త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | గో ర‌క్ష‌కులు ప్ర‌త్య‌క్ష దాడుల‌కు పాల్ప‌డొద్దు.. సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రిక‌

CP Sajjanar | బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో గో ర‌క్ష‌కులు చ‌ట్టం ప‌ట్ల గౌర‌వంతో ఉండాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌త్య‌క్ష దాడుల‌కు పాల్ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు.

S

Hyderabad | Published On May 3, 2026, 5.39 pm IST

CP Sajjanar | గో ర‌క్ష‌కులు ప్ర‌త్య‌క్ష దాడుల‌కు పాల్ప‌డొద్దు.. సీపీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రిక‌
Advertisement

CP Sajjanar | త్రినేత్ర‌.న్యూస్ : బ‌క్రీద్ పండుగ నేప‌థ్యంలో గో ర‌క్ష‌కులు చ‌ట్టం ప‌ట్ల గౌర‌వంతో ఉండాల‌ని, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌త్య‌క్ష దాడుల‌కు పాల్ప‌డొద్ద‌ని హైద‌రాబాద్ సీపీ వీసీ స‌జ్జ‌నార్ హెచ్చ‌రించారు. బ‌క్రీద్ పండుగ‌ను పుర‌స్క‌రించుకుని న‌గ‌రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు, చ‌ర్య‌ల‌పై స‌జ్జ‌నార్.. వివిధ గోర‌క్ష‌క్ సంఘాల ప్ర‌తినిధుల‌తో పోలీసు క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్ నిర్వాహ‌కుల‌తో ప్ర‌త్యేక స‌మ‌న్వ‌య స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పండుగ వేళ నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కమిషనరేట్ సరిహద్దుల్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తూ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ముఖ్యంగా గోరక్షకులు చట్టం పట్ల అత్యంత గౌరవంతో ఉండాలని, అక్రమ పశు రవాణాకు సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా తక్షణమే పోలీసులకు తెలియజేయాలి తప్ప, ఏ పరిస్థితుల్లోనూ నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

పశువధకు సంబంధించి ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా లేదా ఉద్రిక్తతలు పెంచేలా సోషల్‌ మీడియాలో రీల్స్‌, వీడియోలు పోస్ట్‌ చేసే వారిపై కఠినమైన క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. వాలంటీర్లు చెక్‌పోస్టుల వద్ద పోలీసులతో కలిసి వెళ్లకూడదని, పశువుల ఫోటోలు తీయడం లేదా నిందితుల వివరాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం వంటి పనులు చేయరాదని సూచించారు.

పోలీసులతో సమన్వయం కోసం ప్రతి సంఘం ఒక ప్రతినిధిని, సభ్యుల ఫోన్‌ నంబర్లను పోలీసులకు అందజేయాలని, వాలంటీర్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని ఆదేశించారు. తనిఖీల పేరుతో గోరక్షకులు తమ వద్ద ఎలాంటి ఆయుధాలు, పదునైన వస్తువులు ఉంచుకోకూడదని, పోలీసుల స్వాధీనంలో ఉన్న వాహనాలను వెంబడించడం లేదా దారిలో అడ్డంకులు సృష్టించడం వంటివి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కేవలం పండుగ సమయాల్లోనే కాకుండా ఏడాది పొడవునా పశువైద్యుల ధ్రువీకరణ లేకుండా జరిగే అక్రమ రవాణాపై నిఘా ఉంచుతామని, సమాచారం కోసం పోలీసు కంట్రోల్‌ రూమ్‌ నంబరు 8712661000ను 24 గంటలూ సంప్రదించవచ్చని తెలిపారు. పౌరులందరూ సమన్వయంతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు. గోరక్షక సంఘాల ప్రతినిధులు కోరిన పలు అంశాలపై సానుకూలంగా స్పందిస్తూనే, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు.

ఈ సమావేశంలో అదనపు సీపీలు తఫ్సీర్‌ ఇక్బాల్‌, శ్రీనివాసులు, జాయింట్‌ సీపీ ఎన్‌. శ్వేత, వివిధ జోన్ల డీసీపీలతో పాటు యుగ తులసి ఫౌండేషన్‌ ప్రతినిధి కొలిశెట్టి శివకుమార్, గోరక్షక్‌ దళ్ ప్రతినిధి దీపక్ సింగ్, అఖిల భారతీయ గోసేవా ఫౌండేషన్ నుంచి ఎ. బాలకృష్ణ, భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ ప్రతినిధి జస్రాజ్ శ్రీశ్రీమాల్, బజరంగ్‌ దళ్‌కు చెందిన శ్రీకాంత్, వీహెచ్‌పీ ప్రతినిధి బి. నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement