Type 1 Diabetes | టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఇన్సులిన్‌ను ఆపి ట్యాబ్లెట్లను వాడొచ్చా.. డాక్టర్ సమాధానం..
Type 1 Diabetes | టైప్-1 డయాబెటిస్ తో జీవించడం అంటే ప్రతి రోజూ కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తరచూ పరీక్షించుకోవడం, ఆహారంలో కార్బొహైడ్రేట్లను లెక్కించడం, రోజూ అనేకసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వంటి ప్రక్రియలు రోగులను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసటకు గురిచేస్తాయి.
Type 1 Diabetes | టైప్-1 డయాబెటిస్ తో జీవించడం అంటే ప్రతి రోజూ కఠినమైన నియమాలను పాటించాల్సి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తరచూ పరీక్షించుకోవడం, ఆహారంలో కార్బొహైడ్రేట్లను లెక్కించడం, రోజూ అనేకసార్లు ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవడం వంటి ప్రక్రియలు రోగులను శారీరకంగా, మానసికంగా తీవ్రంగా అలసటకు గురిచేస్తాయి. ఈ పరిస్థితిని ఇంజెక్షన్ ఫటీగ్ అని పిలుస్తారు. దీంతో కొందరిలో ఇంజెక్షన్లకు బదులుగా ట్యాబ్లెట్లను తీసుకుంటే సరిపోతుందనే ఆలోచన కలుగుతుంది. అయితే ఇన్సులిన్ ఇంజెక్షన్లకు ప్రత్యామ్నాయంగా ట్యాబ్లెట్లను వాడటం, ముఖ్యంగా టైప్-1 డయాబెటిస్‌లో ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్ సరైన విధంగా పనిచేయడానికి ఇంజెక్షన్లే ప్రస్తుతం అత్యంత సమర్థవంతమైన మార్గమని వారు స్పష్టం చేస్తున్నారు.
ఇన్సులిన్‌ను ఆపేస్తే ఏం జరుగుతుంది..
ఫోర్టిస్ సి-డాక్ హాస్పిటల్ ఫర్ డయాబెటిస్ అండ్ అలైడ్ సైన్సెస్ ఛైర్మన్ డాక్టర్ అనూప్ మిశ్రా ఇదే విషయంపై స్పందించారు. ఇందుకు గాను ఆయన ఓ కేసును ఉదాహరణగా కూడా చెప్పారు. టీనేజ్‌లోనే టైప్-1 డయాబెటిస్ నిర్ధారణ అయిన 26 ఏళ్ల యువకుడు పదేళ్లకు పైగా ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ వచ్చాడు. అయితే దీర్ఘకాలం ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల తీవ్ర విసుగు, అలసటకు గురైన అతను ఒక ప్రమాదకర నిర్ణయం తీసుకున్నాడు. ఇన్సులిన్ ఇంజెక్షన్లను పూర్తిగా ఆపేసి, టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్న తన బంధువు వాడుతున్న ట్యాబ్లెట్లను రహస్యంగా తీసుకోవడం ప్రారంభించాడు. దురదృష్టవశాత్తూ ఇంజెక్షన్లను ఆపిన 24 గంటలు కూడా పూర్తికాకముందే అతను రాత్రికిరాత్రే మృతి చెందాడు. ఈ వివరాలను డాక్టర్ అనూప్ మిశ్రా తెలియజేస్తూ టైప్ 1 డయాబెటిస్ ఉన్నవారు ఎట్టి పరిస్థితిలోనూ ఇన్సులిన్ తీసుకోవడాన్ని ఆపేయకూడదని హెచ్చరించారు. తప్పనిసరిగా ఇన్సులిన్ ఇంజెక్షన్‌లను తీసుకోవాలని సూచించారు.

ప్రమాదకరంగా మారే డీకేఏ..
చాలామంది మధుమేహాన్ని నెమ్మదిగా శరీరాన్ని దెబ్బతీసే వ్యాధిగా భావిస్తారు. కళ్లకు, గుండెకు, మూత్రపిండాలకు నష్టం కలగడానికి సంవత్సరాలు పడుతుందని అనుకుంటారు. అయితే టైప్-1 డయాబెటిస్ లో ఇన్సులిన్‌ను అకస్మాత్తుగా ఆపేస్తే పరిస్థితి గంటల వ్యవధిలోనే ప్రాణాంతకంగా మారుతుందని డాక్టర్ అనూప్ మిశ్రా హెచ్చరించారు. టైప్-1 డయాబెటిస్ రోగులకు అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి డయాబెటిక్ కీటోఆసిడోసిస్ (డీకేఏ) అని తెలిపారు. తీవ్రమైన డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, రక్తంలో ఆమ్లత్వం పెరగడం వల్ల గందరగోళం, స్పృహలో మార్పులు, గుండె సంబంధిత తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. అనారోగ్యంగా ఉన్నా, ఆహారం తినలేని పరిస్థితి వచ్చినా వైద్యుల సలహా లేకుండా టైప్-1 డయాబెటిస్ రోగులు ఇన్సులిన్‌ను ఎప్పుడూ ఆపకూడదని సూచించారు.
అవయవాలపై తీవ్ర ప్రభావం..
మ్యాక్స్ హెల్త్‌కేర్ ఎండోక్రైనాలజీ విభాగాధిపతి డాక్టర్ అంబ్రిష్ మిథల్ మాట్లాడుతూ ఇన్సులిన్ లేకపోతే శరీరం రక్తంలో అధిక చక్కెర ఉన్నప్పటికీ ఆకలితో ఉన్నట్టుగా ప్రవర్తిస్తుందని చెప్పారు. ఈ పరిస్థితి మెదడు, గుండె, మూత్రపిండాలు సహా అనేక అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, అందుకే ఇన్సులిన్‌ను వెంటనే అందించడం అత్యంత కీలకమని వివరించారు. టైప్-2 డయాబెటిస్ కి వాడే ట్యాబ్లెట్లు టైప్-1 డయాబెటిస్ లో ఎందుకు పనిచేయవో కూడా నిపుణులు వివరించారు. టైప్-2 డయాబెటిస్ లో క్లోమగ్రంథి కొంతమేర ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే శరీర కణాలు దానికి సరైన స్పందన ఇవ్వవు. అప్పుడు ట్యాబ్లెట్లు కణాలను ఇన్సులిన్‌కు స్పందించేలా చేయడం లేదా క్లోమగ్రంథిని మరింత ఇన్సులిన్ ఉత్పత్తి చేయడానికి ప్రేరేపించడం ద్వారా పనిచేస్తాయి. కానీ టైప్-1 డయాబెటిస్ లో శరీర రోగనిరోధక వ్యవస్థ క్లోమగ్రంథిలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలను పూర్తిగా నాశనం చేస్తుంది. అందువల్ల ఇన్సులిన్ ఉత్పత్తే జరగదు. అలాంటి పరిస్థితిలో టైప్-2 ట్యాబ్లెట్లను తీసుకోవడం అంటే ఇంధనం లేని కారులో యాక్సిలేటర్ నొక్కినట్లే. ఎంత ప్రయత్నించినా ప్రయోజనం ఉండదని వైద్యులు చెబుతున్నారు.

ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ఇన్సులిన్ పూర్తిగా లేకపోతే డయాబెటిక్ కీటోఆసిడోసిస్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొద్ది గంటల నుంచి ఒకటి లేదా రెండు రోజుల వ్యవధిలోనే ఇది అత్యవసర వైద్య పరిస్థితిగా మారుతుంది. ఇన్ఫెక్షన్లు, శారీరక ఒత్తిడి వంటి అంశాలు ఉంటే పరిస్థితి మరింత వేగంగా క్షీణించే అవకాశం ఉంటుంది. డీకేఏ లక్షణాల్లో నోటి నుంచి పాడైన పండ్ల వాసన లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ లాంటి తీపి వాసన రావడం ప్రధాన సంకేతం. రక్తంలో అసిటోన్ పెరగడం వల్ల ఈ వాసన వస్తుంది. అలాగే కుస్మాల్ బ్రీతింగ్‌గా పిలిచే లోతైన, వేగవంతమైన, బరువైన శ్వాస కనిపిస్తుంది. ఇది శరీరంలో పెరిగిన ఆమ్లత్వాన్ని తగ్గించేందుకు ఊపిరితిత్తులు చేసే ప్రయత్నం. అలాగే తీవ్ర దాహం, వాంతులు, తీవ్రమైన బలహీనత, చివరికి స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంటనే ఐసీయూలో చికిత్స అవసరం అవుతుంది.

ట్యాబ్లెట్ల కోసం పరిశోధనలు..
ఇన్సులిన్‌కు బదులుగా ట్యాబ్లెట్ రూపంలో ఔషధాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటి వరకు అది సాధ్యం కాలేదు. కారణం ఇన్సులిన్ ఒక సంక్లిష్టమైన ప్రోటీన్ హార్మోన్ కావడమే. జీర్ణాశయంలో ఉండే హైడ్రోక్లోరిక్ యాసిడ్, పెప్సిన్ వంటి జీర్ణ ఎంజైమ్‌లు ఇన్సులిన్‌ను శరీరంలోకి శోషించుకోకముందే పూర్తిగా విచ్ఛిన్నం చేస్తాయి. ప్రస్తుతం శాస్త్రవేత్తలు నానో టెక్నాలజీ, సూక్ష్మ మైక్రోనీడిల్ క్యాప్సూల్స్, లిపిడ్ కోటింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో నోటి ద్వారా ఇన్సులిన్ అందించే మార్గాలపై పరిశోధనలు చేస్తున్నారు. అయితే ఇవి సాధారణ రోగులకు అందుబాటులోకి రావడానికి ఇంకా చాలా సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం టైప్-1 డయాబెటిస్ రోగులకు ఇంజెక్షన్లు లేదా ఇన్సులిన్ పంప్ ద్వారా ఇన్సులిన్ అందించడం మాత్రమే ప్రాణాలను కాపాడే మార్గంగా కొనసాగుతోంది. భోజన సమయంలో ఉపయోగించే వేగంగా పనిచేసే ఇన్హేల్డ్ ఇన్సులిన్ వంటి ప్రత్యామ్నాయాలపై కూడా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ, సాధారణ ట్యాబ్లెట్లు మాత్రం ప్రస్తుతం ప్రత్యామ్నాయం కావని చెబుతున్నారు.
ఇన్సులిన్ ప్రాణాధారం..
ఇంజెక్షన్ల వల్ల తీవ్రమైన అలసట లేదా మానసిక ఒత్తిడి ఎదురవుతున్నట్లయితే, స్వయంగా మందులు మార్చుకోవడం లేదా ఇతరుల ప్రిస్క్రిప్షన్‌ను ఉపయోగించడం ప్రమాదకరం. అలాంటి పరిస్థితుల్లో ఎండోక్రైనాలజిస్టును సంప్రదించి కంటిన్యూయస్ గ్లూకోజ్ మానిటర్లు (సీజీఎంలు), స్మార్ట్ ఇన్సులిన్ పంప్‌లు వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇన్సులిన్ అంటే జీవనశైలిలో భాగం మాత్రమే కాదు, టైప్-1 డయాబెటిస్ రోగులకు అది ప్రాణాధారం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్
- ●Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు
- ●Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు
- ●KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..
- ●Supreme Court | రామ మందిర విరాళాల కేసు.. రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని సిట్‌కు సుప్రీంకోర్టు ఆదేశం..
- ●Amazon | అమెజాన్ గ్రేట్ ఫ్రీడం సేల్ వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

Anti Paper Leak Bill | యాంటీ పేపర్ లీక్ బిల్లుపై రేపు లోక్‌సభలో చర్చ.. అనంతరం ఓటింగ్

Delhi Riots | తాహీర్‌కు ఉరేసరి.. ఐబీ అధికారి అంకిత్ శర్మ కేసులో కోర్టును కోరిన పోలీసులు

Pooja Hegde | ఐటెంసాంగ్‌లో బుట్టబొమ్మ - నాచురల్ స్టార్‌తో మాస్ స్టెప్పులు

KCR | మీరేం జేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి..






