త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TTD | శ్రీవారి భక్తులకు ఊరట.. వ‌స‌తి గ‌దుల కోసం ఇక కొత్త విధానం..!

TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతి గదుల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు టీటీడీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు గదుల కోసం కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధునిక సాంకేతికత ఆధారిత విధానాన్ని అమలు చేస్తోంది.

P

Devotional | Published On Jul 19, 2026, 7.25 pm IST

TTD | శ్రీవారి భక్తులకు ఊరట.. వ‌స‌తి గ‌దుల కోసం ఇక కొత్త విధానం..!
Advertisement

TTD | తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు వసతి గదుల కేటాయింపులో ఎదురవుతున్న ఇబ్బందులను తగ్గించేందుకు టీటీడీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటి వరకు గదుల కోసం కేంద్రీయ విచారణ కార్యాలయం (సీఆర్వో) వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారంగా ఆధునిక సాంకేతికత ఆధారిత విధానాన్ని అమలు చేస్తోంది. కొత్త విధానంలో భక్తులు సీఆర్వో వద్ద రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం, ఉప విచారణ కార్యాలయాల ద్వారా గదుల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేస్తున్నారు. దీంతో భక్తుల సమయం ఆదా కావడంతో పాటు, క్యూల వద్ద రద్దీ కూడా తగ్గుతోంది. తిరుమలలో వసతి గది అవసరమైన భక్తులు ముందుగా సీఆర్వో కార్యాలయంలో తమ పేరును నమోదు చేసుకోవాలి. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి గదులు అందుబాటులో ఉన్నంత వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది. క్యూలో తమ వంతు వచ్చినప్పుడు భక్తులు ఆధార్ కార్డు ఒరిజినల్ లేదంటే జిరాక్స్ కాపీతో పాటు మొబైల్ నంబర్‌ను అందించాలి. అనంతరం ఫేస్ రికగ్నిషన్ సాంకేతికత ద్వారా వారి వివరాలను నమోదు చేస్తారు. ఈ సమయంలో భక్తులు తమకు కావాల్సిన గది కేటగిరీని ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది.

కేటాయింపు ఇలా..

తిరుమ‌ల‌లో వ‌స‌తి గ‌దుల‌ను రెండు కేట‌గిరిలుగా విభ‌జించారు. ఏ కేట‌గిరిలో రూ.50, రూ.100 అద్దె గదులు, బీ కేట‌గిరిలో రూ.1000 గ‌దులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భక్తులకు అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ అందజేస్తారు. క్యూలైన్లలో వేచి ఉండే సమయంలో భక్తుల సౌకర్యం కోసం టీటీడీ తాగునీరు, అల్పాహారం, మరుగుదొడ్ల వంటి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసింది. రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక భక్తులు సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులను పరిశీలిస్తూ ఉండాలి. రిజిస్ట్రేషన్ నంబర్ల క్రమంలో గదుల అలాట్‌మెంట్ వివ‌రాల‌ను ప్ర‌ద‌ర్శిస్తారు. రిజిస్ట్రేషన్ నంబర్ డిస్‌ప్లే అయిన తర్వాత 15 నిమిషాల్లోపు భక్తుల మొబైల్‌కు గది కేటాయింపు వివరాలతో ఎస్ఎంఎస్ వస్తుంది. ఎస్ఎంఎస్ అందకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సీఆర్వో వద్ద ఏర్పాటు చేసిన కియోస్క్ మిష‌న్‌లో అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్‌ను స్కాన్ చేసి గది కేటాయించిన ఉప విచారణ కార్యాలయం వివరాలను తెలుసుకోవచ్చు.

ఆన్‌లైన్‌లోనే అద్దె చెల్లింపు

గది కేటాయింపు సమాచారం అందుకున్న తర్వాత భక్తులు సంబంధిత ఉప విచారణ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ గది అద్దెను కేవలం ఆన్‌లైన్ మార్గంలోనే చెల్లించాల్సి ఉంటుంది. ఫోన్ పే, గూగుల్ పే, యూపీఐ, క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేయవచ్చు. నగదు చెల్లింపులకు అవకాశం ఉండదు. చెల్లింపు పూర్తయిన వెంటనే గది తాళాలు అందిస్తారు. తిరుమ‌ల‌లో అంజనాద్రి నగర్ కాటేజెస్ (ఏఎన్‌సీ), శేషాద్రి నగర్ కాటేజెస్ (ఎస్‌ఎన్‌సీ), శంఖుమిట్ట కాటేజెస్ (ఎస్‌ఎంసీ), గరుడాద్రి నగర్ కాటేజెస్ (జీఎన్‌సీ), సుదర్శన, గోవర్ధన్, కల్యాణి సత్రాలు, సప్తగిరి, రామ్ భగీచా, వరాహ స్వామి విశ్రాంతి గృహాలు, కౌస్తుభం, పాంచజన్యం, నందకం విశ్రాంతి గృహాల్లో భక్తులకు వసతి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఉప విచార‌ణ కార్యాల‌యాలున్నాయి. వసతి గది పొందే భక్తుడికి కనీసం 21 సంవత్సరాలు వయసు ఉండాలి. ఒంటరి వ్యక్తులు, అవివాహితులకు గదుల కేటాయింపు ఉండదు. ఒకసారి గది పొందిన భక్తుడు తిరిగి 30 రోజుల వరకు మరో గది కోసం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉండదు.

నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే చ‌ర్య‌లు..

కుటుంబ సభ్యులంతా క్యూలో నిలబడకుండా ఒక వ్యక్తి మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం రావాలి. గదులను 24 గంటల వ్యవధికి మాత్రమే కేటాయిస్తారు. నిర్ణీత సమయం దాటితే అదనపు రుసుము వసూలు చేస్తారు. 24 గంటలు దాటిన తర్వాత 200 శాతం, 48 గంటలు దాటితే 400 శాతం అదనపు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. గది పొందిన భక్తుడే స్వయంగా దాన్ని ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిబంధనలకు విరుద్ధంగా గదిని ఇతరులకు అప్పగించడం నిషేధం. అలా చేస్తే కాషన్ డిపాజిట్ తిరిగి ఇవ్వకపోవడంతో పాటు, టీటీడీ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవ‌కాశం ఉంటుంది.

Advertisement
Advertisement