త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయ‌న‌న్న రాఘ‌వ లారెన్స్‌.. త్రిష‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?

Raghava Lawrence | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేయ‌డం లేద‌ని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో టీవీకే తరఫున బరిలోకి దిగ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం ఎక్స్ ద్వారా వీడియోను విడుద‌ల చేసి వివ‌ర‌ణ ఇచ్చారు.

P

Entertainment | Published On Jun 30, 2026, 5.01 pm IST

Raghava Lawrence | తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయ‌న‌న్న రాఘ‌వ లారెన్స్‌.. త్రిష‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్టేనా?
Advertisement

Raghava Lawrence | ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు, దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం పోటీ చేయ‌డం లేద‌ని స్పష్టం చేశారు. ఉప ఎన్నిక‌ల్లో టీవీకే తరఫున బరిలోకి దిగ‌నున్నార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మంగ‌ళ‌వారం ఎక్స్ ద్వారా వీడియోను విడుద‌ల చేసి వివ‌ర‌ణ ఇచ్చారు. తాను షూటింగ్ ప్రాంతాల్లో పలువురు "తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యేకు స్వాగతం" అంటూ పలకరిస్తున్నారని, ప్రజలు చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లుగా లారెన్స్ పేర్కొన్నారు. రాజకీయాల్లో ధర్మం ముఖ్యమని, అందుకే తన మనసులోని మాటను బహిరంగంగా చెప్పాలని భావించిన‌ట్లు తెలిపారు. తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో విజయ్ హీరోగా ఉన్న రోజుల నుంచే పోస్టర్లు వేసి, పార్టీ ఆవిర్భావం తర్వాత క్షేత్రస్థాయిలో కష్టపడుతున్న అనేక మంది కార్యకర్తలు ఉన్నారని లారెన్స్ చెప్పారు. అలాంటి నియోజకవర్గంలో ఎవరు పోటీ చేయాలనే నిర్ణయం పూర్తిగా విజయ్ తీసుకోవాల్సిందేనన్నారు. విజయ్ ఎవరిని ఎంపిక చేసినా ప్రజలు ఆయన ముఖం చూసే ఓటు వేస్తారని, అలాంటి చోట తాను వెళ్లి పోటీ చేయడం సరికాదని అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

ఈ సంద‌ర్భంగా ఓ ఉదాహరణ ఇచ్చే ప్ర‌యత్నం చేశారు. ఒక వ్యక్తి విత్తనం నాటి, మొక్కగా పెంచి, కాపాడి, చివరకు ఫలాలు వచ్చే చెట్టుగా తీర్చిదిద్దితే, చివర్లో ఇంకొకరు వచ్చి ఆ ఫలాలను తీసుకెళ్లడం న్యాయం కాదన్నారు. విత్తనం నాటిన వ్యక్తికే ఆ ఫలాలపై హక్కు ఉంటుందని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా సాధారణ కార్యకర్తగా పార్టీలో చేరి కనీసం మూడు నుంచి నాలుగేళ్లు సేవ చేయాలని తన అభిప్రాయమన్నారు. ప్రతిఫలం ఆశించకుండా బాధ్యతగా పని చేయాలని, పార్టీ నాయకత్వం తన పనిని గుర్తించి బాధ్యత అప్పగించిన తర్వాతే ప్రజల కోసం ఆ పదవిని వినియోగించాల‌న్నారు. ప్రజా సేవ కోసం ముఖ్యమంత్రి విజయ్ సహకారం కోరుతానని లారెన్స్ ప్ర‌క‌టించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధిని చిన్నారుల శస్త్రచికిత్సల కోసం సంప్రదించగా సహాయం అందించార‌ని గుర్తుచేశారు. ఇటీవల తన ఫౌండేషన్‌కు చెందిన దివ్యాంగ చిన్నారుల ప్రతిభను చూపించే వీడియోను ఉదయనిధి స్టాలిన్‌కు పంపగా.. అది మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దృష్టి తీసుకెళ్లి ప్ర‌ద‌ర్శించేలా అవ‌కాశం క‌ల్పించార‌న్నారు. అన్బుమ‌ణి రామ‌దాస్ కూడా అనేక సందర్భాల్లో సహాయం చేశారని తెలిపారు.

విజయ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ నటుడిగా ఉన్నప్పుడే తన సొంత డబ్బుతో ఓ చిన్నారి ప్రాణాన్ని కాపాడిన వ్యక్తి విజయ్ అని, ఇప్పుడు సీఎంగా మరెంతో మందికి అండగా నిలిచే అవకాశం ఉందన్నారు. అవసరమైతే వెయ్యి మంది చిన్నారులకు సహాయం చేయగలరని, అలా చేస్తే తాను గర్వంగా బహిరంగంగా చెబుతాన‌న్నారు. అయితే, తాను తిరుచ్చి ఈస్ట్ నుంచి మాత్రమే పోటీ చేయనని చెప్పానే గానీ, భవిష్యత్తులో ఎక్కడా పోటీ చేయనని చెప్పలేదని లారెన్స్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి ధర్మాన్ని పాటిస్తూ, దశలవారీగా అడుగులు వేస్తానని వెల్లడించారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించిన లారెన్స్‌.. భ‌విష్య‌త్‌లో రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా.. గ‌తంలో తిరుచ్చి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత రాఘ‌వ లారెన్స్ తెర‌పైకి వ‌చ్చింది. తాజాగా ఆ స్థానం నుంచి పోటీ చేయ‌న‌ని ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో త్రిష‌కు లైన్ క్లియ‌ర్ అయిన‌ట్లుగా భావిస్తున్నారు.

Advertisement
Advertisement