త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Venkatadri App | తిరుమలలో దారి త‌ప్పుతామ‌న్న‌ బాధే లేదు!

Venkatadri App | తిరుమలలో భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. భక్తులకు అవసరమైన ప్రదేశాలను గుర్తించడంతోపాటు, వివిధ సేవలను సులువుగా పొందేందుకు రూపొందించిన ‘వేంకటాద్రి’ మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు.

P

Devotional | Published On Oct 12, 2026, 7.31 pm IST

Venkatadri App | తిరుమలలో దారి త‌ప్పుతామ‌న్న‌ బాధే లేదు!
Advertisement
  • ఏఐ సాయంతో భక్తులకు మార్గదర్శనం..
  • స‌రికొత్త‌గా ‘వేంకటాద్రి’ యాప్‌ ప్రారంభం
  • సీఎం చంద్రబాబు చేతుల మీదుగా వర్చువల్‌గా ఆవిష్కరణ
  • 24 గంటలూ అందుబాటులో ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌
  • ఇంటర్నెట్‌ లేకున్నా మార్గ నిర్దేశం
  • ఐదు భాషల్లో యాప్‌ సేవలు

Venkatadri App | తిరుమలలో భక్తుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీటీడీ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. భక్తులకు అవసరమైన ప్రదేశాలను గుర్తించడంతోపాటు, వివిధ సేవలను సులువుగా పొందేందుకు రూపొందించిన ‘వేంకటాద్రి’ మొబైల్‌ యాప్‌ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఏఐ ఆధారిత వాయిస్‌ అసిస్టెంట్‌, ఇంటర్నెట్‌ లేకున్నా పనిచేసే ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌ ఈ యాప్‌లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తున్నాయి.

వాయిస్‌ కమాండ్‌తోనే వివరాలు

తిరుమలలో తాగునీటి కేంద్రాలు, దర్శన ప్రవేశ ద్వారాలు, ఆసుపత్రులు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ ప్రదేశాలు తదితర ప్రాంతాలను భక్తులు సులభంగా గుర్తించవచ్చు. 24 గంటలూ అందుబాటులో ఉండే ఏఐ వాయిస్‌ అసిస్టెంట్‌ ద్వారా అవసరమైన సమాచారాన్ని పొందొచ్చు. ఇంటర్నెట్‌ సదుపాయం సరిగా లేకపోయినా మార్గాలను తెలుసుకునేలా ఆఫ్‌లైన్‌ నావిగేషన్‌ సదుపాయాన్ని కల్పించారు. యాప్‌లో 25 విభాగాలకు చెందిన 350కిపైగా ప్రదేశాల వివరాలను పొందుపరిచారు. అన్నప్రసాద కేంద్రాలు, క్యాంటీన్లు, గది కేటాయింపు కౌంటర్లు, లగేజీ కేంద్రాలు, ఉచిత పాదరక్షల డిపాజిట్‌ కేంద్రాలు, కల్యాణకట్టలు, బస్‌స్టాప్‌లు, వైద్య కేంద్రాలు, పోలీస్‌ స్టేషన్లు, టీటీడీ కార్యాలయాలు, భక్తుల సహాయ కేంద్రాలు తదితర వివరాలు ఇందులో అందుబాటులో ఉంటాయి. బస్సు మార్గాలు, సమయాలను కూడా తెలుసుకోవచ్చు.

పార్కింగ్‌ చేసిన చోటుకు సులువుగా..

భక్తులు తమ వాహనాన్ని ఎక్కడ పార్కింగ్‌ చేశారో మర్చిపోకుండా ఉండేందుకు ‘మార్క్‌ మై స్పాట్‌’ ఫీచర్‌ను అందించారు. ముఖ్యమైన ప్రదేశాలను గుర్తుగా సేవ్‌ చేసుకుని, అవసరమైనప్పుడు తిరిగి అక్కడికి చేరుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఉపయోగపడే పోలీస్‌ సేవలు, టీటీడీ హెల్ప్‌లైన్‌ నంబర్లను సైతం యాప్‌లో పొందుపరిచారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ‘వేంకటాద్రి’ యాప్‌ అందుబాటులో ఉంది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్లు లేని భక్తులు కూడా సేవలను వినియోగించుకునేలా కియోస్క్‌ల ద్వారా అందించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులకు సమాచారం, మార్గదర్శకత్వం వేగంగా అందించడం ద్వారా తిరుమలలో వారి ప్రయాణాన్ని సౌకర్యవంతంగా మార్చడంతోపాటు, స్వామివారి దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేందుకు ఈ యాప్‌ దోహదపడుతుందని టీటీడీ తెలిపింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి, అమెరికాకు చెందిన ఎన్నారై దాత జేపీ.. యాప్‌ పనితీరును ముఖ్యమంత్రికి వివరించారు. యాప్‌ను రూపొందించిన టీటీడీ బృందాన్ని చంద్రబాబు అభినందించారు.

Advertisement
Advertisement