త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Feroz Khan vs Osman Hajri | గాంధీభవన్‌లో రణరంగం: కుర్చీ కోసం కాలర్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కిందపడ్డ ఫిరోజ్ ఖాన్

హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. ప్రొటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీలు కాలర్లు పట్టుకుని కుమ్ములాడుకున్నారు.

J

Hyderabad | Published On May 27, 2026, 10.00 pm IST

Feroz Khan vs Osman Hajri | గాంధీభవన్‌లో రణరంగం: కుర్చీ కోసం కాలర్లు పట్టుకున్న కాంగ్రెస్ నేతలు.. కిందపడ్డ ఫిరోజ్ ఖాన్
Advertisement

Feroz Khan vs Osman Hajri | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) ప్రధాన కార్యాలయం గాంధీభవన్‌లో బుధవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంపై (Hyderabad Parliament) నిర్వహించిన సమీక్షా సమావేశం (Review meeting) కాస్తా రణరంగాన్ని తలపించింది. సొంత పార్టీ నేతలే కుర్చీల కోసం, ప్రొటోకాల్ (Protocol) కోసం ఒకరిపై ఒకరు దాడికి దిగి, కాలర్లు పట్టుకుని కుమ్ములాడుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అజారుద్దీన్ పక్కన సీటు కోసం రచ్చ

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని నేతలతో మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత మహ్మద్ అజారుద్దీన్ తదితరులు సమావేశం ఏర్పాటు చేశారు. అయితే, అజారుద్దీన్ పక్కన ఎవరు కూర్చోవాలనే 'ప్రొటోకాల్' ఇష్యూపై కాంగ్రెస్ నేతలు ఫిరోజ్ ఖాన్ (Feroz Khan), ఉస్మాన్ హజ్రీల (Osman Hajri) మధ్య వాగ్వాదం తలెత్తింది. మాటల యుద్ధం ముదరడంతో ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

కాలర్లు పట్టుకుని తోపులాట.. వీహెచ్ ఎంట్రీ

సమావేశ మందిరంలోనే ఇద్దరు నేతలు ఒకరి కాలర్ ఒకరు పట్టుకుని (Grabbing collars) భౌతిక దాడికి దిగారు. ఈ తీవ్రమైన తోపులాటలో బ్యాలెన్స్ తప్పిన ఫిరోజ్ ఖాన్ ఒక్కసారిగా కిందపడిపోయినట్లు సమాచారం. ఈ అనూహ్య పరిణామంతో అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు. గొడవను ఆపేందుకు సీనియర్ నేత వీ. హనుమంతరావు (VH) రంగంలోకి దిగారు. ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేయగా, ఆగ్రహంతో ఊగిపోతున్న నేతలు వీహెచ్‌ను సైతం తోసేయబోయారు. వెంటనే అప్రమత్తమైన ఇతర నాయకులు వారిని అడ్డుకుని పక్కకు లాగేశారు.

అర్థాంతరంగా రద్దైన మీటింగ్

రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar), అజారుద్దీన్‌ లాంటి కీలక నేతల ముందే ఈ గొడవ జరగడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎంత చెప్పినా నేతలు వినకపోవడం, పరిస్థితి అదుపుతప్పడంతో మంత్రులు, సీనియర్ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చేసేది లేక సమావేశాన్ని (Meeting) అర్థాంతరంగా ముగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు, వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement