త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ

Hyderabad Police | నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ కవచ్’ ఆకస్మిక తనిఖీల్లో పలువురు పాత వాహనాల డీలర్లు నిబంధనలు పాటించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేశారు.

P

Hyderabad | Published On Jun 8, 2026, 9.22 pm IST

Hyderabad Police | పాత వాహనాల క్రయవిక్రయాలపై సిటీ పోలీసుల నజర్.. సీపీ సజ్జనర్ కీలక అడ్వైజరీ
Advertisement

Hyderabad Police | నగరంలో దొంగ వాహనాల చలామణికి అడ్డుకట్ట వేయడంతో పాటు సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుదారులను మోసాల నుంచి రక్షించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల నిర్వహించిన ‘ఆపరేషన్ కవచ్’ ఆకస్మిక తనిఖీల్లో పలువురు పాత వాహనాల డీలర్లు నిబంధనలు పాటించకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తించడంతో పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ సోమవారం కీలక అడ్వైజరీ జారీ చేశారు. మోటార్ వాహనాల చట్టం-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్స్ రూల్స్-1989, భారతీయ న్యాయ సంహిత-2023 నిబంధనలను ప్రస్తావిస్తూ.. పాత వాహనాన్ని కొనుగోలు చేసే ముందు విక్రేత గుర్తింపు, యాజమాన్య హక్కులు, వాహన్ పోర్టల్‌లో వాహన చరిత్ర, పెండింగ్ చలానాలు, పన్ను బకాయిలు, ఫైనాన్స్ క్లియరెన్స్ వంటి వివరాలను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల వాహనాల విక్రయాల్లో ఎన్‌వోసీ తప్పనిసరి అని స్పష్టం చేశారు.

వాహనాల ఒడోమీటర్ రీడింగ్‌లను మార్చడం, ఇంజిన్ లేదా ఛాసిస్ నంబర్లను ట్యాంపరింగ్ చేయడం చట్టరీత్యా నేరమని హెచ్చరించారు. అలాంటి వాహనాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు సంబంధిత డీలర్లపై బీఎన్‌ఎస్ కింద క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలిపారు. తక్కువ కిలోమీటర్లు తిరిగినట్లు చూపించి వినియోగదారులను మోసం చేసినా కఠిన చర్యలు తప్పవన్నారు. సెకండ్ హ్యాండ్ వాహనాల వ్యాపారం నిర్వహించే ప్రతి డీలర్ సంబంధిత ఆర్‌టీఓ నుంచి అనుమతి పొందాలని, ప్రతి లావాదేవీకి సంబంధించి కొనుగోలుదారులు, విక్రయదారుల వివరాలు, వాహన సమాచారం, ఒడోమీటర్ రీడింగ్‌లతో రికార్డులు నిర్వహించాలని ఆదేశించారు. టెస్ట్ డ్రైవ్‌లకు సంబంధించిన వివరాలను కూడా ఎలక్ట్రానిక్ ట్రిప్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని సూచించారు.

సోషల్ మీడియా లేదా ఇతర మాధ్యమాల్లో తప్పుడు ఫొటోలు, అవాస్తవ సమాచారంతో వాహనాల ప్రకటనలు ఇవ్వడం కూడా నేరమేనని సీపీ సజ్జనర్ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే డీలర్ల లైసెన్సులు రద్దు చేయడంతో పాటు దొంగతనం, దొంగ సొత్తు కలిగి ఉండటం, మోసం తదితర కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నగరంలో ఆకస్మిక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, అందరూ సహకరించాలని కోరారు.

Advertisement
Advertisement