Amarnath | మంచు బిందువులే శివలింగంగా..! అమర్‌నాథ్ మంచు శివలింగం వెనుక రహస్యమిదే..!
Amarnath | అమర్‌నాథ్ గుహలో వెలిసే మంచు శివలింగం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. ప్రతి ఏడాది సహజంగా అది ఎలా రూపుదిద్దుకుంటుంది? ఒక్కోసారి భారీగా, మరికొన్ని సార్లు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది ప్రకృతి ఒడిలో స్వయంగా ఆవిర్భవించే ఈ మంచు రూపం వెనుక ఉన్న రహస్యమేంటి? అన్న చర్చ కొనసాగుతూనే ఉంటుంది.
Devotional | Published On Jul 2, 2026, 4.37 pm IST
Amarnath | అమర్‌నాథ్ గుహలో వెలిసే మంచు శివలింగం కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం. ప్రతి ఏడాది సహజంగా అది ఎలా రూపుదిద్దుకుంటుంది? ఒక్కోసారి భారీగా, మరికొన్ని సార్లు చిన్నగా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి ఏడాది ప్రకృతి ఒడిలో స్వయంగా ఆవిర్భవించే ఈ మంచు రూపం వెనుక ఉన్న రహస్యమేంటి? అన్న చర్చ కొనసాగుతూనే ఉంటుంది. కోట్లాది మంది భక్తులు దీన్ని పరమశివుడి దివ్య స్వరూపంగా భావిస్తుంటే శాస్త్రవేత్తలు మాత్రం ఇది ప్రకృతిలో సహజంగా జరిగే భౌగోళిక ప్రక్రియ ఫలితమని వివరిస్తున్నారు. అయితే, శాస్త్రీయ వివరణ ఆధ్యాత్మిక విశ్వాసాన్ని ఏమాత్రం తగ్గించదని కూడా స్పష్టం చేస్తున్నారు. తాజాగా అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో మరోసారి మంచు శివలింగం గురించి ఆసక్తికర చర్చ సాగుతోంది.
సముద్రమట్టానికి 4వేల మీటర్ల ఎత్తులో..
జమ్మూకశ్మీర్‌లోని అమర్‌నాథ్ గుహ సముద్ర మట్టానికి సుమారు 4 వేల మీటర్ల ఎత్తులో ఉంది. శ్రీనగర్‌కు ఈశాన్యంగా దాదాపు 145 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహ ఏడాది పొడవునా తీవ్ర చలితో కప్పబడి ఉంటుంది. గుహ పైభాగంలోని సున్నపురాయి, జిప్సం శిలల్లో ఉన్న సూక్ష్మ పగుళ్ల ద్వారా హిమనదాలు, మంచు కరిగిన నీరు నెమ్మదిగా గుహలోకి చేరుతుంది. గుహ లోపల ఉష్ణోగ్రత సున్నా డిగ్రీల కంటే తక్కువగా ఉండటంతో నీటి బిందువులు ఒక్కో పొరగా గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. రోజులు గడిచేకొద్దీ ఆ పొరలు ఒకదానిపై మరొకటి పేరుకుపోతూ కింద నుంచి పైకి ఎదిగే మంచు స్తంభం ఏర్పడుతుంది. భక్తులు దర్శించే మంచు శివలింగం ఇదే. భూగర్భ శాస్త్రంలో ఈ తరహా నిర్మాణాన్ని 'ఐస్ స్టాలాగ్‌మైట్'గా పిలుస్తారు.
ఒక్కోసారి ఒక్కో పరిమాణంలో..
మంచు శివలింగం ప్రతి ఏడాది ఒకే ఆకారంలో కనిపించదు. కొన్ని సంవత్సరాల్లో భారీగా ఏర్పడితే, మరికొన్ని సందర్భాల్లో చిన్న పరిమాణంలోనే దర్శనమిస్తుంది. దీనికి వాతావరణ పరిస్థితులే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. ఆ ఏడాది మంచు కురిసిన పరిమాణం, హిమనదాల కరిగే విధానం, గుహలోని ఉష్ణోగ్రత, తేమ, గాలి ప్రవాహం వంటి అంశాలు శివలింగం పరిమాణాన్ని ప్రభావితం చేస్తాయి. యాత్ర సమయంలో వేలాది మంది భక్తులు గుహలోకి ప్రవేశించడం వల్ల లోపలి ఉష్ణోగ్రత స్వల్పంగా పెరిగి, మంచు వేగంగా కరిగే అవకాశం కూడా ఉంటుందని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. భక్తుల విశ్వాసం ప్రకారం పౌర్ణమి వరకు మంచు శివలింగం క్రమంగా పెరుగుతూ, అమావాస్య సమీపించే కొద్దీ చిన్నదవుతుంది. ఈ నమ్మకం చాలా కాలంగా కొనసాగుతోంది. శాస్త్రీయంగా చూస్తే మాత్రం.. వాతావరణ పరిస్థితుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
పార్వతీ దేవికి శివుడు అమరత్వ రహస్యం చెప్పింది ఇక్కడే..
హిందూ పురాణాల ప్రకారం.. అమర్‌నాథ్ గుహలోనే పరమశివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యం, సృష్టి గూఢార్థాన్ని వివరించినట్లు విశ్వసిస్తారు. అందుకే ఈ గుహను అత్యంత పవిత్రమైన శైవక్షేత్రంగా భావిస్తారు. ప్రతి ఏడాది క్లిష్టమైన వాతావరణం, ఎత్తయిన పర్వత మార్గాలను అధిగమించి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుని మంచు శివలింగాన్ని దర్శించుకుంటారు. మంచు శివలింగం ఏర్పడే విధానాన్ని శాస్త్రం వివరించినప్పటికీ.. ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను అది ఏమాత్రం తగ్గించలేదని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రకృతి సహజంగా సృష్టించే ఈ మంచు రూపం కోట్లాది మంది భక్తులకు దైవికస్వరూపంగా కనిపిస్తుంది. అందుకే అమర్‌నాథ్ యాత్ర కేవలం ఒక తీర్థయాత్ర మాత్రమే కాదు.. ప్రకృతి వైభవం, శాస్త్రీయ విశేషం, భక్తి విశ్వాసం ఒకేచోట కలిసే అపూర్వ అనుభూతిగా నిలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?
- ●OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ
- ●Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
- ●Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం
- ●Ponnam Prabhakar | రాహుల్‌గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదు అప్రజాస్వామికం
- ●Suman Ray | ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుమన్ రే..

India State-wise Poverty Rate | ఇండియాలో పేదరికం లెక్కలు ఇవి.. మరి ఆ ఫ్రీ రేషన్ బియ్యం ఎవరి పాలవుతోంది?

OTT | ఓటీటీలోకి మాధవన్ బయోపిక్ మూవీ - బ్రిటీషర్లను ఎదురించిన ఇండియన్ సైంటిస్ట్ కథ

Telangana Voter List 2026 | తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా రిలీజ్: మీ ఓటు భద్రంగా ఉందా? సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్

Bandi Sanjay | ఎంపీ లాడ్స్ రూ. 17.50 కోట్లు వస్తే.. రూ. 16.47 కోట్లు వినియోగించాం






