త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Surya Tilakam | అయోధ్య బాల‌రాముడి నుదుట సూర్య‌తిల‌కం

Surya Tilakam | అయోధ్య శ్రీ‌రాముడి ఆల‌యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు క‌నుల పండువ‌గా జ‌రిగాయి. ఆల‌యం ప్రాణ ప్ర‌తిష్ట త‌ర్వాత మూడోసారి వేడుక‌ల‌ను అంబ‌రాన్నంటేలా నిర్వ‌హించారు. సూర్య‌నారాయ‌ణుడి కిర‌ణాలు బాల‌రాముడి నుదుటిపై తిల‌కంగా క‌నిపించ‌గా.. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భ‌క్తులు ప‌ర‌వ‌శించిపోయారు.

P

Devotional | Published On Mar 27, 2026, 8.30 pm IST

Surya Tilakam | అయోధ్య బాల‌రాముడి నుదుట సూర్య‌తిల‌కం
Advertisement
  • ఘ‌నంగా శ్రీ‌రామ న‌వ‌మి వేడుక‌లు
  • అద్భుత దృశ్యాన్ని తిల‌కించేందుకు త‌ర‌లివ‌చ్చిన భ‌క్తులు
  • సూర్య‌తిల‌కం వెనుక ఆప్టో-మెకానికల్ వ్యవస్థ
  • కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన‌ బెంగ‌ళూరు ఐఐఏ, సీబీఆర్‌

Surya Tilakam | త్రినేత్ర‌.న్యూస్ : అయోధ్య శ్రీ‌రాముడి ఆల‌యంలో శ్రీ‌రామ‌న‌వ‌మి వేడుక‌లు క‌నుల పండువ‌గా జ‌రిగాయి. ఆల‌యం ప్రాణ ప్ర‌తిష్ట త‌ర్వాత మూడోసారి వేడుక‌ల‌ను అంబ‌రాన్నంటేలా నిర్వ‌హించారు. సూర్య‌నారాయ‌ణుడి కిర‌ణాలు బాల‌రాముడి నుదుటిపై తిల‌కంగా క‌నిపించ‌గా.. ఈ అద్భుత దృశ్యాన్ని చూసి భ‌క్తులు ప‌ర‌వ‌శించిపోయారు. అయోధ్య ఆల‌యంలో బాల‌రాముడి నుదుటిపై కిర‌ణాలు ప‌డేందుకు శాస్త్ర సాంకేతిక‌ను ఉప‌యోగించారు. బెంగళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్ (ఐఐఏ) శాస్త్రవేత్తలు, కేంద్ర భవన నిర్మాణ పరిశోధన సంస్థ (సీబీఆర్‌ఐ) శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు ఐఐటీ రూర్కీ స‌హ‌కారం అందించింది. ప్ర‌తి శ్రీ‌రామ‌న‌వ‌మి రోజున శ్రీ‌రాముడి నుదుటిపై నిర్దిష్ట స‌మ‌యంలో సూర్య కిర‌ణాలు ప‌డేలా ప్ర‌త్యేకంగా ఏర్పాట్లు చేశారు.

ఈ ప్రాజెక్ట్‌లో ఐఐఏ కీల‌క‌పాత్ర పోషించింది. సూర్యుడి గ‌మ‌నాన్ని ఖచ్చితంగా లెక్కించడం, ఆప్టికల్ వ్యవస్థ రూపకల్పన, దాని సామర్థ్యాన్ని మెరుగుపరచడం వంటి బాధ్య‌త‌ల‌ను ఐఐఏ శాస్త్ర‌వేత్త‌లు నిర్వ‌హించారు. శ్రీరామ నవమి ప్ర‌తి సంవ‌త్స‌రం తేదీ మారుతూ వ‌స్తుంటుంది. ఇందుకు అనుగుణంగా సూర్యకిర‌ణాల దిశ‌ను కూడా అందుకు అనుగుణంగా స‌ర్దుబాటు చేయాల్సి ఉంటుంది. వాస్త‌వానికి గ్రెగోరియ‌న్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం సంవ‌త్స‌రానికి 365 రోజులుంటాయి. కానీ, హిందూ పంచాంగం, లూనార్ క్యాలెండ‌ర్ ప్ర‌కారం సంవ‌త్స‌రంలో 354 రోజులుంటాయి. ఈ రెండు క్యాలెండర్ల మధ్య తేడా ఉండటంతో ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి తేదీ మారుతుంది. దాంతో సూర్యకిరణాల స్థానం సైతం మారుతుండటంతో స‌వాల్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్‌లో ఆప్టో-మెకానికల్ వ్యవస్థలో అద్దాలు, లెన్సులు కీల‌కంగా ప‌ని చేస్తాయి. ఇది పెరిస్కోప్ విధానంపై ప‌ని చేస్తూ సూర్యకాంతిని నేరుగా విగ్ర‌హం నుదుటిపై ప‌డేలా చేస్తుంది. 19 గేర్లతో కూడిన ఈ వ్యవస్థలో ప్రతి సంవత్సరం ఒక గేర్ దంతాన్ని చేతితో తిప్పి సూర్యుడి స్థానానికి అనుగుణంగా మిర్ర‌ర్ కోణాన్ని స‌రి చేస్తారు. ఈ 19 సంవత్సరాల సైకిల్ ‘మెటానిక్ సైకిల్’కు అనుగుణంగా రూపొందించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థలో 4 అద్దాలు, 2 లెన్సులు ఉప‌యోగించారు. ఆలయం మొత్తం పూర్త‌య్యాక ఇందులో 4 అద్దాలు, 4 లెన్సులతో కూడిన పూర్తి స్థాయి మోడ‌ల్‌ని అమ‌లు చేస్తారు. ఈ వ్యవస్థను విజ‌య‌వంతం చేయ‌డంలో సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (CBRI) కీలకంగా వ్య‌వ‌హ‌రించింది. ఇదిలా ఉండ‌గా.. ఈ వ్య‌వ‌స్థ కేవ‌లం సూర్య‌కాంతిపైనే ఆధార‌ప‌డి ప‌ని చేస్తుంది. ఆకాశం మేఘావృత‌మై ఉన్నా.. వ‌ర్షం ప‌డిన సంద‌ర్భాల్లో ప‌ని చేసే అవ‌కాశం ఉండ‌ద‌ని నిపుణులు పేర్కొంటున్నారు. ప్ర‌తి సంవ‌త్స‌రం శ్రీరామ నవమికి ముందు మొదటి అద్దాన్ని చేతితో సర్దుబాటు చేయాల్సి ఉంటుంద‌ని వివ‌రిస్తున్నారు.

Advertisement
Advertisement