త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!

Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు.

P

Devotional | Published On Sep 22, 2026, 9.17 pm IST

Brahmotsavam 2026 | కల్కి అలంకారంలో మలయప్ప స్వామి దివ్యదర్శనం.. అశ్వ వాహనంపై విహారం..!
Advertisement

Brahmotsavam 2026 | తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు మంగళవారం రాత్రి శ్రీమలయప్ప స్వామివారు కల్కి అలంకారంలో అశ్వ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారి వాహనసేవను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చారు. అశ్వ వాహనం ముందు గజరాజులు నడవగా.. భజనలు, కోలాటాలు, మంగళవాయిద్యాల మధ్య వాహనసేవ వైభవంగా సాగింది. జీయ్యంగార్ల ఘోషతో తిరుమాడ వీధులు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. స్వామివారి దర్శనం కోసం వేచిచూసిన భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పిస్తూ ‘గోవింద.. గోవింద’ అంటూ నామస్మరణ చేశారు.

ఇంద్రియ నియంత్రణకు ప్రతీక

అశ్వ వాహనసేవకు ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఉపనిషత్తుల్లో ఇంద్రియాలను గుర్రాలతో పోల్చారు. అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ.. ఇంద్రియాలను నియంత్రించే నియామకుడనే సందేశాన్ని ఈ వాహనసేవ అందిస్తుంది. కృష్ణయజుర్వేదంలోనూ పరమాత్మను అశ్వ స్వరూపంగా అభివర్ణించినట్లు పండితులు చెబుతున్నారు. కల్కి స్వరూపంలో అశ్వ వాహనంపై మలయప్ప స్వామివారి విహారం భక్తులకు ప్రత్యేక సందేశాన్ని అందిస్తుంది. కలియుగ దుష్ప్రభావాలకు దూరంగా ఉంటూ నామసంకీర్తనను ఆశ్రయించి భగవంతుడి అనుగ్రహం పొందాలనే ఆధ్యాత్మిక సందేశాన్ని ఈ సేవ ద్వారా తెలియజేస్తున్నట్లు పేర్కొంటారు. కార్య‌క్ర‌మంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, పలువురు బోర్డు సభ్యులు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.

Advertisement
Advertisement