త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PRTS Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీలు.. ఆ 2 రూట్లు ఇవే!

హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేలా సర్కారు కొత్త ప్లాన్! డ్రైవర్ లేకుండా నడిచే పాడ్ ట్యాక్సీలను తొలిదశలో రెండు కీలక రూట్లలో తీసుకురానున్నారు.

J

Hyderabad | Published On Nov 25, 2026, 8.37 am IST

PRTS Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీలు.. ఆ 2 రూట్లు ఇవే!

సంక్షిప్త సారాంశం

హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు డ్రైవర్ లేకుండా నడిచే ఆటోమేటెడ్ 'పాడ్ ట్యాక్సీ' (PRTS) వ్యవస్థను తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వీటికి ప్రత్యేక వేళలంటూ ఉండవు. ప్రయాణికులు తమకు అవసరమైనప్పుడు బుక్ చేసుకుని ప్రయాణించే వీలుంటుంది. తొలిదశలో కూకట్‌పల్లి-బయోడైవర్సిటీ, బేగంపేట మెట్రో స్టేషన్-రాణిగంజ్ రూట్లలో వీటి ఏర్పాటుపై అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి నివేదిక ఇచ్చారు. మరోవైపు మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్ల పనుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, ఎన్నికలకు ఏడాది లోపే అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

Advertisement
  • వేళలతో పనిలేకుండా ఎప్పుడంటే అప్పుడు బుకింగ్
  • ఆ 2 రూట్లు ఇవే

PRTS Hyderabad | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త రవాణా వ్యవస్థపై దృష్టి సారించింది. డ్రైవర్ లేకుండా పూర్తిగా ఆటోమేటెడ్ పద్ధతిలో నడిచే 'పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్' (PRTS - పాడ్ ట్యాక్సీలు/కార్లు) అందుబాటులోకి తెచ్చేందుకు సర్కారు కసరత్తు చేస్తోంది. నగరంలో పీఆర్‌టీఎస్ ఫేజ్-1 అమలు సాధ్యాసాధ్యాలపై (టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ) అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమగ్ర నివేదికను వివరించారు.

వేళలతో పనిలేదు.. కావాల్సినప్పుడు బుకింగ్

సాధారణ బస్సులు, మెట్రో రైళ్ల మాదిరిగా ఈ పాడ్ ట్యాక్సీలకు నిర్దిష్ట వేళలంటూ ఉండవు. ప్రయాణికులు తమకు అవసరమైనప్పుడు వీటిని బుక్ చేసుకుని గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఎలాంటి ట్రాఫిక్ జామ్‌ల ఇబ్బంది లేకుండా అత్యంత వేగంగా ప్రయాణించేలా వీటిని రూపొందించనున్నారు.

తొలిదశలో ప్రతిపాదించిన 2 రూట్లు ఇవే

అధికారులు రూపొందించిన ఫేజ్-1 ప్రణాళికలో ప్రధానంగా రెండు కీలక మార్గాలను (అలైన్‌మెంట్స్) ప్రతిపాదించారు.

మొదటి రూట్: కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు.

రెండో రూట్: బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సచివాలయం, బషీర్‌బాగ్ మీదుగా రాణిగంజ్ వరకు.

డిపోలు, మల్టీ లెవెల్ పార్కింగ్‌పై సీఎం సూచనలు

ఈ రెండు మార్గాల సాధ్యాసాధ్యాలను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నెక్లెస్ రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో పీఆర్‌టీఎస్ డిపోల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. అలాగే, ప్రయాణికుల సౌకర్యార్థం డిపోల సమీపంలో, ఫుట్‌ఓవర్ బ్రిడ్జిల వద్ద మల్టీ లెవెల్ పార్కింగ్ సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. రూట్లు, డిపోలు, ఇతర మౌలిక సదుపాయాలపై సమగ్ర అధ్యయనం చేసి తుది కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.

మూసీ, రేడియల్ రోడ్ల పనుల తీరుపై సీఎం అసంతృప్తి

సమీక్ష సందర్భంగా నగరంలోని ఇతర అభివృద్ధి పనుల పురోగతిపైనా సీఎం ఆరా తీశారు. మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, ఇతర కీలక అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండటంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో వేగం పెంచి, వచ్చే ఎన్నికలకు ఏడాది లోపే వీటన్నింటినీ పూర్తి చేయాలని అధికారులకు డెడ్‌లైన్ విధించారు.

Advertisement
Advertisement