Gold Loan | గోల్డ్ లోన్ల గుబులు..!
- రెట్టింపయిన ఎన్‌పీఏలు
- రూ.3.74లక్షల కోట్లకు చేరిన గోల్డ్ లోన్లు
- పెరుగుతున్న మెండి బకాయిల భారం
- బంగారం ధరల పతనంతో రుణదాతల్లో ఆందోళన..
- రుణగ్రహీతలకూ తప్పని తిప్పలు
Gold Loan | ఒకప్పుడు అత్యంత సురక్షితమైన రుణంగా భావించిన బంగారు రుణాల మార్కెట్‌లో ఇప్పుడు రిస్క్ గంటలు మోగుతున్నాయి. ఓవైపు బంగారం ధరలు భారీగా పడిపోతుండగా.. మరోవైపు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేకపోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా గోల్డ్ లోన్లలో మొండి బకాయిలు (ఎన్‌పీఏలు) కేవలం ఐదు నెలల్లోనే దాదాపు రెట్టింపయ్యాయి. రుణాల బకాయిలు ఏకంగా రూ.3.74 లక్షల కోట్లకు చేరడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దీంతో ఇన్నాళ్లూ భద్రమైన రుణ మార్కెట్‌గా పేరొందిన గోల్డ్ లోన్ రంగంపై ఇప్పుడు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
రెట్టింపైన మొండి బకాయిలు
ట్రాన్స్‌యూనియన్ సిబిల్ గణాంకాల ప్రకారం.. 2026 మార్చి చివరి నాటికి గోల్డ్ లోన్లలో ఎన్‌పీఏల నిష్పత్తి 0.16 శాతంగా ఉండగా.. ఆగస్టు చివరి నాటికి దాదాపు రెట్టింపై 0.30 శాతానికి చేరింది. ఇక ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం.. బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణాల బకాయిలు 2026 సెప్టెంబర్ నాటికి ఏకంగా రూ.3.74 లక్షల కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయానికి ఈ మొత్తం రూ.2.25 లక్షల కోట్లుగా ఉండగా.. 2024 సెప్టెంబర్‌లో రూ.1.50 లక్షల కోట్లుగా నమోదైంది. అంటే ఏడాది వ్యవధిలోనే రుణాల విలువ 66 శాతం పెరిగింది. బంగారం ధరలు భారీగా తగ్గడం గోల్డ్ లోన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరగడానికి ప్రధాన కారణం. 2026 జనవరిలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.1.80 లక్షలకు చేరగా.. ప్రస్తుతం సుమారు రూ.1.25 లక్షల స్థాయికి పడిపోయింది. అంటే గరిష్ట ధరతో పోలిస్తే 30 శాతానికి పైగా తగ్గుదల నమోదైంది. దీంతో తనఖా పెట్టిన బంగారం విలువ తగ్గి.. తీసుకున్న రుణానికి, ఆ బంగారం విలువకు మధ్య నిష్పత్తి (ఎల్‌టీవీ) పెరుగుతోంది. ఫలితంగా రుణదాతలకు ఉన్న భద్రత తగ్గుతోంది.
మొండి బకాయిదారులకూ రుణాలు
గోల్డ్ లోన్ రంగంలో మరో ఆందోళనకర అంశం.. ఇప్పటికే రుణ చెల్లింపుల్లో విఫలమైన వారికి కూడా పెద్ద ఎత్తున కొత్త రుణాలు మంజూరు కావడం. పిరమల్ ఫైనాన్స్ ఎండీ, సీఈఓ జయరామ్ శ్రీధరన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా 90 రోజులకుపైగా బకాయిలు చెల్లించని ఖాతాదారులకు సుమారు రూ.4.7 లక్షల కోట్ల గోల్డ్ లోన్లు పంపిణీ అయ్యాయి. మొత్తం రుణ పంపిణీల్లో ఇలాంటి ఖాతాదారులకు వెళ్లిన వాటా 15 నుంచి 23 శాతం వరకు ఉన్నట్లు అంచనా. గతంలో గోల్డ్ లోన్లలో రుణం తీసుకున్నవారు గడువు ముగిసినప్పుడు వడ్డీతో సహా ఒకేసారి చెల్లించే విధానం (బుల్లెట్ రీపేమెంట్) ఎక్కువగా ఉండేది. కొత్త నిబంధనల నేపథ్యంలో నెలవారీ ఈఎంఐలు, క్రమం తప్పకుండా వడ్డీ చెల్లింపులు చేయాల్సి వస్తోంది. దీంతో కొందరు రుణగ్రహీతలు కొత్త చెల్లింపు విధానానికి అలవాటు పడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎన్‌బీఎఫ్‌సీలపైనా ప్రభావం
గోల్డ్ లోన్లలో పెరుగుతున్న రిస్క్ ప్రభావం ఆర్థిక సంస్థలపైనా కనిపిస్తోంది. బజాజ్ ఫైనాన్స్ సెప్టెంబర్ త్రైమాసిక గణాంకాల ప్రకారం.. స్టేజ్-2, స్టేజ్-3 ఆస్తుల్లో రూ.1,601 కోట్ల పెరుగుదల నమోదైంది. ఇందులో గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో వాటా రూ.1,047 కోట్లుగా ఉంది. ఇది ఈ రంగంలో పెరుగుతున్న రుణ నాణ్యత సమస్యలకు సంకేతంగా మారింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ).. ఎన్‌బీఎఫ్‌సీ అధిపతులతో నిర్వహించిన సమావేశంలో బంగారం ధరల పతనం, పెరుగుతున్న ఎల్‌టీవీ నిష్పత్తుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 2025-26లో 78 శాతంగా ఉన్న గోల్డ్ లోన్ పోర్ట్‌ఫోలియో వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 40 శాతానికి తగ్గొచ్చని రేటింగ్ సంస్థ క్రిసిల్ అంచనా వేసింది.
గోల్డ్ లోన్ తీసుకున్నవారు ఏం చేయాలి?
బంగారం తనఖా పెట్టి రుణం తీసుకున్నవారు తాజా పరిణామాల నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. బంగారం ధరలు తగ్గడంతో తనఖా బంగారం విలువ పడిపోవచ్చు. దీంతో ఎల్‌టీవీ నిష్పత్తి పెరిగితే బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలు అదనపు బంగారం తనఖా పెట్టాలని లేదా కొంత నగదు జమ చేయాలని కోరవచ్చు. అనుమతించిన పరిమితి 75 శాతానికి మించి ఎల్‌టీవీ నిష్పత్తి పెరిగి, అదనపు మొత్తాన్ని నిర్ణీత గడువులో చెల్లించకపోతే తనఖా బంగారాన్ని వేలం వేసే ప్రక్రియను రుణదాతలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. ప్రతి నెలా నిర్ణీత వాయిదాలను గడువులోగా చెల్లించాలి. చెల్లింపుల్లో జాప్యం జరిగితే రుణ ఖాతా మొండి బకాయిగా మారడంతో పాటు సిబిల్ స్కోర్‌పైనా ప్రతికూల ప్రభావం పడుతుంది. అయితే, బంగారం ధరలు తగ్గడం, రుణాల పంపిణీలో దూకుడు, తిరిగి చెల్లింపుల్లో ఇబ్బందులు గోల్డ్ లోన్ మార్కెట్‌కు సవాల్‌గా మారుతున్నాయి. ఇప్పటివరకు సురక్షిత రుణ విభాగంగా పేరొందిన ఈ మార్కెట్‌లో రిస్క్‌లు పెరుగుతుండటంతో రుణదాతలతో పాటు ఖాతాదారులూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Rahu Transit 2026 | నేటి మకర రాశిలోకి రాహువు సంచారం.. నాలుగు రాశులకు ఆర్థికంగా కలిసిరానున్న కాలం!
నవంబర్ 25, 2026

Dharmapuri | దీపాల వెలుగుల్లో కాంతులీనిన నారసింహక్షేత్రం.. ధర్మపురిలో వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..!
నవంబర్ 24, 2026

Supreme Court | కునో, ఉజ్జయినిలో సఫారీల ఏర్పాటుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నవంబర్ 24, 2026
తాజావార్తలు
- ●PRTS Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీలు.. ఆ 2 రూట్లు ఇవే!
- ●US Tariffs on India | భారత్, చైనాలపై ట్రంప్ కొత్త టారిఫ్ అస్త్రం.. ఈ వారం నుంచే అమలులోకి? ఈ రంగాలకు మాత్రం మినహాయింపు!
- ●Delhi Cafe Gang Rape | ఢిల్లీ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై కొలీగ్స్ సామూహిక అత్యాచారం
- ●Rahu Transit 2026 | నేటి మకర రాశిలోకి రాహువు సంచారం.. నాలుగు రాశులకు ఆర్థికంగా కలిసిరానున్న కాలం!
- ●Karthigai Deepam | తిరువణ్ణామలై కొండపై మహాదీపం.. ఆనంద తాండవం చేసిన అర్ధనారీశ్వరుడు..!
- ●Bisleri FSSAI clarification 2026 | ఒకే ఒక్క పాత బ్యాచ్‌పై ఆంక్షలు.. మార్కెట్‌లో ఆ స్టాక్ లేదు

PRTS Hyderabad | హైదరాబాద్‌లో డ్రైవర్ లేని పాడ్ ట్యాక్సీలు.. ఆ 2 రూట్లు ఇవే!

US Tariffs on India | భారత్, చైనాలపై ట్రంప్ కొత్త టారిఫ్ అస్త్రం.. ఈ వారం నుంచే అమలులోకి? ఈ రంగాలకు మాత్రం మినహాయింపు!

Delhi Cafe Gang Rape | ఢిల్లీ కేఫ్‌లో అర్ధరాత్రి పార్టీ ముసుగులో దారుణం.. యువతిపై కొలీగ్స్ సామూహిక అత్యాచారం

Rahu Transit 2026 | నేటి మకర రాశిలోకి రాహువు సంచారం.. నాలుగు రాశులకు ఆర్థికంగా కలిసిరానున్న కాలం!



