల్లో బాధితులు ఏకంగా రూ.5.35 కోట్లు నష్టపోయారని తెలిపారు.

P

Hyderabad | Published On Oct 13, 2026, 10.30 pm IST

CP VC Sajjanar | సైబర్‌ వలలో చిక్కొద్దు.. హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్ కీల‌క సూచ‌న‌లు
Advertisement

CP VC Sajjanar | సైబర్‌ నేరగాళ్ల మాయలో పడి క్షణిక భయానికి, అత్యాశకు లోనై కష్టార్జితాన్ని పోగొట్టుకోవద్దని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ హెచ్చరించారు. తాజాగా ఒక్కరోజే వెలుగుచూసిన మూడు సైబర్‌ మోసాల్లో బాధితులు ఏకంగా రూ.5.35 కోట్లు నష్టపోయారని తెలిపారు. అపరిచిత ఫైల్స్‌ తెరవడం, ఉన్నతాధికారుల పేరుతో వచ్చే సందేశాలను నమ్మడం, అధిక లాభాల ఆశతో నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లలో పెట్టుబడులు పెట్టడం వంటి వాటితో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఓ సంస్థ అకౌంటెంట్‌ గుర్తుతెలియని జిప్‌ ఫైల్‌ను తెరవడంతో సైబర్‌ నేరగాళ్లు వల పన్నారు. సంస్థ సీఈవో ఫొటోతో నకిలీ వాట్సాప్‌ సందేశాలు పంపి నిధులను బదిలీ చేయించారు. ఇలా రూ.2.70 కోట్లు కాజేశారు. సుమారు ఎనిమిది రోజులపాటు లావాదేవీలు జరుగుతున్నా, బ్యాంకు నుంచి సందేశాలు వస్తున్నా వాటిని సరిగా పరిశీలించకపోవడంతో భారీ నష్టం వాటిల్లిందని సీపీ వివరించారు.

డిజిటల్‌ అరెస్ట్‌ అంటూ రూ.2.12 కోట్లు

మరో ఘటనలో 72 ఏళ్ల వృద్ధురాలిని మనీలాండరింగ్‌ కేసు, సీబీఐ, ఈడీ పేర్లతో బెదిరించారు. ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అంటూ 20 రోజులపాటు భయాందోళనలకు గురిచేసి, ఆమె బంగారాన్ని సైతం అమ్మించి రూ.2.12 కోట్లు కాజేశారు. దేశ చట్టాల్లో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ అనే విధానం లేదని, దర్యాప్తు సంస్థలు ఆన్‌లైన్‌లో డబ్బులు డిమాండ్‌ చేయవని సజ్జనార్ స్పష్టం చేశారు. విదేశాల్లో పనిచేసి నగరానికి వచ్చిన ఓ వైద్యుడు ఇన్‌స్టాగ్రామ్‌లో రోజుకు 5 నుంచి 20 శాతం లాభాలంటూ వచ్చిన ప్రకటనలను నమ్మి మోసపోయారు. నకిలీ ట్రేడింగ్‌ యాప్‌లో పెట్టుబడి పెట్టి రూ.52.51 లక్షలు నష్టపోయారు. అధిక లాభాల ఆశ చూపే ప్రకటనలను నమ్మొద్దని సీపీ సూచించారు.

1930కు ఫోన్‌ చేయండి

సైబర్‌ మోసాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘జాగృత్‌ హైదరాబాద్‌–సురక్షిత్‌ హైదరాబాద్‌’ కార్యక్రమం కింద ఏడాదిలో 11,417 అవగాహన సదస్సులు నిర్వహించి, 5.06 లక్షల మందికి అవగాహన కల్పించినట్లు సీపీ తెలిపారు. అనుమానాస్పద లింకులు, ఫైల్స్‌ తెరవొద్దని, ఉన్నతాధికారుల పేర్లతో సందేశాలు వస్తే సంబంధిత వ్యక్తులను నేరుగా సంప్రదించి నిర్ధారించుకోవాలని సూచించారు. వృద్ధులకు కుటుంబ సభ్యులు అండగా ఉండాలని కోరారు. కోట్ల రూపాయల అనుమానాస్పద లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారులను అప్రమత్తం చేసే వ్యవస్థలను బ్యాంకులు పటిష్టం చేసుకోవాలని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 జాతీయ సైబర్‌ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేయాలని లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సజ్జనర్‌ తెలిపారు. బాధితులు తొలి గంటలోనే స్పందిస్తే డబ్బును నిలిపివేసే అవకాశాలు మెరుగుపడతాయని పేర్కొన్నారు.

Advertisement
Advertisement