త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake SOT police arrested | ఎస్‌వోటీ పోలీసులమంటూ భారీ దోపిడీకి స్కెచ్.. కటకటాల పాలైన నకిలీ ముఠా

హైదరాబాద్‌లో ఎస్.ఓ.టి (SOT) అధికారులమంటూ లారీ డ్రైవర్‌ను బెదిరించి డబ్బులు లాగిన ఆరుగురు నకిలీ పోలీసుల ముఠాను మీర్‌పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు.

J

Hyderabad | Published On May 19, 2026, 10.42 pm IST

Fake SOT police arrested | ఎస్‌వోటీ పోలీసులమంటూ భారీ దోపిడీకి స్కెచ్.. కటకటాల పాలైన నకిలీ ముఠా
Advertisement
  • పటాన్‌చెరు ORR వద్ద SOT పోలీసులమంటూ బియ్యం లారీని ఆపి డ్రైవర్‌ను బెదిరించిన ముఠా.
  • లారీ ఓనర్‌ను రూ.6 లక్షలు డిమాండ్ చేసి, చివరకు PhonePe ద్వారా రూ.80 వేలు వసూలు.
  • బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగి ఆరుగురు ఫేక్ పోలీసులను అరెస్ట్ చేసిన మీర్‌పేట్ పోలీసులు.
  • వారి వద్ద నుంచి కారు, 7 మొబైల్స్, రూ.80 వేల నగదు సీజ్.
  • ప్రధాన నిందితుడిపై గతంలో 11 క్రిమినల్ కేసులు.

Fake SOT police arrested | త్రినేత్ర.న్యూస్ : నగరంలో నేరగాళ్లు రూటు మార్చారు. సామాన్యులను ఈజీగా దోచుకోవడానికి ఏకంగా పోలీసు అవతారమే ఎత్తారు. తాము ఎస్.ఓ.టి (SOT) అధికారులమంటూ ఏకంగా ఓ బియ్యం లారీని అడ్డగించి, యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేసిన ఆరుగురు సభ్యుల నకిలీ ముఠాను మీర్‌పేట్ పోలీసులు మంగళవారం (మే 19) అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అసలేం జరిగిందంటే..

పోలీసుల కథనం ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్ అనే వ్యాపారికి చెందిన బియ్యం లారీ (KA56 7525) మే 18వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మహారాష్ట్ర వెళ్తోంది. పటాన్‌చెరు ఔటర్ రింగ్ రోడ్ (ORR) ఎగ్జిట్ నంబర్ 3 వద్దకు రాగానే, ఒక పోలో కార్‌లో (Polo Car) వచ్చిన నలుగురు అపరిచిత వ్యక్తులు లారీని అడ్డుకున్నారు.

ఫోన్‌పేలో ట్రాన్స్‌ఫర్..

లారీ డ్రైవర్‌ను భయపెట్టి, లారీలో ఉన్నవి అక్రమ బియ్యం అని, తాము SOT పోలీసులమని నమ్మించారు. డ్రైవర్ ద్వారా యజమాని అఫ్రోజ్‌కు ఫోన్ చేసి, కేసు నమోదు చేయకుండా ఉండాలంటే రూ. 6 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చివరకు బేరసారాల తర్వాత రూ. 1.6 లక్షలకు డీల్ (Deal) సెట్ చేసుకున్నారు. అడ్వాన్స్‌గా రూ.80 వేలను తమ PhonePe నంబర్లకు ట్రాన్స్‌ఫర్ చేయించుకున్నారు.

అడ్డంగా బుక్కయ్యారు ఇలా..

డబ్బులు పంపిన తర్వాత కూడా సదరు నకిలీ పోలీసులు మరింత డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. ఆరా తీయగా వారు అసలు పోలీసులే కారని తేలింది. గంట తర్వాత నిందితులు మళ్లీ డబ్బు కోసం మీర్‌పేట్‌లోని TKR కాలేజీ వద్దకు రమ్మని లొకేషన్ పంపారు. బాధితుడు అక్కడికి వెళ్లి వారిని గట్టిగా నిలదీయడంతో, అక్కడి నుంచి పరారయ్యారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే మీర్‌పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రంగంలోకి దిగిన పోలీసులు..

కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పక్కా ప్లాన్‌తో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులను (సందీప్ కుమార్, గిరీష్, శివారెడ్డి, రాకేష్ సింగ్, సాయి రామ్ రెడ్డి, పవన్ సాయి) అరెస్ట్ చేశారు. మరో నిందితుడు ఆనంద్ పరారీలో ఉన్నాడు. వారి నుంచి రూ. 80,000 నగదు, మొబైల్ ఫోన్లు 7, వోక్స్‌వ్యాగన్ పోలో కారు (AP09BZ8352) సీజ్ చేశారు.

ముఖ్యంగా ఈ ముఠాకు నాయకత్వం వహించిన ప్రధాన నిందితుడు ఏ-1 (ఎక్కా సందీప్ కుమార్) పై గతంలో అబ్దుల్లాపూర్‌మెట్, రామచంద్రాపురం, హయాత్‌నగర్ తదితర పోలీస్ స్టేషన్లలో ఏకంగా 11 చీటింగ్, అక్రమ రేషన్ బియ్యం కేసులు ఉండటం గమనార్హం. నిందితులందరిపై BNS చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ బి. శోభన్ వెల్లడించారు.

Advertisement
Advertisement