త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT Review | ఇల్లీగ‌ల్ ఎఫైర్స్‌పై వ‌చ్చిన మ‌ల‌యాళం మూవీ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే?

లేటెస్ట్ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఉయిర్ జియో హాట్‌స్టార్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. రోష‌న్ మాథ్యూ హీరోగా న‌టించిన ఈ మూవీ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?

N

Entertainment | Published On Aug 8, 2026, 1.54 pm IST

OTT Review |  ఇల్లీగ‌ల్ ఎఫైర్స్‌పై వ‌చ్చిన మ‌ల‌యాళం మూవీ – ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌ల‌తో సాగే థ్రిల్ల‌ర్ సినిమా ఎలా ఉందంటే?
Advertisement

OTT Review |  రోష‌న్ మాథ్యూ హీరోగా న‌టించిన లేటెస్ట్ మ‌ల‌యాళం క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఉయిర్ జియో హాట్‌స్టార్ ఓటీటీలో రిలీజైంది. ప‌ద్మ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిచిన ఈ సినిమాలో శృతి మీన‌న్‌, బైజు సంతోష్ కీల‌క పాత్ర‌లు పోషించారు. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ఈ క్రైమ్ థ్రిల్ల‌ర్ మూవీ ఎలా ఉందంటే?

అజీబ్ ఇన్వేస్టిగేష‌న్‌....

అజీబ్ (రోష‌న్ మాథ్యూ) ప్రొబెష‌న‌రీ ఎస్ఐగా కేర‌ళ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ప‌నిచేస్తుంటాడు. చిన్న‌ప్పుడే ఓ రైలు ప్ర‌యాణంలో త‌ప్పిపోయిన త‌న చెల్లెలి జ్ఞాప‌కాలు అత‌డిని ఎప్పుడూ వెంటాడుతుంటాయి. అజీబ్ ప‌నిచేస్తోన్న పోలీస్ స్టేష‌న్ లిమిట్స్‌లోనే గుర్తుతెలియ‌ని మ‌హిళ డెడ్‌బాడీ దొరుకుతుంది. అజీబ్, ఏఎస్ఐ జాయ్ ఇన్వేస్టిగేష‌న్‌లో ఓ మ‌హిళ పేరు శోభ (శృతి మీన‌న్‌) అని తెలుస్తుంది. ఆమె భ‌ర్త రాజు (వినోద్ సాగ‌ర్‌) అడ్రెస్ క‌నిపెడ‌తారు. త‌న‌ను మోసం చేసి శోభ మ‌రో వ్య‌క్తి స‌హ‌జీవ‌నం చేస్తుంద‌ని రాజు పోలీసుల‌కు చెబుతాడు. పిల్ల‌ల‌తో క‌లిసి చాలా రోజులుగా శోభ‌కు దూరంగా బ‌తుకుతున్నాన‌ని క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. రాజు చెప్పింది నిజ‌మేన‌ని న‌మ్మిన అజీబ్, జాయ్‌....శోభ కేసును ఆత్మ‌హ‌త్య‌గా తేల్చేసి... డెడ్‌బాడీని భ‌ర్త‌కు అప్ప‌గించి అంత్య‌క్రియ‌ల‌కు డ‌బ్బు సాయం కూడా చేస్తారు. శోభ ఆత్మ‌హ‌త్య వార్త‌ను పేప‌ర్ల‌లో చూసిన ఆమె బంధువులు స్టేష‌న్‌కు వ‌స్తారు. వారి వ‌ల్ల శోభ డెడ్‌బాడీని తీసుకెళ్లింది ఆమె భ‌ర్త రాజు కాద‌ని తెలుస్తుంది. దాంతో అజీబ్‌తో జాయ్ ఉద్యోగాలు ఇబ్బందుల్లో ప‌డ‌తాయి. రాజు పేరుతో అజీబ్‌, జాయ్‌ల‌ను మోసం చేసింది ఎవ‌రు? శోభ ఎలా చ‌నిపోయింది? ఆమె భ‌ర్త రాజు ఏమ‌య్యాడు? హ్యూమ‌న్ ట్రాఫికింగ్ ముఠా బారిన ప‌డిన శోభ పిల్ల‌ల‌ను అజీబ్ ఎలా కాపాడాడు? శోభ‌ను చంపిన కిల్ల‌ర్‌ను ఎలా ప‌ట్టుకున్నాడు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా...

క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ సినిమాలు తీయ‌డంలో మ‌ల‌యాళ ద‌ర్శ‌కులు సిద్ధ‌హ‌స్తులు. చిన్న చిన్న క‌థాంశాల‌తో ఆద్యంతం థ్రిల్లింగ్‌గా ఈ సినిమాల‌ను రూపొందిస్తుంటారు. రియ‌ల్‌గానే పోలీసుల ఇన్వేస్టిగేష‌న్ల‌ను క‌ళ్ల‌ముందు ఆవిష్క‌రిస్తుంటారు. ఉయిర్ కూడా ఆ కోవ‌కు చెందిన సినిమానే.

కేర‌ళ‌లో జ‌రిగిన య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు ప‌ద్మ‌కుమార్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. వివాహేత‌ర సంబంధాల వ‌ల్ల త‌లెత్తే అన‌ర్థాల‌ను ఆలోచ‌నాత్మ‌కంగా చూపించారు. త‌ల్లిదండ్రులు చేసిన త‌ప్పుల కార‌ణంగా చిన్నారుల భ‌విష్య‌త్తు ఎలా అంధ‌కారంగా మారుతుంద‌నే మెసేజ్‌ను ఇచ్చారు. పోలీసులు అంటే క‌ఠిన హృద‌యం ఉన్న‌వాళ్లు కాద‌ని, వారిలో మాన‌వ‌తా దృక్ప‌థం ఉంటుంద‌ని చెప్పారు.

ట్విస్ట్‌లు...

అజీబ్‌, జాయ్ పాత్ర‌ల ప‌రిచ‌యం, వారి కుటుంబాల నేప‌థ్యాల‌ను చూపించ‌డానికే ద‌ర్శ‌కుడు అర‌గంట వ‌ర‌కు టైమ్ తీసుకున్నారు. శోభ డెడ్‌బాడీని క‌నిపెట్ట‌డం, రాజును పోలీస్ స్టేష‌న్ తీసుకొచ్చి అంత్య‌క్రియ‌లు చేయించ‌డం వ‌ర‌కు సినిమా ఫ్లాట్‌గా సాగిపోతుంది. స్టేష‌న్‌కు వ‌చ్చింది శోభ‌ భ‌ర్త రాజు కాద‌ని తెలిసే ట్విస్ట్ అదిరిపోయింది. ఒక‌టే హ‌త్య అని అనుకునే లోపు...దానికి కొన‌సాగింపుగా మ‌రో మ‌ర్డ‌ర్ కూడా బ‌య‌ట‌ప‌డ‌టం...ఆ రెండింటికి లింక్ ఉన్న‌ట్లుగా హీరో క‌నిపెట్ట‌డం ఆస‌క్తిని పంచుతుంది. మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ సినిమాల్లో స‌స్పెన్స్‌ను చివ‌రి వ‌ర‌కు హోల్డ్ చేయ‌డం కీల‌కం. ఇందులో అదే మిస్స‌య్యింది. ఒక‌టి రెండు ట్విస్ట్‌లు మిన‌హా మిగిలిన‌వి తేలిపోయాయి.

కిక్ మిస్స‌య్యింది...

ద‌ర్శ‌కుడు ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నా...థ్రిల్లింగ్‌గా చెప్ప‌లేక‌పోయారు. సీరియ‌ల్‌లా సాగ‌దీశారు. హంత‌కుడు ఎవ‌ర‌న్న‌ది హీరో క‌నిపెట్ట‌డంలో కిక్ మిస్స‌య్యింది. ఈజీగా క‌నిపెట్ట‌డం క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు. చిన్నారుల ఆచూకీ క‌నిపెట్ట‌డం కోసం హీరో సాగించే జ‌ర్నీని కూడా సాగ‌దీశారు.

సూట‌వ్వ‌లేదు...

రోష‌న్ మాథ్యూ మ‌ల‌యాళంలో ఎక్కువ‌గా ల‌వ‌ర్ బాయ్‌, సాఫ్ట్ రోల్స్ చేశాడు. పోలీస్ క్యారెక్ట‌ర్ అత‌డికి అంత‌గా సూట‌వ్వ‌లేదు. విల‌న్‌గా వినోద్ సాగ‌ర్ , శోభ‌గా శృతి మీన‌న్ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. మిగిలిన పోలీసుల పాత్ర‌ధారుల న‌ట‌న కూడా యావ‌రేజ్‌గానే అనిపిస్తుంది. తెలుగు డ‌బ్బింగ్ బాగుంది.

 

Advertisement
Advertisement