త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ATM cash robbery Hyderabad | ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ అరెస్ట్.. రూ.34.90 లక్షలు రికవరీ చేసిన గచ్చిబౌలి పోలీసులు

గచ్చిబౌలి పరిధిలో ఏటీఎం వ్యాన్ నుంచి రూ.56 లక్షలు అపహరించిన కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ముమ్మర గాలింపు చేపట్టి నిందితుడిని పట్టుకున్నారు.

J

Hyderabad | Published On Feb 24, 2026, 11.00 pm IST

ATM cash robbery Hyderabad | ఏటీఎం క్యాష్ వ్యాన్ దొంగ అరెస్ట్.. రూ.34.90 లక్షలు రికవరీ చేసిన గచ్చిబౌలి పోలీసులు
Advertisement

ATM cash robbery Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఏటీఎంలలో నగదు నింపేందుకు వెళ్లిన వ్యాన్ నుంచి ఏకంగా రూ.56 లక్షలు పక్కదారి పట్టించిన ఘటనలో గచ్చిబౌలి పోలీసులు సంచలన పురోగతి సాధించారు. కేవలం కొద్దిరోజుల్లోనే ఈ భారీ చోరీ కేసును ఛేదించి ప్రధాన నిందితుడిని కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడి నుంచి ఏకంగా రూ.34.90 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ వెల్లడించారు.

అసలేం జరిగిందంటే?

ఈ నెల 12వ తేదీన గోపనపల్లి తండా ప్రాంతంలో వివిధ ఏటీఎం కేంద్రాలకు నగదు సరఫరా చేసే వాహనం చేరుకుంది. తోటి సిబ్బంది ఏటీఎంలో నగదు ఫిల్ చేయడానికి లోపలికి వెళ్లారు. అదే అదనుగా భావించిన ఆ వాహన డ్రైవర్ బడిగెరే అజిత్ కుమార్ అలియాస్ శివ (34) ఏకంగా రూ.56 లక్షల నగదు ఉన్న వాహనంతో అక్కడి నుంచి ఉడాయించాడు. సికింద్రాబాద్‌లోని డైమండ్ పాయింట్ వద్ద నివాసం ఉంటున్న ఇతను, సంగెం సెక్యూరిటీ ఏజెన్సీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని స్వస్థలం ఏపీలోని అనంతపురం జిల్లా బొమ్మనహల్.

వాహనంతో పరారైన అజిత్.. గద్దర్ చౌరస్తా, నల్లగండ్ల ప్రాంతాలకు చేరుకున్నాడు. అక్కడే క్యాష్ ఉన్న ట్రంక్ బాక్స్‌ను తీసుకుని, వ్యాన్‌ను వదిలేసి ఆటోలో జారుకున్నాడు. ఘటనపై ఫిర్యాదు అందుకున్న గచ్చిబౌలి పోలీసులు వెంటనే క్రైం నం.278/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

రూపాయి బ్లేడుతో పెట్టె పగులగొట్టి..

పోలీసుల కళ్లుగప్పిన నిందితుడు అదే రోజు రాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో సాధారణ ప్రయాణికుడిలా దిగాడు. ఒక చిన్న యాక్స్ బ్లేడ్ సాయంతో నగదు ఉన్న పెట్టెను అతికష్టం మీద తెరిచాడు. ఆ డబ్బునంతా తన బ్యాగ్‌లో సర్దుకుని మరుసటి రోజు (13వ తేదీన) అనంతపూర్‌కు పరారయ్యాడు. అక్కడి నుంచి పోలీసులకు చిక్కకుండా బళ్లారి, బెంగళూరు, పుణే తదితర ప్రాంతాల్లో చక్కర్లు కొట్టాడు.

టెక్నాలజీతో పట్టేసిన పోలీసులు

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను ముమ్మరంగా విశ్లేషించిన పోలీసులు నిందితుడి కదలికలను ట్రాక్ చేశారు. అతడు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నాడనే పక్కా సమాచారంతో వ్యూహాత్మకంగా వ్యవహరించి అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తన నేరాన్ని అంగీకరించిన అజిత్ వద్ద నుంచి రూ.34,90,000 నగదును సీజ్ చేశారు. మిగిలిన డబ్బును విలాసాల కోసం ఖర్చు చేసినట్లు అతను పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

సెక్యూరిటీ ఏజెన్సీకి షాక్..

నేపథ్య విచారణ లేకుండా డ్రైవర్లను విధుల్లోకి తీసుకున్న 'సంగెం సెక్యూరిటీ ఏజెన్సీ'పై కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ రెగ్యులేషన్ చట్టం–2005 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ఈ దర్యాప్తులో సెరిలింగంపల్లి జోన్ డీసీపీ సీహెచ్ శ్రీనివాస్, అదనపు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, నార్సింగి ఏసీపీ రమణ గౌడ్ నేతృత్వంలో గచ్చిబౌలి పోలీసులు, క్రైమ్ టీమ్ ప్రతిభ కనబరిచారు. కాగా, నిందితుడి అనుమానాస్పద కదలికలను గమనించి పోలీసులకు కీలక సమాచారం అందించిన ఎస్‌వీఆర్ బస్ ట్రావెల్స్ డ్రైవర్ ఉమాకాంత్‌ను ఈ సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement
Advertisement