త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tirumala Brahmotsavam | స్వర్ణకాంతులతో మలయప్ప.. పెద్దశేష వాహనంపై దివ్య దర్శనం

Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు.

P

Devotional | Published On Oct 12, 2026, 8.44 pm IST

Tirumala Brahmotsavam | స్వర్ణకాంతులతో మలయప్ప.. పెద్దశేష వాహనంపై దివ్య దర్శనం
Advertisement

Tirumala Brahmotsavam | కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు తిరుమలలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలిరోజు సోమవారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు ఏడుతలల స్వర్ణ శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ గోవిందరాజస్వామి అలంకారంలో స్వర్ణాభరణాలతో విరాజిల్లిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తిరుమాడ వీధులు గోవింద నామస్మరణతో మార్మోగాయి.

బ్రహ్మోత్సవాల్లో పెద్ద శేషవాహనానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఏడుతలల ఆదిశేషుడిపై స్వామివారు కొలువుదీరడం భక్తులకు కనువిందు చేసే దృశ్యం. శ్రీమహావిష్ణువుకు అత్యంత సన్నిహితుడైన ఆదిశేషుడు తన పడగల నీడలో స్వామివారికి సేవలందిస్తూ, పాన్పుగా నిలిచి దాస్యభక్తికి ప్రతీకగా నిలుస్తాడు. శేషుడు శ్రీహరి సేవలో నిరంతరం నిమగ్నమై ఉండటాన్ని ఈ వాహనసేవ చాటిచెబుతుంది. పురాణాల ప్రకారం.. త్రేతాయుగంలో శ్రీరాముడికి లక్ష్మణుడిగా, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడికి బలరాముడిగా ఆదిశేషుడు అవతరించి స్వామివారికి సన్నిహిత సేవలు అందించారు.

అటువంటి ఆదిశేషుడిపై శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామివారు విహరించడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచింది. నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం చిన్నశేష వాహనంపై, రాత్రి హంస వాహనంపై మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. పెద్ద శేషవాహనసేవలో పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, సీవీఎస్‌వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో భాస్కర్‌ తదితర పాల్గొన్నారు.

Advertisement
Advertisement