త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam 2026 | రేప‌టి నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. సేనాధిప‌తి ఉత్స‌వంతో షురూ..!

Navaratri Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 11న ఆదివారం అంకురార్పణ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరపనున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

P

Devotional | Published On Oct 10, 2026, 9.10 pm IST

Navaratri Brahmotsavam 2026 | రేప‌టి నుంచి తిరుమ‌ల శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు.. సేనాధిప‌తి ఉత్స‌వంతో షురూ..!
Advertisement

Navaratri Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అక్టోబరు 11న ఆదివారం అంకురార్పణ నిర్వహించనున్నారు. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, ఆలయంలోని యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా జరపనున్నారు. బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరగాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆగమ సంప్రదాయం ప్రకారం ఈ వైదిక కార్యక్రమాలను నిర్వహిస్తారు.

ముందుగా సేనాధిపతి ఉత్సవం

శ్రీవారి సర్వసైన్యాధ్యక్షుడైన శ్రీ విష్వక్సేనులవారికి ముందుగా ఉత్సవం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా స్వామివారిని తిరుమల ఆలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధుల్లో ఊరేగిస్తారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు విష్వక్సేనులవారు మాడ వీధుల్లో విహరిస్తారని పురాణ ప్రాశస్త్యం. బ్రహ్మోత్సవాలకు ముందు నిర్వహించే ఈ ఉత్సవానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

భూదేవికి పూజ.. మేదినిపూజ

ఆగమ సంప్రదాయం ప్రకారం ప్రతి వైదిక ఉత్సవానికి ముందు అంకురార్పణ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ముందుగా మేదినిపూజ చేస్తారు. నవధాన్యాలు మొలకెత్తించేందుకు అవసరమైన పుట్టమన్నును సేకరించే ముందు భూదేవిని ప్రసన్నం చేసుకుంటూ ఈ పూజ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అర్చకులు భూసూక్తాన్ని పఠిస్తారు. భూమి సస్యశ్యామలంగా ఉండాలని, పాడిపంటలతో పాటు పశుపక్ష్యాదులు వృద్ధి చెందాలని ప్రార్థిస్తారు.

నవధాన్యాలతో అంకురార్పణ

వైఖానస ఆగమంలోని ముఖ్యమైన క్రతువుల్లో అంకురార్పణ లేదా బీజవాపన ఒకటి. ఇందులో భాగంగా మట్టికుండలైన పాలికల్లో పుట్టమన్ను నింపి, నవగ్రహాలకు సంకేతంగా నవధాన్యాలను వేస్తారు. విత్తనాలు చక్కగా మొలకెత్తాలని కోరుతూ అర్చకులు ఓషధీసూక్తాలను పఠిస్తారు. ఈ సంప్రదాయంలో ఒక్కో ధాన్యాన్ని ఒక్కో గ్రహానికి ప్రతీకగా భావిస్తారు. గోధుమలను సూర్యుడికి, బియ్యాన్ని చంద్రుడికి, కందులను కుజుడికి, పెసలను బుధుడికి, శనగలను బృహస్పతికి, అలసందలను శుక్రుడికి, నువ్వులను శనికి, మినుములను రాహువుకు, ఉలవలను కేతువుకు సంకేతంగా పరిగణిస్తారు. అలాగే యాగశాలలో పాలికల చుట్టూ అష్టదిక్పాలకులైన ఇంద్రుడు, అగ్ని, యముడు, నిరృతి, వరుణుడు, వాయుదేవుడు, కుబేరుడు, ఈశానుడితో పాటు మొత్తం 49 మంది దేవతలను ఆవాహన చేస్తారు.

తొమ్మిది రోజుల పాటు ధాన్యాల పెంపకం

అంకురార్పణలో భాగంగా పాలికల్లో వేసిన నవధాన్యాలను బ్రహ్మోత్సవాలు జరిగే తొమ్మిది రోజుల పాటు పెంచుతారు. చివరి రోజున మొలకలను వేరు చేసి స్వామివారికి అక్షతారోపణ నిర్వహిస్తారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగాలని, ప్రకృతి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు.

Advertisement

తాజావార్తలు

Advertisement