Mohan Lal | మలయాళ నటుడు మోహన్ లాల్ ఇంట విషాదం నెలకొంది. మోహన్‌లాల్ మాతృమూర్తి శాంతకుమారి (90) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న శాంతకుమారి మంగళవారం ఉదయం కొచ్చిలోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఓ మలయాళ సినిమా షూటింగ్‌లో ఉండగానే తల్లి మరణ వార్త గురించి మోహన్‌లాల్‌కు తెలిసిందట. దాంతో షూటింగ్‌ను నిలిపివేసి హుటాహుటిగా ఇంటికి చేరుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. శాంతకుమారి భర్త విశ్వనాథన్ నాయర్ కేరళ గవర్నమెంట్ లా సెక్రటరీగా చాలా కాలం పాటు పనిచేశారు. భర్తతో కలిసి తిరువనంతపురంలో సెటిలయ్యారు శాంతకుమారి. భర్త మరణం, అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా మోహన్‌లాల్‌తో కలిసి కొచ్చిలో ఉంటున్నారు. ఈ ఏడాది ఆగస్ట్‌లో 90వ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు శాంతకుమారి. తాను నటుడిగా మారడంలో తల్లి ప్రోత్సాహం ఎంతో ఉందని పలు సందర్భాల్లో మోహన్‌లాల్ వెల్లడించారు. ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు మోహన్‌లాల్. ఈ అవార్డు వచ్చిన సంగతి మొదట తాను తల్లితోనే పంచుకున్నట్లు చెప్పారు. శాంతికుమారి మరణంతో మోహన్‌లాల్ కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ముమ్ముట్టితో పాటు పలువురు మలయాళ సినీ ప్రముఖులు మోహన్‌లాల్ ఇంటికి చేరుకున్నారు. శాంతకుమారి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. మంగళవారం సాయంత్రం కొచ్చిలోనే శాంతకుమారి అంత్యక్రియలు జరుగనున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.