త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక

Navaratri Brahmotsavam | లోకానికి మేలు జరగాలి.. సకల జీవులు సుభిక్షంగా ఉండాలి.. భక్తుల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి.. ఇదే పరమార్థంగా తిరుమలలో నిత్యం ఓ దివ్య వివాహ వేడుక సాగుతోంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.. శ్రీదేవి, భూదేవి సమేతంగా నిత్య కల్యాణ శోభతో భక్తులకు దర్శనమిస్తున్నారు. యుగాలు మారినా, తరాలు గడిచినా తరగని ఈ ఆధ్యాత్మిక వైభవం వెనుక శతాబ్దాల చరిత్ర, ఆగమ సంప్రదాయాలు, అన్నమయ్య వంశీయుల విశిష్ట పాత్ర దాగి ఉన్నాయి.

P

Devotional | Published On Oct 13, 2026, 8.30 am IST

Navaratri Brahmotsavam | శతాబ్దాల సంప్రదాయం.. శ్రీనివాసుడికి నిత్యకల్యాణ వేడుక
Advertisement
  • అన్నమయ్య కాలం నుంచి కొనసాగుతున్న కార్యక్రమం
  • కన్యాదాతలుగా తాళ్లపాక వంశీయులు..
  • లోకక్షేమం కోసం ఆగమోక్తంగా స్వామివారి కల్యాణం..
  • దేశవిదేశాలకూ విస్తరించిన శ్రీవారి కల్యాణోత్సవం

Navaratri Brahmotsavam | లోకానికి మేలు జరగాలి.. సకల జీవులు సుభిక్షంగా ఉండాలి.. భక్తుల జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలి.. ఇదే పరమార్థంగా తిరుమలలో నిత్యం ఓ దివ్య వివాహ వేడుక సాగుతోంది. ఏడుకొండలపై కొలువైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి.. శ్రీదేవి, భూదేవి సమేతంగా నిత్య కల్యాణ శోభతో భక్తులకు దర్శనమిస్తున్నారు. యుగాలు మారినా, తరాలు గడిచినా తరగని ఈ ఆధ్యాత్మిక వైభవం వెనుక శతాబ్దాల చరిత్ర, ఆగమ సంప్రదాయాలు, అన్నమయ్య వంశీయుల విశిష్ట పాత్ర దాగి ఉన్నాయి. భక్తుల వ్యక్తిగత కోరికల నెరవేర్పు నుంచి సర్వలోక శాంతి ఆకాంక్ష వరకు.. తిరుమల కల్యాణోత్సవం ఓ విశిష్ట ఆధ్యాత్మిక సంప్రదాయంగా కొనసాగుతోంది.

అన్నమయ్య సంకీర్తనల్లోనే ఆనవాళ్లు

శ్రీవారి కల్యాణోత్సవానికి 15వ శతాబ్దం నుంచే విశిష్ట ప్రాధాన్యం ఉన్నట్లు అన్నమాచార్యుల సంకీర్తనలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజున స్వామివారి కల్యాణం నిర్వహించేవారనే విషయాన్ని ‘పెనచి పదోనాడు పెండ్లిపీట’ అనే అన్నమయ్య సంకీర్తన పంక్తి సూచిస్తోంది. మరోవైపు శాసనాలు తిరుమల కల్యాణోత్సవ చరిత్రకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. 1546 నాటి శాసనం ప్రకారం పంగుని మాసంలో అనురాధ నక్షత్రం నుంచి ఉత్తరాషాఢ నక్షత్రం వరకు ఐదు రోజులపాటు కల్యాణోత్సవం నిర్వహించేందుకు పెద్ద తిరుమలాచార్యుల కుమారులు తిరువెంకటనాథన్‌ మాన్యాలు సమర్పించారు. 1554 నాటి శాసనంలోనూ తిరుమలై అయ్యంగార్‌ ఈ ఉత్సవానికి మాన్యాలు ఇచ్చినట్లు ప్రస్తావన ఉంది. ఈ ఆధారాలు కల్యాణోత్సవ నిర్వహణకు అప్పట్లోనే ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవని తెలియజేస్తున్నాయి.

ఘంటామండపం నుంచి సంపంగి ప్రాకారానికి..

తొలినాళ్లలో స్వామివారి కల్యాణోత్సవం ఆలయంలోని తిరుమామణి మండపం, ప్రస్తుతం ఘంటామండపంగా పిలిచే ప్రాంతంలో జరిగేదని అన్నమయ్య సంకీర్తనలు వెల్లడిస్తున్నాయి. అనంతరం ఆనందనిలయానికి పడమర వైపున ఉన్న పాత కల్యాణమండపంలో, కొంతకాలం తిరుమలరాయ మండపంలోనూ ఈ వేడుకను నిర్వహించినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కాలక్రమంలో కల్యాణోత్సవాన్ని ఆర్జిత సేవగా ప్రవేశపెట్టి, ఆలయ ప్రాకారానికి వెలుపల ఉన్న సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపానికి తరలించారు. ప్రస్తుతం అక్కడే భక్తుల సమక్షంలో ఈ సేవ కొనసాగుతోంది.

మేళతాళాలు.. మంత్రఘోష.. వైభవోపేతంగా వేడుక

శ్రీవారి ఆలయంలో రెండో గంట పూర్తయిన అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని మేళతాళాల మధ్య కల్యాణమండపానికి తీసుకొస్తారు. ముందుగా సిద్ధం చేసిన సింహాసనాలపై స్వామివారిని, ఉభయ దేవేరులను వేంచేపు చేస్తారు. అనంతరం అర్చకులు, వేదపండితులు, జీయంగార్ల ప్రతినిధులు, ఆలయ పరిచారకులు, మేళగాళ్లు, అన్నమయ్య వంశీయుల భాగస్వామ్యంతో వివాహ క్రతువు మొదలవుతుంది. వేదమంత్రాలు, దివ్యప్రబంధ పారాయణం, సంప్రదాయ వాద్యాల నడుమ జరిగే ఈ వేడుకలో ప్రతి ఘట్టానికీ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. వైఖానస ఆగమ విధానాన్ని అనుసరిస్తూ సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, రక్షాబంధనం వంటి క్రతువులను నిర్వహిస్తారు. అనంతరం విశేష హోమాలు, వస్త్ర సమర్పణ, మహాసంకల్పం, ప్రవర పఠనం జరుగుతాయి.

కన్యాదానం.. అన్నమయ్య వంశీయుల ప్రత్యేకత

తిరుమల కల్యాణోత్సవంలో తాళ్లపాక అన్నమాచార్యుల వంశస్థుల పాత్ర అత్యంత విశిష్టమైనది. స్వామివారికి కన్యాదాతలుగా వారు వ్యవహరించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. కల్యాణ ఘట్టంలో స్వామివారి మామ స్థానాన్ని పోషిస్తూ కన్యాదాన కార్యక్రమంలో పాల్గొంటారు. మాంగళ్య పూజ అనంతరం స్వామివారికి మాంగళ్యధారణ నిర్వహిస్తారు. లాజహోమం, ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహుతి తదితర క్రతువులను పూర్తి చేస్తారు. హోమాగ్ని నుంచి స్వీకరించిన అంజనాన్ని స్వామి, అమ్మవార్ల నుదుట సమర్పించడం కూడా ఈ వేడుకలోని ప్రత్యేక ఘట్టాల్లో ఒకటి. దివ్యప్రబంధంలోని ‘వారణమాయిరం’ పాశురాలను పారాయణం చేస్తుండగా కొబ్బరికాయలను దొర్లిస్తారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు పూలమాలల మార్పిడి నిర్వహిస్తారు. ఒకే పీఠంపై వేంచేపు చేసిన ఉత్సవమూర్తులకు అక్షతారోహణం చేసి కర్పూర హారతి సమర్పిస్తారు. ఈ కల్యాణంలో తెలుగు, తమిళ సంప్రదాయాల సమ్మేళనం కనిపిస్తుంది. స్వామి, అమ్మవార్ల మధ్య తెర ఉంచడం తెలుగు వివాహ పద్ధతిని ప్రతిబింబిస్తే.. ‘వారణమాయిరం’ పారాయణం, కొబ్బరికాయలు దొర్లించే ఆచారం తమిళ వివాహ సంప్రదాయాలను గుర్తుచేస్తాయి.

మాంగళ్యధారణలోనూ లోకరక్షణ సందేశం

సాధారణ వివాహాల్లో మాంగళ్యధారణ సమయంలో వినిపించే శ్లోకానికి, తిరుమల కల్యాణోత్సవంలో పఠించే శ్లోకానికి మధ్య భావపరంగా కీలకమైన తేడా ఉంది. సాధారణంగా దంపతుల దీర్ఘకాల సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ మాంగళ్యధారణ మంత్రాన్ని పఠిస్తారు. శ్రీవారి కల్యాణంలో మాత్రం లోకరక్షణే ప్రధాన భావంగా ప్రతిధ్వనిస్తుంది. ‘మాంగళ్య తంతునానేనా లోక రక్షణ హేతునా.. కంఠే భద్నామి సుభగే రక్షంతు భువనత్రయం’ అంటూ పఠిస్తారు. ముల్లోకాల క్షేమం, సకల జీవుల రక్షణ కోసం ఈ మాంగళ్యం అనే భావం ఇందులో అంతర్లీనంగా ఉంటుంది. వ్యక్తిగత వైవాహిక శుభాన్ని దాటి సమస్త లోకాల మేలు కోరడం ఈ వేడుక ప్రత్యేకత.

మొక్కులు.. ముడుపులు.. భక్తుల విశ్వాసం

తిరుమల కల్యాణోత్సవానికి భక్తుల నుంచి విశేష ఆదరణ లభించడానికి వారి విశ్వాసమే ప్రధాన కారణం. ముఖ్యంగా వివాహం ఆలస్యమవుతున్న వారు, వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు కోరుకునేవారు స్వామివారికి కల్యాణం చేయిస్తామని మొక్కుకుంటారు. కోరిక నెరవేరిన అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొని మొక్కు చెల్లించుకుంటారు. వివాహమైన కొత్త జంటలు కూడా తమ దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షిస్తూ ఈ సేవలో భాగస్వాములవుతారు. ఇలా భక్తుల వ్యక్తిగత విశ్వాసాలు, కుటుంబ శుభాకాంక్షలు, లోకక్షేమ భావనల కలయికగా కల్యాణోత్సవం కొనసాగుతోంది.

ఆర్జిత సేవగా మారిన కల్యాణం

కాలానుగుణంగా కల్యాణోత్సవ టికెట్ల ధరలు, భక్తుల ప్రవేశం, ప్రసాదాల పంపిణీలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. 1948లో టికెట్‌ ధర రూ.305గా ఉండేది. ఒక్క టికెట్‌పై 12 మందికి అనుమతిస్తూ లడ్డూలు, అప్పాలు, దోశలు, అన్నప్రసాదాలు అందించేవారు. 1958-59లో టికెట్‌ ధరను రూ.500కు పెంచడంతోపాటు పాల్గొనే భక్తుల సంఖ్యను 10కి తగ్గించారు. 1975లో టీటీడీ ఈ సేవను ఆర్జిత సేవగా ప్రవేశపెట్టి ప్రసాదాల విధానంలో మార్పులు చేసింది. లడ్డూలు, వడలు, దోశలు, అప్పాలతోపాటు వస్త్ర బహుమానాన్ని అందించడం ప్రారంభించింది. 1980లో టికెట్‌ ధర రూ.1,500కు, 1981లో రూ.2,000కు పెరిగింది. 1993లో అది రూ.2,500కు చేరింది. 1995 మేలో ఒక్క టికెట్‌పై పది మందిని అనుమతించే విధానానికి స్వస్తి పలికి ఐదుగురికి పరిమితం చేశారు. 1997లో పట్టువస్త్రాల స్థానంలో కాటన్‌ ఉత్తరీయం, రవికను బహుమానంగా ఇవ్వడం ప్రారంభించారు. మరోవైపు 1981లో ఇద్దరికి అనుమతించేలా రూ.500 ప్రత్యేక కల్యాణోత్సవ టికెట్‌ను ప్రవేశపెట్టారు. తర్వాత దాని ధర రూ.750కు పెరిగింది. 2005 వరకు రూ.750 ప్రత్యేక కల్యాణోత్సవం, రూ.2,500 పెద్ద కల్యాణోత్సవం రెండూ కొనసాగాయి. అనంతరం ఈ రెండు విధానాలను రద్దు చేసి, 2005 ఏప్రిల్‌ 1 నుంచి రూ.1,000 టికెట్‌పై ఇద్దరికి అనుమతించే పద్ధతిని అమల్లోకి తెచ్చారు. 2020 వరకు భక్తులకు వివిధ రకాల లడ్డూలు, ఇతర ప్రసాదాలతోపాటు ఉత్తరీయం, రవిక, కవర్లు అందించేవారు. అనంతరం ప్రసాదాల బహుమానాన్ని నిలిపివేసి ప్రస్తుతం ఉత్తరీయం, రవికను మాత్రమే అందిస్తున్నారు.

రోజుకు 700 నుంచి 800 మంది భక్తులు

ప్రస్తుతం కల్యాణోత్సవ టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా, తిరుమలలోని సీఆర్వో కార్యాలయంలో లక్కీడిప్‌ విధానంలో, అదనపు ఈవో కార్యాలయం ద్వారా కేటాయిస్తున్నారు. వివాహమైన ఏడు రోజుల్లోపు తిరుమలకు వచ్చే 20 నూతన జంటలకు సీఆర్వో కార్యాలయంలో టికెట్లు జారీ చేసే వెసులుబాటు కూడా ఉంది. రోజూ సుమారు 700 నుంచి 800 మంది భక్తులు ఈ సేవలో పాల్గొంటున్నారు. ప్రత్యక్షంగా తిరుమలకు రాలేని గృహస్తుల కోసం వర్చువల్‌ సేవను కూడా అందుబాటులో ఉంచారు. భక్తులు తమ గోత్రనామాలతో పరోక్షంగా సేవలో పాల్గొనే అవకాశం పొందుతున్నారు. 2008 నుంచి ఎస్వీబీసీ ద్వారా కల్యాణోత్సవాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు.

కరోనా వేళా ఆగని ఆగమ క్రతువు

కరోనా మహమ్మారి సమయంలో ఆలయ దర్శనాలు నిలిచిపోయినా శ్రీవారి కల్యాణోత్సవం మాత్రం ఆగలేదు. 2020 మార్చి నుంచి భక్తుల ప్రవేశంపై ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆర్జిత సేవలను నిలిపివేశారు. అయితే లోకక్షేమాన్ని ఆకాంక్షిస్తూ నిత్యం నిర్వహించే కల్యాణోత్సవాన్ని కొనసాగించాలన్న పండితుల సూచనల మేరకు, అనుమతులతో భక్తుల ప్రవేశం లేకుండానే ఏకాంతంగా నిర్వహించారు. భక్తుల సందడి లేకపోయినా ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా స్వామివారి నిత్య కైంకర్యాలతోపాటు కల్యాణోత్సవం కొనసాగడం తిరుమల సంప్రదాయ విశిష్టతను చాటింది.

దేశవిదేశాల్లో శ్రీనివాస కల్యాణాలు

తిరుమలకే పరిమితం కాకుండా శ్రీవారి కల్యాణ వైభవాన్ని దేశవిదేశాలకు విస్తరించేందుకు టీటీడీ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోంది. 2012లో హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టును ప్రారంభించారు. అంతకుముందు అన్నమయ్య ప్రాజెక్టు ద్వారా ‘గోవింద కల్యాణం’ పేరుతో వేడుకలు నిర్వహించేవారు. 2015లో శ్రీవారి వైభవోత్సవాల ప్రాజెక్టును శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టులో విలీనం చేశారు. 2018-19 నుంచి 2022-23 మధ్య ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా రూ.15 కోట్లు కేటాయించినట్లు అందుబాటులో ఉన్న వివరాలు సూచిస్తున్నాయి. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలు, ఎస్సీ, ఎస్టీ కాలనీలు, మత్స్యకార గ్రామాల్లో టీటీడీ ఖర్చులతో కల్యాణాలు నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో స్థానిక నిర్వాహకులు, స్పాన్సర్ల సహకారంతో వేడుకలను చేపడుతున్నారు. 2012 నుంచి ఇప్పటివరకు మొత్తం 968 శ్రీనివాస కల్యాణాలు నిర్వహించగా, వాటిలో 62 విదేశాల్లో జరిగాయి. అమెరికా, లండన్‌ తదితర ప్రాంతాల్లోనూ ఈ వేడుకలను నిర్వహించారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేక ధర్మప్రచార రథాల ద్వారా తరలించి కల్యాణాలు నిర్వహిస్తున్నారు. విదేశాల్లో మాత్రం అక్కడి నిర్వాహకులు సమకూర్చిన విగ్రహాలతో, ఆగమ సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు చేపడుతున్నారు.

తరాలు మారినా.. తరగని వైభవం

తిరుమల కల్యాణోత్సవం ఓ ఆర్జిత సేవ మాత్రమే కాదు.. శతాబ్దాల చరిత్రను, అన్నమయ్య భక్తి వారసత్వాన్ని, వైఖానస ఆగమ సంప్రదాయాన్ని ఒకే వేదికపై నిలిపే అపురూప వేడుక. భక్తుల మొక్కులు తీర్చే విశ్వాస కేంద్రంగా, భారతీయ వివాహ సంప్రదాయాల సమ్మేళనంగా, ధర్మప్రచార సాధనంగా ఈ ఉత్సవం తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. స్వామివారికి నిత్య కల్యాణం.. సకల లోకాలకు శుభకామన.. ఇదే తిరుమల కల్యాణోత్సవ అంతరార్థం.

Advertisement
Advertisement