త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Covid 19 | కోవిడ్ అసలు మృతులు 2.2 కోట్లా? అధికారిక గ‌ణాంకాల క‌న్నా 3 రెట్లు ఎక్కువ‌..

Covid 19 | ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి వల్ల 2020 నుంచి 2023 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.21 కోట్ల అదనపు మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అధికారికంగా నమోదైన 70 లక్షల కరోనా మరణాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

S

Health | Published On May 14, 2026, 4.50 pm IST

Covid 19 | కోవిడ్ అసలు మృతులు 2.2 కోట్లా? అధికారిక గ‌ణాంకాల క‌న్నా 3 రెట్లు ఎక్కువ‌..
Advertisement

Covid 19 | ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి వల్ల 2020 నుంచి 2023 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.21 కోట్ల అదనపు మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. అధికారికంగా నమోదైన 70 లక్షల కరోనా మరణాల కంటే ఇది మూడు రెట్లు ఎక్కువ కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ గణాంకాలను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన వరల్డ్ హెల్త్ స్టాటిస్టిక్స్ 2026 నివేదికలో ప్రచురించారు. ప్రపంచ ఆరోగ్య పురోగతిపై ప్రతి సంవత్సరం ఈ సంస్థ సమీక్ష నిర్వహిస్తుంది. డబ్ల్యూహెచ్ఓ డిజిటల్ హెల్త్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్ అలైన్ లాబ్రిక్ మాట్లాడుతూ ఈ కాలంలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.2 కోట్ల అదనపు మరణాలు సంభవించాయని త‌మ‌ అంచనా అని తెలిపారు. మరోవైపు హెల్త్ సిస్టమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ యుకికో నకటాని ఈ నివేదికను తీవ్ర హెచ్చరికగా అభివర్ణించారు. ఎక్సెస్ డెత్స్ అంటే సాధారణ పరిస్థితుల్లో ఉండే మరణాల సంఖ్యతో పోలిస్తే అదనంగా నమోదైన మరణాలు. ఇందులో నేరుగా కోవిడ్ వల్ల చనిపోయినవారే కాకుండా, ఆస్పత్రులు ఒత్తిడికి గురవడంతో ఇతర వ్యాధులకు చికిత్స అందక మరణించినవారు, భయంతో ఆస్పత్రులకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయి ప్రాణాలు కోల్పోయినవారూ ఉంటారు.

ఆ ఏడాదిలోనే 1.04 కోట్ల మ‌ర‌ణాలు..

2021 సంవత్సరం కరోనా మహమ్మారి కార‌ణంగా అత్యంత భయంకరమైన ఏడాదిగా నిలిచింది. ఆ ఏడాదిలోనే 1.04 కోట్ల అదనపు మరణాలు నమోదయ్యాయి. కొత్తగా వచ్చిన ప్రమాదకర వైరస్ వేరియంట్లు, తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయిన ఆరోగ్య వ్యవస్థలు ఇందుకు ప్రధాన కారణాలుగా నివేదిక పేర్కొంది. 2023 నాటికి ఈ సంఖ్య 33 లక్షలకు తగ్గినప్పటికీ, ప్రభావం పూర్తిగా తగ్గలేదని తెలిపింది. పురుషుల్లో మరణాల రేటు మహిళల కంటే నిరంతరం ఎక్కువగా నమోదైంది. ముఖ్యంగా 2021 గరిష్ట‌ దశలో మహిళలతో పోలిస్తే పురుషుల్లో వయస్సు ప్రామాణిక మరణాల రేటు సుమారు 50 శాతం అధికంగా ఉందని వెల్లడించింది. వృద్ధులపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందని డేటా స్పష్టం చేసింది. 85 ఏళ్లు దాటిన వారిలో అదనపు మరణాలు యువతతో పోలిస్తే దాదాపు 10 రెట్లు ఎక్కువగా నమోదయ్యాయి. వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం భారీగా పెరిగిందని నివేదిక పేర్కొంది.

ఆరోగ్య రంగం వెన‌క్కి..

డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి ప్రపంచ ఆరోగ్యరంగాన్ని దశాబ్దం వెనక్కి నెట్టింది. 2021 నాటికి ప్రపంచ జీవన ప్రమాణాలు, ఆరోగ్యకర జీవనకాలంలో దాదాపు పది సంవత్సరాల పురోగతి తుడిచిపెట్టుకుపోయిందని తెలిపింది. 2022 తర్వాత కొంత పునరుద్ధరణ కనిపించినప్పటికీ, ప్రాంతాలు, వయస్సు, లింగం ఆధారంగా అసమానతలు కొనసాగుతున్నాయని హెచ్చరించింది. ఆరోగ్య సంబంధిత సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ సాధనలో ప్రపంచం ఇంకా వెనుకబడి ఉందని నివేదిక స్పష్టం చేసింది. యూనివర్సల్ హెల్త్ కవరేజ్, తల్లి-శిశు ఆరోగ్యం, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల వచ్చే అకాల మరణాల తగ్గింపులో పురోగతి నిలిచిపోయిందని పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ప్రధాన కారణాలు కూడా ఇవేనని తెలిపింది. అయితే కొన్ని అంటువ్యాధుల విషయంలో ప్రపంచం పురోగతి సాధించిందని డేటా సూచిస్తోంది. 2010 నుంచి 2024 మధ్య హెచ్ఐవీ కొత్త ఇన్ఫెక్షన్లు 40 శాతం తగ్గాయి. 2015 నుంచి ట్యూబర్‌కులోసిస్ కేసుల రేటు 12 శాతం పడిపోయింది. నిర్లక్ష్యానికి గురైన ట్రాపికల్ వ్యాధుల చికిత్స అవసరమయ్యే వారి సంఖ్య 36 శాతం తగ్గింది.

కానీ మలేరియా మాత్రం విరుద్ధ దిశలో సాగింది. 2015తో పోలిస్తే ప్రపంచ మలేరియా కేసులు 8.5 శాతం పెరిగాయని నివేదిక వెల్లడించింది. అలాగే నివారించగలిగే ఆరోగ్య ప్రమాదకర పరిస్థితులు ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతున్నాయని తెలిపింది. ప్రసవ వయస్సులో ఉన్న మహిళల్లో రక్తహీనత 2023 నాటికి 30.7 శాతానికి చేరింది. ఐదేళ్ల లోపు పిల్లల్లో అధిక బరువు సమస్య 2024 నాటికి 5.5 శాతానికి పెరిగింది.

Advertisement

తాజావార్తలు

Advertisement