త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఘట్టాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.

P

Devotional | Published On Oct 11, 2026, 10.27 pm IST

Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
Advertisement

Navaratri Brahmotsavams | శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు ఆదివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. అక్టోబర్‌ 12 నుంచి 20వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాలకు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ ఘట్టాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా స్వామివారి సేనాధిపతి శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగుతూ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఖానస ఆగమ సంప్రదాయంలో అంకురార్పణకు ప్రత్యేక స్థానం ఉంది. ఉత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా జరగాలని సంకల్పిస్తూ, స్వామివారి అనుగ్రహం పొందేందుకు ఈ క్రతువును నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పవిత్రమైన విత్తనాలను మట్టి పాత్రల్లో నాటి మొలకెత్తేలా చేస్తారు. విత్తనాలు సమృద్ధిగా మొలకెత్తడం ఉత్సవాల విజయానికి శుభసూచకంగా భావిస్తారు.

అంకురార్పణను సూర్యాస్తమయం తర్వాత శుభ ముహూర్తంలో నిర్వహించడం ఆనవాయితీ. జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రుడిని సస్యకారకుడిగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో పగటిపూట కాకుండా సాయంత్రం వేళ ఈ కార్యక్రమాన్ని చేపడతారు. అంకురార్పణలో భాగంగా వివిధ పవిత్ర విత్తనాలను నాటి, వాటి మొలకల పెరుగుదలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తారు. అంకురార్పణ కోసం పాలికలు అనే మట్టి పాత్రలను ఉపయోగిస్తారు. ఈ కార్యక్రమం యాగశాలలో వేదమంత్రోచ్ఛారణల మధ్య సాగుతుంది. అంకురార్పణకు సంబంధించిన విధివిధానాలను అత్రి మహర్షి తన ‘సమూర్తార్చన అధికరణ’ గ్రంథంలో వివరించారు. అంకురార్పణ రోజున మధ్యాహ్నమే విత్తనాలను కొత్త పాత్రలోని నీటిలో నానబెడతారు. అనంతరం కార్యక్రమం నిర్వహించే ప్రదేశాన్ని ఆవు పేడతో శుద్ధి చేసి బ్రహ్మపీఠాన్ని ఏర్పాటు చేస్తారు.

అగ్ని ద్వారా బ్రహ్మ, గరుడ, శేష, సుదర్శన, వక్రతుండ, సోమ, శంత, ఇంద్ర, ఈశాన, జయ దేవతలను ఆహ్వానిస్తారు. తదుపరి భూమాతను ప్రార్థిస్తూ పాలికల్లో మట్టిని నింపుతారు. చంద్రుడిని స్మరిస్తూ విత్తనాలను చల్లి నీటిని పోస్తారు. పాలికలకు నూతన వస్త్రాలను అలంకరించి పుణ్యాహవచనం నిర్వహిస్తారు. అనంతరం సోమరాజ మంత్రం, వరుణ మంత్రం, విష్ణుసూక్తాన్ని పఠిస్తారు. ప్రతిరోజూ పాలికల్లో కొద్దిగా నీటిని పోస్తూ మొలకల పెరుగుదలను పర్యవేక్షిస్తారు. ఈ క్రతువు వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ సంప్రదాయబద్ధంగా కొనసాగుతుంది. కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement