త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు

Tiruchanoor | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా కొనసాగిన పవిత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ తదితర కార్యక్రమాలను అర్చకులు ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు.

P

Devotional | Published On Sep 26, 2026, 7.18 pm IST

Tiruchanoor | పూర్ణాహుతితో ముగిసిన పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు
Advertisement

Tiruchanoor | తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మూడు రోజులుగా వైభవంగా కొనసాగిన పవిత్రోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. చివరి రోజు నిర్వహించిన మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ తదితర కార్యక్రమాలను అర్చకులు ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించారు. ఉదయం 10.40 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. మహాపూర్ణాహుతి అనంతరం శాంతి హోమం, కుంభప్రోక్షణ, నివేదన వంటి క్రతువులను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు.

భక్తిశ్రద్ధలతో చక్రస్నానం

మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో స్నపనతిరుమంజనం నిర్వహించారు. శ్రీ పద్మావతి అమ్మవారితో పాటు శ్రీకృష్ణస్వామి, శ్రీసుందరరాజస్వామి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌కు ప్రత్యేకంగా అభిషేకాది కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్‌ను పల్లకీలో మంగళవాయిద్యాల నడుమ పద్మపుష్కరిణి వద్దకు తీసుకెళ్లారు. అక్కడ సంప్రదాయబద్ధంగా చక్రస్నానం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భక్తులు భక్తిభావంతో వీక్షించారు.

మాడ వీధుల్లో విహారం

పవిత్రోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు శ్రీకృష్ణస్వామి, శ్రీసుందరరాజస్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. అమ్మవారి దర్శనం, ఆశీస్సుల కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కార్యక్రమాల్లో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డా. ఎ. శరత్, సీవీఎస్వో కే.వి. మురళీకృష్ణ, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, డెప్యూటీ ఈవో హరీంద్రనాథ్, ఆలయ అర్చకులు బాబు స్వామి, ఏఈవో దేవరాజులు, సూపరింటెండెంట్లు మునిచెంగల్రాయలు, రమేష్, సురేష్, శ్రీవాణి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు చలపతి, లక్ష్మీకాంతం, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement