త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay-Kangana | ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కంగనా.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?

Vijay-Kangana | బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌, టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప‌ర్స‌నాలిటీ రైట్స్ అంశంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇద్ద‌రి పిటిష‌న్ల‌ను గురువారం హైకోర్టు విచారించింది. ఇద్ద‌రు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ వికాస్‌ మహాజన్‌.. సోషల్‌ మీడియా వేదికలు, అభ్యంతరకర కంటెంట్‌ ప్రచురిస్తున్న ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

P

Entertainment | Published On Oct 8, 2026, 9.45 pm IST

Vijay-Kangana | ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, కంగనా.. అస‌లు ఏం జ‌రిగిందంటే..?
Advertisement

Vijay-Kangana | బీజేపీ ఎంపీ, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌, టాలీవుడ్‌ హీరో విజయ్‌ దేవరకొండ ప‌ర్స‌నాలిటీ రైట్స్ అంశంలో ఢిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఇద్ద‌రి పిటిష‌న్ల‌ను గురువారం హైకోర్టు విచారించింది. ఇద్ద‌రు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ వికాస్‌ మహాజన్‌.. సోషల్‌ మీడియా వేదికలు, అభ్యంతరకర కంటెంట్‌ ప్రచురిస్తున్న ఇతర సంస్థలకు నోటీసులు జారీ చేశారు.

విజయ్‌ పిటిషన్‌లో ఏముంది?

తన పేరుతో నకిలీ వెబ్‌సైట్లు, తప్పుడు ప్రకటనలు, ఫేక్ కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారని విజయ్‌ దేవరకొండ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్న ఇలాంటి కంటెంట్‌ను తొలగించాలని కోరారు. అశ్లీల, పరువు నష్టం కలిగించే, దూషించేలా ఉన్న కంటెంట్‌తో పాటు ఏఐ, డీప్‌ఫేక్‌, డిజిటల్‌ మార్పులతో రూపొందించిన తనకు సంబంధించిన కంటెంట్‌పైనా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా కొన్ని మొబైల్‌ యాప్‌లు గూగుల్‌ ప్లే స్టోర్‌లో ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా టీషర్టులు, మగ్గులు, ఇతర వస్తువుల విక్రయాల్లో తన పేరు, ఇమేజ్‌ను అనుమతి లేకుండా వాణిజ్యపరంగా వినియోగిస్తున్నారని తెలిపారు. ఇలాంటి కంటెంట్‌, ఉత్పత్తులను మెటా ప్లాట్‌ఫామ్స్‌, ఎక్స్‌ కార్ప్‌, గూగుల్‌, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌, మీషో, రెడ్‌బబుల్‌ తదితర వేదికల నుంచి తొలగించాలని కోరారు.

స్వాతి కుమార్ వాద‌న‌లు..

విజయ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది స్వాతి సుకుమార్‌.. న్యాయవాదులు రాహుల్‌ కుక్రేజా, సాహిల్‌ రావీన్‌తో కలిసి వాదనలు వినిపించారు. తన వ్యక్తిత్వ హక్కులకు భంగం కలిగించేలా ఉన్న పలు ఆన్‌లైన్‌ పోస్టులను ఆమె కోర్టుకు చూపించారు. పిటిషన్‌పై సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. అభ్యంతరకర కంటెంట్‌ను ప్రచారం చేస్తున్న ప్రతివాదుల నుంచి స్పందన కోరింది. మధ్యంతర నిషేధ ఉత్తర్వులు జారీ చేయాలన్న విజయ్‌ అభ్యర్థనపై కూడా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ అంశంపై తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని న్యాయమూర్తి తెలిపారు. త‌ర్వాతి విచారణను 2027 ఫిబ్రవరి 2కి వాయిదా వేశారు.

కంగనా కేసులోనూ నోటీసులు

మరోవైపు కంగనా రనౌత్‌ తరఫు న్యాయవాది సాకేత్‌ సిక్రీ.. నటిపై తప్పుడు వార్తలు, అశ్లీల ఏఐ కంటెంట్‌ను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, కొన్ని కంటెంట్‌లు కేవలం వ్యంగ్య రూపంలో ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది. ప్రస్తుతం తొలగించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని సిక్రీ స్పష్టం చేశారు. తన పిటిషన్‌ కాపీ అందుకున్న తర్వాత కొందరు ప్రతివాదులు ఇప్పటికే అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించినట్లు తెలిపారు. దీంతో అలాంటి వారిని పిటిషన్‌లోని ప్రతివాదుల జాబితా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది. కంగనా పిటిషన్‌పై కూడా సమన్లు జారీ చేసిన న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వుల అభ్యర్థనపై ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. విచారణను 2027 ఫిబ్రవరి 3కి వాయిదా వేసింది.

Advertisement
Advertisement