త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Daksha Nagarkar | ద‌క్షా ట్రాక్‌లోనే ప‌డేనా..? ఆశ‌ల‌న్నీ రాసా గుమ్మ‌డి సాంగ్‌పైనే..!

Daksha Nagarkar | హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని టాలీవుడ్‌లో అడుగుపెట్టిన దక్షా నగార్కర్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం కలిసిరాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం దక్కలేదు. దీంతో ఇప్పుడు కెరీర్‌కు గాడిలో పెట్టుకునే లక్ష్యంతో స్పెషల్‌ సాంగ్స్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

P

Entertainment | Published On Jul 22, 2026, 6.10 pm IST

Daksha Nagarkar | ద‌క్షా ట్రాక్‌లోనే ప‌డేనా..? ఆశ‌ల‌న్నీ రాసా గుమ్మ‌డి సాంగ్‌పైనే..!
Advertisement

Daksha Nagarkar | హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని టాలీవుడ్‌లో అడుగుపెట్టిన దక్షా నగార్కర్‌కు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం కలిసిరాలేదు. అందం, అభినయం ఉన్నప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా నిలదొక్కుకునే అవకాశం దక్కలేదు. దీంతో ఇప్పుడు కెరీర్‌కు గాడిలో పెట్టుకునే లక్ష్యంతో స్పెషల్‌ సాంగ్స్‌తో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇటీవల ‘నాగబంధం’లో సందడి చేసిన దక్షా.. ఇప్పుడు మెగా హీరో వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా తన కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌గా మారుతుందనే నమ్మకంతో ఉన్నది. తెలుగులో దక్షా నగార్కర్‌ ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి ప్రశంసలు లభించాయి. తొలి సినిమాతో గుర్తింపు వచ్చినా.. ఆ తర్వాత హీరోయిన్‌గా చెప్పుకోదగ్గ అవకాశాలు మాత్రం దక్కలేదు. దీంతో ఆమె కెరీర్‌ ఆశించిన స్థాయిలో ముందుకుసాగలేదు. ఆ తర్వాత నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ‘బంగార్రాజు’ సినిమాలో చేసిన స్పెషల్‌ సాంగ్‌తో మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆ పాటలో గ్లామర్‌తో పాటు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంది.

స్పెష‌ల్ అప్పియ‌రెన్స్‌..

అనంతరం రవితేజ హీరోగా తెరకెక్కిన ‘రావణాసుర’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. అయితే ఆ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో దక్షా కెరీర్‌కు పెద్దగా ఊపు రాలేదు. దీంతో స్పెషల్‌ సాంగ్స్‌ వైపు అడుగులు వేసిన దక్షా.. ఇటీవల విడుదలైన ‘నాగబంధం’ చిత్రంలోని ప్రత్యేక గీతంలో మెరిసింది. ఆ పాటకు వచ్చిన స్పందన ఆమెకు మరో అవకాశం తీసుకొచ్చింది. ప్రస్తుతం వరుణ్‌ తేజ్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌-కామెడీ ‘కొరియన్‌ కనకరాజు’ చిత్రంలో ‘రాసా గుమ్మడి’ అనే మాస్‌ డ్యాన్స్‌ నంబర్‌లో స్పెషల్‌ అప్పియరెన్స్‌ ఇస్తోంది. ఈ పాట రాయలసీమ జాతర నేపథ్యంలో సాగే పూర్తి మాస్‌ నంబర్‌గా రూపొందింది. వరుణ్‌ తేజ్‌తో కలిసి దక్షా వేసిన ఎనర్జిటిక్‌ స్టెప్పులు పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం చెబుతోంది. థమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాట చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన లభించింది. ఈ పాట కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ధీమాను మేకర్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

కెరీర్‌ను మ‌లుపుతిప్పుతుందా?

కొరియన్‌ కనకరాజు చిత్రంలో వరుణ్‌ తేజ్‌కు జోడీగా రితికా నాయక్‌ నటిస్తుండగా, కమెడియన్‌ సత్య కీలక పాత్ర పోషిస్తున్నాడు. హారర్‌, కామెడీ, మాస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది దక్షా నగార్కర్‌. వరుసగా పెద్ద చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ మరోసారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. ‘కొరియన్‌ కనకరాజు’లోని ‘రాసా గుమ్మడి’ పాట విజయవంతమైతే దక్షాకు మరిన్ని కమర్షియల్‌ సినిమాల్లో అవకాశాలు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ఆమె కెరీర్‌కు నిజంగానే కొత్త మలుపు తిప్పుతుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement