త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mumbai Local Train Murder | నిందితుడిని ఉరి తీయాల్సిందే.. అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చింది?

ముంబై లోకల్ ట్రైన్‌లో దారుణం జరిగింది. వర్షం పడుతుండటంతో రైలు తలుపు మూసివేయమని అడిగిన పాపానికి 21 ఏళ్ల యువకుడిని ఓ దుండగుడు కత్తితో దారుణంగా పొడిచి చంపాడు.

J

Crime | Published On Jun 24, 2026, 8.12 pm IST

Mumbai Local Train Murder | నిందితుడిని ఉరి తీయాల్సిందే.. అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చింది?
Advertisement
  • ముంబై లోకల్ ట్రైన్‌లో నెత్తురోడిన ఫస్ట్ క్లాస్ బోగీ
  • డోర్ వేయమన్నందుకు కత్తితో పొడిచి దారుణ హత్య
  • ముంబైలోని చర్చ్‌గేట్ - నలసోపారా ఫాస్ట్ లోకల్ ట్రైన్ ఫస్ట్ క్లాస్ బోగీలో మయాంక్ లోహర్ (21) అనే యువకుడి దారుణ హత్య
  • భారీ వర్షం కారణంగా ట్రైన్ డోర్ మూసివేసే విషయంలో తోటి ప్రయాణికుడితో జరిగిన గొడవే ఈ హత్యకు కారణం
  • కత్తితో దాడి చేసిన నిందితుడు రోషన్ సువర్ణ బోరివలి స్టేషన్‌లో పారిపోగా, పోలీసులు కుర్లాలో అరెస్ట్ చేశారు
  • నిందితుడిని ఉరితీయాలని, అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి కత్తి ఎలా వచ్చిందని అధికారులను ప్రశ్నించిన బాధితుడి తల్లి, సోదరి

Mumbai Local Train Murder | త్రినేత్ర.న్యూస్ : మహారాష్ట్ర రాజధాని ముంబైలో (Mumbai) దారుణ ఘటన వెలుగుచూసింది. నిత్యం లక్షలాది మంది ప్రయాణించే ముంబై లోకల్ ట్రైన్‌లో (Mumbai local train) ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. భారీ వర్షం పడుతుండటంతో ట్రైన్ డోర్ మూసివేసే విషయంలో జరిగిన చిన్న గొడవ.. 21 ఏళ్ల మయాంక్ లోహర్ (Mayank Lohar) ప్రాణాలను బలితీసుకుంది. ఈ దారుణానికి పాల్పడి పారిపోయిన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

గొడవకు కారణం ఏంటంటే?

విరార్ ప్రాంతానికి చెందిన మయాంక్ లోహర్ అంధేరీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకుని చర్చ్‌గేట్ - నలసోపారా ఫాస్ట్ లోకల్ ట్రైన్‌లోని (fast local train) ఫస్ట్ క్లాస్ కంపార్ట్‌మెంట్‌లో (First-class compartment) ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. గోరేగావ్ - కాందివలి స్టేషన్ల మధ్య ఈ దారుణం జరిగింది. బయట భారీ వర్షం పడుతుండటంతో, లోపలికి నీళ్లు రాకుండా డోర్ క్లోజ్ చేయాలని మయాంక్ మరో ప్రయాణికుడిని అడిగాడు. ఇదే ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది.

కత్తితో విచక్షణారహితంగా దాడి

గొడవ ముదరడంతో తోటి ప్రయాణికులు నిందితుడిని మందలించి కొట్టారు. దీంతో కోపంతో ఊగిపోయిన నిందితుడు రోషన్ సువర్ణ (Roshan Suvarna) తన బ్యాగ్‌లో నుంచి ఓ పెద్ద కత్తి (Knife) తీసి మయాంక్ కడుపులో విచక్షణారహితంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో మయాంక్ అక్కడికక్కడే రైలు నేలపై కుప్పకూలిపోయాడు. కత్తితో దాడి చేస్తుంటే తోటి ప్రయాణికులు భయంతో పక్కకు తప్పుకున్నారే తప్ప ఎవరూ అడ్డుకోలేకపోయారు. రక్తం మడుగులో పడి ఉన్న బాధితుడిని వదిలేసి, నిందితుడు దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.

పారిపోయిన నిందితుడి అరెస్ట్

రాత్రి 11:04 గంటలకు బోరివలి (Borivali) ప్లాట్‌ఫాం నెంబర్ 6 పైకి ట్రైన్ రాగానే.. పూర్తిగా ఆగకముందే నిందితుడు రోషన్ దూకేసి అక్కడి నుంచి పారిపోయాడు. రైల్వే పోలీసులు (GRP), RPF సిబ్బంది వెంటనే స్పందించి రక్తపు మడుగులో ఉన్న మయాంక్‌కు ప్రథమ చికిత్స అందించి, ఆ తర్వాత కాందివలిలోని శతాబ్ది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి (UP) పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న నిందితుడు రోషన్‌ను కుర్లాలో (Kurla) ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

భద్రత ఎక్కడుంది?.. కన్నీరుమున్నీరుగా కుటుంబసభ్యులు

చేతికొచ్చిన కొడుకు దారుణంగా హత్యకు గురికావడంతో మయాంక్ తల్లి, సోదరి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. "నా కొడుకు ఎవరితోనూ గొడవ పడేవాడు కాదు.. దయచేసి వాడికి న్యాయం చేయండి, నిందితుడికి ఉరిశిక్ష వేయండి" అని బాధితుడి తల్లి కన్నీటిపర్యంతమైంది.

అసలు ఫస్ట్ క్లాస్ బోగీలోకి అంత పెద్ద కత్తి ఎలా వచ్చింది? రాత్రి వేళ ట్రైన్‌లో పోలీసుల భద్రత (Security) ఎక్కడుంది? అని మయాంక్ సోదరి అధికారులను నిలదీసింది. "ఈరోజు నా తమ్ముడు పోయాడు, కఠినంగా శిక్షించకపోతే రేపు ఇంకొకరి ప్రాణం పోతుంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన ముంబై రైల్వే భద్రతా వైఫల్యాలపై పలు ప్రశ్నలను రేకెత్తిస్తోంది.

Advertisement
Advertisement