త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CP Sajjanar | నేపాలీల‌ను ప‌నిలోకి తీసుకుంటున్నారా..?

P

Hyderabad | Published On May 8, 2026, 3.00 pm IST

CP Sajjanar | నేపాలీల‌ను ప‌నిలోకి తీసుకుంటున్నారా..?
Advertisement
  • రిటైర్డ్ డీజీ స‌తీమ‌ణి హ‌త్య క‌ల‌క‌లం
  • ప‌ని మ‌నిషి స‌హాయంతోనే హ‌త్య‌
  • సంఘ‌ట‌నా స్థ‌లాని ప‌రిశీలించిన సీపీ
  • నేపాలీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని స‌జ్జ‌నార్ సూచ‌న‌

CP Sajjanar | జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాసన్ నగర్‌లో రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ సతీమణి తనుజా రాయ్ (55) హత్య కలకలం రేపుతోంది. ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. గురువారం అర్ధరాత్రి తర్వాత ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. ఘటనపై ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ హ‌త్య వెనుక నేపాల్ ముఠా ప్ర‌మేయం ఉంద‌ని గుర్తించిన‌ట్లు ఆయ‌న తెలిపారు. కొన్ని కీలక క్లూస్ పోలీసులకు లభించాయని, వాటి ఆధారంగా ప్రత్యేక బృందాలు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఇంట్లో పని చేసే కల్పన అనే మహిళ బయట వ్యక్తులతో సంప్రదింపులు జరిపి ఈ నేరానికి సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింద‌ని సీపీ వెల్ల‌డించారు.

విచార‌ణ జ‌రుగుతుంద‌న్న సీపీ

ఘటన జరిగిన సమయంలో ఇంట్లో మిగ‌తా కుటుంబ సభ్యులు ఎవ‌రూ అందుబాటులో లేక‌పోవ‌డంతో నిందితుల‌కు అనుకూలం మారింద‌న్నారు. ఘ‌ట‌న స‌మ‌యంలో ఇద్దరు పిల్లలు పై అంతస్తులో ఉండగా, తనుజా గ్రౌండ్ ఫ్లోర్‌లో ఒంటరిగా ఉన్నారని పేర్కొన్నారు. ఇదే అవకాశంగా చూసుకుని దుండగులు ఇంట్లోకి చొరబడి హత్యకు పాల్పడినట్లుగా తెలిపారు. తనుజా చేతులను కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా హత్య చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. నిందితులు బ్యాక్ డోర్ నుంచి ఇంట్లోకి ప్ర‌వేశించార‌న్నారు. హ‌త్య త‌ర్వాత అదే మార్గంలో పారిపోయినట్లు పోలీసులు గుర్తించినట్లు చెప్పారు. ఇంటి సీసీటీవీ ఫుటేజ్, ఇతర సాంకేతిక ఆధారాలను సైతం ప‌రిశీలిస్తున్న‌ట్లు వివ‌రించారు. ఈ ఘటనలో బంగారం, నగదు ఎత్తుకెళ్లారా అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలించి, కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. హత్య ప్రధాన ఉద్దేశం దోపిడీనా? మరేదైనా కారణమా? అన్న కోణంలో విచార‌ణ జ‌రుపుతున్న‌ట్లు పేర్కొన్నారు.

ప‌నివాళ్ల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని..

రిటైర్డ్ డీజీ వినయ్ రంజన్ రాయ్ కుటుంబం ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినట్లు సీపీ తెలిపారు. ఆయన తల్లి మరణించడంతో తనుజా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. కుటుంబ పరిస్థితులు, ఇంట్లో పని చేసే సిబ్బంది వివరాలు, గత కొంతకాలంగా ఇంటికి వచ్చిన వ్యక్తులపై జాడ గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇళ్లలో పని చేసే సిబ్బంది విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్ సూచించారు. ముఖ్యంగా నేపాలీల‌ను ప‌నిలో పెట్టుకునే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్ర‌చారం చేసిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. పోలీసులు సూచిస్తున్నా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌న్నారు. నేపాలీలు ఎవ‌రినీ చూడ‌ర‌న్నారు. గ‌తంలో బెంగ‌ళూరు, ముంబ‌యిలోనూ ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌రిగాయ‌న్నారు. ఇండ్ల‌ల్లో చాలాకాలంగా పనిచేస్తున్న పర్యవేక్షణ అవసరమన్నారు. ముఖ్యంగా ఇంట్లో ఎవరూ లేని సమయాల్లో పనివారితో సంబంధం ఉన్న వ్యక్తుల కదలికలపై జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఘ‌ట‌న‌లో ఎంద‌రు పాల్గొన్నార‌న్న‌ది తెలియ‌ద‌ని, విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. కేసును సీరియ‌స్‌గా తీసుకొని విచార‌ణ జ‌రుపుతున్నామ‌న్నారు. కేసు సంబంధించిన మిగ‌తా వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని స‌జ్జ‌నార్ వివ‌రించారు.

Advertisement
Advertisement