త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD Tirupati Darshan | తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను వేగంగా బుక్ చేసే ట్రిక్‌.. అస‌లు కార‌ణం ఇదే..

TTD Tirupati Darshan | తిరుమ‌ల‌లో శ్రీ‌వారి దర్శ‌నం కోసం చాలా మంది దర్శ‌నం టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుంటారు. ఈ టిక్కెట్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు రిలీజ్ చేయ‌రు. కొన్ని నెల‌ల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. దీంతో స‌హ‌జంగానే టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు త‌గిన‌ట్లుగా టిక్కెట్ల ల‌భ్య‌త ఉండ‌దు. దీని వ‌ల్ల భ‌క్తులు టిక్కెట్ల కోసం పోటీ ప‌డాల్సి వ‌స్తుంది.

S

Devotional | Published On Oct 3, 2026, 12.42 pm IST

TTD Tirupati Darshan | తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను వేగంగా బుక్ చేసే ట్రిక్‌.. అస‌లు కార‌ణం ఇదే..
Advertisement

TTD Tirupati Darshan | తిరుమ‌ల‌లో శ్రీ‌వారి దర్శ‌నం కోసం చాలా మంది దర్శ‌నం టిక్కెట్ల‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేస్తుంటారు. ఈ టిక్కెట్ల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు రిలీజ్ చేయ‌రు. కొన్ని నెల‌ల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. దీంతో స‌హ‌జంగానే టిక్కెట్ల కోసం భారీ డిమాండ్ ఉంటుంది. డిమాండ్‌కు త‌గిన‌ట్లుగా టిక్కెట్ల ల‌భ్య‌త ఉండ‌దు. దీని వ‌ల్ల భ‌క్తులు టిక్కెట్ల కోసం పోటీ ప‌డాల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో చాలా మందికి టిక్కెట్లు ల‌భించ‌వు. కోటా వ‌ర‌కు మాత్ర‌మే రిలీజ్ చేస్తారు క‌నుక ఆ మేర మాత్ర‌మే భ‌క్తుల‌కు టిక్కెట్లు అందుతాయి. వాటిని ఫ‌స్ట్ క‌మ్ ఫ‌స్ట్ స‌ర్వ్ ప‌ద్ధ‌తిలో అంటే ఎవ‌రు ముందుగా బుక్ చేస్తే వారికే విధానంలో అందిస్తారు. దీని వ‌ల్ల ఆన్‌లైన్‌లో భారీ వ‌ర్చువ‌ల్ క్యూలో వేచి చూడాల్సి ఉంటుంది. ఆ స‌మ‌యంలో ఉన్న టిక్కెట్ల‌న్నీ పూర్తిగా నిండిపోతాయి. చివ‌ర‌కు టిక్కెట్ల‌ను సాధించ‌లేక నిరాశ వ్య‌క్తం చేస్తుంటారు. అయితే తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను పొందాలంటే అందుకు కొన్ని సూచ‌న‌లు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టిక్కెట్ల‌ను బుక్ చేసేందుకు వాడే డివైస్ సాంకేతిక‌త చాలా కీల‌క‌పాత్ర పోషిస్తుంది. అది మెరుగ్గా ఉంటే చాలా వ‌ర‌కు ఇబ్బందుల‌ను అధిగ‌మించ‌వ‌చ్చు.

కీల‌కంగా మారిన ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌..

భ‌క్తుల‌కు టీటీడీ తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను బుక్ చేసుకునేందుకు ప‌లు మార్గాల‌ను అందిస్తోంది. వాటిల్లో ఆన్‌లైన్ విధానం ఎంతో పేరుగాంచింది. టీటీడీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆయా టిక్కెట్ల‌ను అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవ‌చ్చు. ఏ టిక్కెట్లు అయినా స‌రే భ‌క్తులు ఓపెనింగ్ టైమ్‌కు లాగిన్ అయి రెడీగా ఉండాలి. అవ‌స‌రమైన వివ‌రాలను నింపాలి. అనంత‌రం అందుబాటులో ఉన్న తేదీ, స‌మ‌యం, స్లాట్‌ను ఎంచుకోవాలి. చివ‌ర‌కు చెల్లింపు చేయాలి. అయితే ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యేలోపు టిక్కెట్లు అయిపోయాయ‌నే సందేశం క‌నిపిస్తుంది. ఇలా చాలా మందికి జ‌రుగుతుంది. త‌మ‌కే ఎందుకు ఇలా జ‌రుగుతుంది, కొంద‌రు వేగంగా బుక్ చేస్తారు, ఎందుకు.. అని చాలా మంది విస్మ‌యం వ్య‌క్తం చేస్తుంటారు. అయితే ఇక్క‌డే ముఖ్య‌మైన విష‌యం దాగి ఉంది.

ఫోన్ లేదా పీసీ.. ఏది బెస్ట్‌..

చాలా మంది టిక్కెట్ల బుకింగ్‌కు గాను ఫోన్ లేదా కంప్యూట‌ర్ ఉప‌యోగిస్తారు. ఎక్కువ శాతం ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో లేదా విండోస్ పీసీల్లో టిక్కెట్ల బుకింగ్ చేస్తారు. అయితే ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లు వాస్త‌వానికి కాస్త ల్యాగింగ్ ఉంటాయి. అయితే ఎంత‌టి అధునాత‌న హార్డ్‌వేర్‌, సాంకేతిక‌త ఉన్న డివైస్‌లు అయినా స‌రే ఈ ప్లాట్‌ఫామ్‌ల‌లో ఉండే ఆయా ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ల కార‌ణంగా స‌హ‌జంగానే యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లు కాస్త నెమ్మ‌దిగా ఓపెన్ అవుతాయి. దీన్ని భ‌క్తులు గ‌మ‌నించ‌లేరు. కొన్ని మిల్లీ సెక‌న్ల‌లో యాప్ లేదా వెబ్‌పేజీ ఓపెన్ అవ‌డంలో ఆల‌స్యం ఉన్నా కూడా టిక్కెట్ల బుకింగ్‌లో జాప్యం జ‌రిగి చివ‌ర‌కు టిక్కెట్లు బుక్ అవ్వవు. ఈ విష‌యంలో హార్డ్‌వేర్‌, ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ సాంకేతిక ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఆండ్రాయిడ్‌తో పోలిస్తే ఐఫోన్‌లో ఉండే ఐఓఎస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ చాలా వేగంగా ప‌నిచేస్తుంది. ఇక పీసీల్లో విండోస్ ఓఎస్ క‌న్నా యాపిల్‌కు చెందిన మాక్ బుక్ లేదా ఐమ్యాక్‌ల‌లో ఉండే మాక్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ అత్యంత వేగంగా ప‌నిచేస్తుంది. అందుక‌నే చాలా మంది భిన్న రంగాల‌కు చెందిన నిపుణులు ఐఫోన్లు, మాక్‌బుక్‌ల‌ను వాడేందుకు ఆస‌క్తి చూపిస్తుంటారు.

మెరుగైన సిగ్న‌ల్స్ ఉండాలంటే..

వాస్త‌వానికి ఆండ్రాయిడ్‌, ఐఫోన్ల‌కు చెందిన 5జి లేదా 4జి ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల‌ను గ‌మ‌నిస్తే ఐఫోన్లు ఈ విష‌యంలో ముందు వ‌రుస‌లో నిలుస్తాయి. ఆండ్రాయిడ్ ఫోన్ల క‌న్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల‌కు ఐఫోన్లు స‌పోర్ట్ చేస్తాయి. అందువ‌ల్ల చాలా సంద‌ర్భాల్లో భ‌వ‌నం కింది అంత‌స్తులో ఉన్న‌ప్ప‌టికీ ఐఫోన్లు మెరుగైన సిగ్న‌ల్ స్వీక‌రించ‌డం, యాప్‌లు వేగంగా ఓపెన్ అవ‌డం వంటి ప‌నుల‌ను అవ‌లీలగా చేయ‌గ‌లుగుతాయి. కాల్స్ క్వాలిటీ విష‌యంలోనూ ఈ ఫోన్లు పైచేయి సాధిస్తాయి. అందువ‌ల్ల ఐఫోన్ల‌లో యాప్‌ల‌ను వేగంగా ఓపెన్ చేయ‌వ‌చ్చు. సిగ్న‌ల్ త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లకు ఎక్కువ మ‌ద్దతును అందిస్తాయి క‌నుక యాప్‌లు ల్యాగ్ లేకుండా ఓపెన్ అవుతాయి. ఈ విషయాన్ని చాలా మంది ఐఫోన్ యూజ‌ర్లు గ‌మ‌నించే ఉంటారు. అందువ‌ల్ల టీడీడీ యాప్‌లో గ‌న‌క తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను బుక్ చేస్తే ఐఫోన్ అయితే బెట‌ర్‌. ఇందుకోసం ఐఫోన్ కొనాలా అని ఆలోచించాల్సిన అవ‌స‌రం లేదు. మీకు తెలిసిన వారి వ‌ద్ద లేదా కుటుంబ స‌భ్యులు, స్నేహితుల వ‌ద్ద ఐఫోన్ ఉంటే అందులో టిక్కెట్ల బుకింగ్‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

పీసీల్లో ఇదే బెస్ట్‌..

ఇక పీసీల విష‌యానికి వ‌స్తే విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ క‌న్నా మాక్ ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తుంద‌ని పేరుంది. మాక్ యాపిల్‌కు చెందిన సొంత ఆప‌రేటింగ్ సిస్ట‌మ్. దాన్ని యాపిల్ స్వ‌యంగా అభివృద్ధి చేసింది. డివైస్‌ల‌కు ఎప్పటిక‌ప్పుడు అప్‌డేట్స్‌ను అందిస్తుంది. ఇక మాక్ ఓఎస్ స‌హ‌జంగానే మాక్ బుక్ ల్యాప్‌టాప్‌లు లేదా ఐమ్యాక్, మ్యాక్ ప్రొ వంటి యాపిల్ పీసీల్లోనే ఉంటుంది. అందువల్ల ఆ పీసీల‌నే వాడాల్సి ఉంటుంది. వాటిల్లో స‌ఫారి బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి అందులో తిరుమ‌ల టిక్కెట్ల‌ను బుక్ చేయ‌వ‌చ్చు. స‌ఫారి ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్‌ను కూడా యాపిల్ స్వ‌యంగా డెవ‌ల‌ప్ చేసింది. అందువ‌ల్ల వేగంగా టిక్కెట్ల‌ను బుక్ చేయాలంటే ఈ బ్రౌజ‌ర్ ఇత‌ర వాటి క‌న్నా ఎంతో మెరుగ్గా ప‌నిచేస్తుంది. వెబ్ పేజీలు చాలా వేగంగా ఓపెన్ అవుతాయి. దీనికి హార్డ్‌వేర్ సాంకేతిక‌త కూడా యాపిల్‌దే వినియోగం అవుతుంది క‌నుక స‌హ‌జంగానే స‌ఫారి బ్రౌజ‌ర్ ఇత‌ర బ్రౌజ‌ర్‌ల క‌న్నా ఎంతో వేగంగా ప‌నిచేస్తుంది. అయితే ఐఫోన్‌తో పోలిస్తే మాక్‌బుక్‌ల ఖ‌రీదు ఇంకా ఎక్కువ‌గా ఉంటుంది. అందువ‌ల్ల ఇవి అంద‌రికీ అందుబాటులో ఉండ‌వు. కానీ మీకు తెలిసిన ఎవ‌రి ద‌గ్గ‌రైనా ఉంటే అందులో టిక్కెట్ల బుకింగ్‌ను ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

ఇంటర్నెట్ వేగం..

అయితే ఐఫోన్ లేదా మాక్‌బుక్‌లు అనేవి టిక్కెట్ల బుకింగ్ కోసం స‌హాయ‌ప‌డే హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ సాంకేతిక‌త‌ల‌ను వేగంగా అందించే ప్ర‌త్యామ్నాయాలు మాత్ర‌మే. వాస్త‌వానికి ఇవి ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్నెట్ వేగం కూడా ముఖ్య‌మే. ముఖ్యంగా సెల్యులార్ డేటా కాకుండా స్థిరంగా ఉండే బ్రాడ్ బ్యాండ్ వైఫై ఇంట‌ర్నెట్ క‌నెక్ష‌న్ కీల‌కం. సెల్యులార్ డేటా అయితే స్పీడ్ సెక‌ను సెక‌నుకు మారుతుంది. దీంతో టిక్కెట్ల బుకింగ్‌లో స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. వైఫై అయితే స్పీడ్ స్థిరంగా ఉంటుంది. దీంతో టిక్కెట్ల బుకింగ్‌లో ఉండే ఓ అవాంత‌రం త‌ప్పిన‌ట్లే. క‌నీసం 40 ఎంబీపీఎస్ స్పీడ్ క‌లిగిన వైఫై క‌నెక్ష‌న్ అయితే మంచిది. ఇక త‌రువాత విష‌యం లాగిన్‌. చాలా మంది టిక్కెట్ల రిలీజ్ విండో ఓపెన్ అవ‌క‌ముందే లాగిన్ అయి సిద్ధంగా ఉంటారు. 30 నిమిషాల ముందు నుంచే లాగిన్ అయి పేజీని రీఫ్రెష్ చేస్తుంటారు. తీరా టైమ్ వ‌చ్చేస‌రికి సెష‌న్ ఎక్స్‌పైర్ అయింద‌ని లేదా టైమ‌వుట్ అయింద‌ని వివిధ ర‌కాల ఎర్ర‌ర్ మెసేజ్‌ల‌ను చూడాల్సి వ‌స్తుంది. దీంతో మ‌ళ్లీ లాగిన్ అయి టిక్కెట్ల కోసం య‌త్నిస్తారు. అయితే అప్ప‌టికే టిక్కెట్ల‌న్నీ అయిపోతాయి. దీంతో నిరాశ వ్య‌క్తం చేస్తారు. వాస్త‌వానికి అన్ని నిమిషాల ముందు లాగిన్ అయి ఉండాల్సిన ప‌నిలేదు. కోటా ఓపెన్ అయ్యే టైముకు క‌నీసం 5 నిమిషాల ముందు లాగిన్ అయి ఉంటే స‌రిపోతుంది. లేదంటే ఎర్ర‌ర్ మెసేజ్‌ల‌తో అన‌వ‌స‌రంగా లాగ‌వుట్ అవ్వాల్సి వ‌స్తుంది.

వివ‌రాల న‌మోదు విష‌యం కీలకం..

తిరుమ‌ల టిక్కెట్ల బుకింగ్‌లో మ‌రో ముఖ్య‌మైన విష‌యం స‌మాచారం. చాలా మంది టిక్కెట్ల బుకింగ్ స‌మ‌యంలోనే వివ‌రాల‌ను న‌మోదు చేస్తుంటారు. అలా చేయ‌డం వ‌ల్ల స‌మ‌యం మించిపోతుంది. దీంతో టిక్కెట్లు ల‌భ్యం కావు. ఎంత మంది వెళ్తున్నారు, వారి ఆధార్ వివ‌రాలు, ఫోన్ నంబ‌ర్లు, పేర్లు, ఇత‌ర స‌మాచారాన్ని ముందే లిస్టులో న‌మోదు చేసి ఉంచాలి. సాధార‌ణంగా ఒకసారికి 6 మందికి మాత్ర‌మే వివ‌రాల‌ను న‌మోదు చేసి టిక్కెట్ల‌ను బుక్ చేసేందుకు అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల ఈ విష‌యంలో చాలా స్ప‌ష్ట‌త ఉండాలి. ఈ స‌మాచారం ముందు ఫిల్ అయి సిద్ధంగా ఉంటే టిక్కెట్ల బుకింగ్ వేగ‌వంతం అవుతుంది. ఇక త‌రువాత విష‌యం పేమెంట్‌. రూ.300 వంటి టిక్కెట్ల‌కు అప్ప‌టిక‌ప్పుడు పేమెంట్ చేయాలి క‌నుక వేగ‌వంత‌మైన మార్గాల‌ను ఎంచుకోవాలి. యూపీఐ లేదా వాలెట్ ద్వారా చెల్లింపులు వేగంగా జ‌రుగుతాయి. అందువ‌ల్ల కార్డుల కన్నా ఈ విధానాలు అయితే మంచిది. వేగంగా చెల్లింపులు చేసి టిక్కెట్ల‌ను పొంద‌వ‌చ్చు.

శ్రీ‌వాణి టిక్కెట్ల‌కు అయితే..

అయితే శ్రీ‌వాణి టిక్కెట్ల‌కు అయితే డొనేష‌న్ ముందుగానే చేసి కావ‌ల్సిన‌ప్పుడు కేవ‌లం టిక్కెట్ల‌ను బుక్ చేస్తే స‌రిపోతుంది. క‌నుక శ్రీ‌వాణి టిక్కెట్ల విష‌యంలో భ‌క్తుల‌కు కాస్త వెసులుబాటు ఉంటుంది. డొనేష‌న్ ముందుగానే చేసి ఉంటారు క‌నుక కావ‌ల్సిన తేదీ, స్లాట్‌ను ఎంచుకుని వేగంగా టిక్కెట్ల‌ను బుక్ చేయ‌వ‌చ్చు. అదే చివ‌రి ప్ర‌క్రియ క‌నుక ఈ టిక్కెట్లు వేగంగా బుక్ అవుతాయి. అయితే ఈ టిక్కెట్లు కూడా ప్ర‌స్తుతం చాలా మందికి ల‌భించ‌డం లేదు. కానీ డొనేష‌న్ ముందుగానే ఇచ్చిన వారు టిక్కెట్ల బుకింగ్ స‌మ‌యంలో మ‌రో సూచ‌న కూడా పాటించాలి. అదేమిటంటే.. భ‌క్తులు సాధారణంగా ఏదో ఒక్క తేదీని మాత్ర‌మే ద‌ర్శ‌నం కోసం ముందుగా నిర్ణయించుకుని అదే తేదీ కోసం య‌త్నిస్తారు. కానీ నాలుగైదు తేదీలను కూడా ముందుగానే నిర్ణ‌యించుకోవాలి. బుకింగ్ స‌మ‌యంలో ఆ తేదీల్లో ఫిల్ అయ్యే టిక్కెట్ల వేగాన్ని బ‌ట్టి ఏదో ఒక దాన్ని ఎంచుకుని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. ఇలా చేస్తే టిక్కెట్లు ల‌భించే అవ‌కాశాలు మెరుగుప‌డ‌తాయి.

ఈ చిన్న పొర‌పాట్లు వ‌ద్దు..

అన్ని విష‌యాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ప్ప‌టికీ కొంద‌రు ప‌లు చిన్న విష‌యాల్లో పొర‌పాట్లు చేస్తుంటారు. ఇవి కూడా టిక్కెట్ల బుకింగ్‌పై పెద్ద ప్ర‌భావాన్నే చూపిస్తాయి. టీటీడీ ప్లాట్‌ఫామ్‌, బ్యాంకుల‌కు అనుసంధానం అయి ఉన్న ఫోన్ నంబ‌ర్ల‌కు సిగ్న‌ల్స్ స‌రిగ్గా వ‌స్తున్నాయా, మెరుగైన సిగ్న‌ల్ ఉందా, ఓటీపీలు వ‌స్తున్నాయా, ఈ-మెయిల్ ఐడీ వివ‌రాలు వంటి స‌మాచారం స‌రిగ్గా ఉందో లేదో ముందే చెక్ చేయాలి. ఒక లాగిన్ ఐడీతో ఒకే బ్రౌజ‌ర్‌లో ఓపెన్ చేయాలి. భిన్న ర‌కాల బ్రౌజర్‌ల‌లో ఒకే లాగిన్ ఐడీని వాడ‌కూడ‌దు. వీలుంటే భిన్న లాగిన్ ఐడీల‌ను వాడ‌వ‌చ్చు. అయితే ఇది హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్ సాంకేతిక‌త‌లు, ఇంట‌ర్నెట్ వేగంపై ప్ర‌భావం చూపిస్తుంద‌ని గుర్తుంచుకోవాలి. అలాగే లాగిన్ అయిన త‌రువాత కోటా రిలీజ్ అయిన వెంట‌నే బ్రౌజ‌ర్‌ను ఎట్టి ప‌రిస్థితిలోనూ రీఫ్రెష్ చేయ‌కూడ‌దు. అలా చేస్తే మ‌ళ్లీ లాగిన్ చేయాల‌ని అడిగే అవ‌కాశాలు ఉంటాయి. చాన్స్ కోల్పోతారు. దీంతో మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాల్సి వ‌స్తుంది. ఇలా చిన్న చిన్న విష‌యాల్లో సూచ‌న‌లు పాటిస్తూ స‌రైన డివైస్‌ల‌ను ఉప‌యోగిస్తే తిరుమ‌ల ద‌ర్శ‌నం టిక్కెట్ల‌ను వేగంగా బుక్ చేయ‌వ‌చ్చు. బుకింగ్‌లో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప్ర‌క్రియ సాఫీగా జ‌రుగుతుంది.

Advertisement
Advertisement